Saturday, November 15, 2025
HomeTop StoriesAtla Taddi: అట్లతద్దొయ్‌ ఆరట్లు..ముద్దపప్పోయ్‌ మూడట్లు..అచ్చ తెలుగింటి పండగ పూజా విధానం...!

Atla Taddi: అట్లతద్దొయ్‌ ఆరట్లు..ముద్దపప్పోయ్‌ మూడట్లు..అచ్చ తెలుగింటి పండగ పూజా విధానం…!

Atla Taddi Festival Story: తెలుగింటి స్త్రీలు ఎంతో భక్తితో ఆచరించే వ్రతాలలో అట్లతద్ది ఒకటి. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలో బహుళ కృష్ణ పక్షంలోని తదియ తిథినే ఈ వ్రతానికి ముఖ్యదినంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఆ తిథి అక్టోబర్ 9వ తేదీ గురువారం వచ్చింది. ఈ రోజు మహిళలు ఉపవాసం ఉండి గౌరీదేవి, చంద్రుడికి పూజ చేస్తారు. పెళ్లి కాని యువతులు మంచి జీవిత భాగస్వామి దొరకాలని, పెళ్లైన స్త్రీలు భర్త దీర్ఘాయుష్షు, ఆరోగ్యం కోసం ఈ వ్రతాన్ని చేసుకుంటారు.

- Advertisement -

అట్లతద్దికి ముందురోజు నుంచే..

అట్లతద్దికి ముందురోజు నుంచే ఏర్పాట్లు మొదలవుతాయి. ఆ రోజు సాయంత్రం స్త్రీలు చేతులు, కాళ్లకు గోరింటాకు పెట్టుకుంటారు. ముత్తైదువులకు కూడా గోరింటాకు పంచి పెడతారు. ఇల్లు మొత్తం శుభ్రం చేసుకుని గుమ్మాల వద్ద మామిడాకులతో తోరణాలు కడతారు. ఉదయం తెల్లవారగానే నిద్రలేచి స్నానం చేసి పూజకు సిద్ధమవుతారు. చుక్క కనిపించే సమయానికి ముందుగానే భోజనం చేస్తారు. ఆ భోజనంలో సాధారణంగా బెండకాయ చింతకాయ కూర, గోంగూర పచ్చడి, పొట్లకాయ కూర, ముద్దపప్పు, పెరుగు వంటి వంటకాలు ఉంటాయి. భోజనం తరువాత సాయంత్రం పూజ పూర్తయ్యేవరకు నీరు కూడా తాగకుండా ఉపవాసం పాటిస్తారు.

Also Read: https://teluguprabha.net/devotional-news/crow-sounds-meaning-in-astrology-explained/

భోజనం పూర్తయ్యాక స్త్రీలు గుంపులుగా ఏర్పడి అట్లతద్దోయ్ అంటూ పాటలు పాడుతూ ఆటలు ఆడుతారు. ఊయల ఊగుతూ సాయంత్రం వరకూ సంతోషంగా గడుపుతారు. ఆ రోజుని ఆహ్లాదంగా, ఆనందంగా జరుపుకోవడం ఈ వ్రతానికి ముఖ్యమైన అంశం.

11 మంది ముత్తయిదువులతో..

పూజా సమయం రాగానే స్త్రీలు 11 మంది ముత్తయిదువులతో పాటు ఉపవాసం చేస్తారు. గౌరీదేవికి ఇష్టమైన అట్లు, పులిహోర, కుడుములు, పాలతాలికలు తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. పూజలో వాడే తోరణాలను చామంతి పువ్వులు, తులసి, తమలపాకు వంటి పత్రాలతో 11 ముడులుగా కట్టి సిద్ధం చేస్తారు.

గౌరీదేవిని చేసి, గణపతిని కూడా..

పసుపుతో గౌరీదేవిని చేసి, గణపతిని కూడా ప్రతిష్ఠించి పూజ చేస్తారు. పసుపు కుంకుమలు, పూలతో అలంకరించిన బియ్యం మీద కుడుములు పెట్టి దానిని కైలాసంగా భావిస్తారు. ముందుగా గణపతికి పూజ చేసి, తర్వాత లలితా సహస్రనామం, గౌరీ అష్టోత్తరం పఠిస్తారు. అనంతరం అట్లతద్ది వ్రతకథను చదువుతారు.

ఇస్తినమ్మ వాయనం”-పుచ్చుకుంటినమ్మ వాయనం”

పూజ అనంతరం ఒక్కో ముత్తయిదువుకి 11 అట్లు వాయనంగా ఇస్తారు. వాయనం ఇవ్వడంలో ప్రత్యేక పద్ధతి ఉంటుంది. ఇచ్చే స్త్రీ “ఇస్తినమ్మ వాయనం” అని చెబుతుంది, అందుకునే స్త్రీ “పుచ్చుకుంటినమ్మ వాయనం” అని సమాధానం ఇస్తుంది. ఈ విధంగా పూజా పరంపర కొనసాగుతుంది. వాయనంగా ఇచ్చిన అట్లను ఆ స్త్రీలు లేదా వారి కుటుంబ సభ్యులు మాత్రమే తినాలి. వాయనంలో చీర లేదా జాకెట్ ముక్క ఇవ్వడం అనేది ఆచారంగా వస్తుంది.

Also Read:https://teluguprabha.net/devotional-news/venus-transit-brings-luck-and-wealth-for-four-zodiac-signs/

ఈ వ్రతానికి సంబంధించిన ఒక పురాతన కథ కూడా ఉంది. సునామ అనే రాజకుమార్తె అట్లతద్ది నోము నోచుకుంటే మంచి భర్త లభిస్తాడని విని వ్రతం ఆచరించింది. పగలంతా నీరు కూడా తాగకుండా ఉపవాసం ఉండగా అలసటతో మూర్ఛపోయింది. ఆమె అన్నలు బాధపడి చింతచెట్టుకు అద్దం కట్టి, దానికి ఎదురుగా మంట వేసి చంద్రుడిని చూపినట్లు మోసం చేశారు. సునామ చంద్రుడు దర్శించానని భావించి భోజనం చేసింది. కానీ అది నిజమైన చంద్రోదయం కాకపోవడంతో ఆమె వ్రతం పూర్తిగా సఫలం కాలేదు.

పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై..

కాలం గడిచిన తరువాత ఆమె పెళ్లి వయస్సు రాగానే తగిన సంబంధాలు రాకపోవడంతో విచారించింది. చివరికి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై ఆమెకు వ్రతంలో తప్పు వివరించి, మరుసటి ఏడాది నియమ నిష్టలతో వ్రతం చేయమని సూచించారు. సునామ ఆ విధంగా వ్రతం పూర్తి చేయగానే మంచి, యువకుడైన భర్త లభించాడు. ఈ కథతో అట్లతద్ది వ్రతం విశిష్టత మరింత పెరిగింది.

ఉపవాసం పద్ధతి..

ఉపవాసం పద్ధతి కూడా ప్రత్యేకంగా ఉంటుంది. ఆ రోజు తెల్లవారుజామునే స్త్రీలు లేచి స్నానం చేసి, చుక్క ఉన్న సమయంలో భోజనం చేస్తారు. తర్వాత చంద్రోదయం వరకు ఏమీ తినరు, తాగరు. చంద్ర దర్శనం అయిన తర్వాత స్నానం చేసి అట్లు వేసి గౌరీదేవికి నైవేద్యం పెట్టి, పూజ పూర్తిచేస్తారు. కథ చెప్పి అక్షతలు వేసుకుని, ఒక ముత్తయిదువుకి పదట్లు వాయనంగా ఇచ్చి వ్రతం ముగిస్తారు.

Also Read:https://teluguprabha.net/devotional-news/venus-transit-brings-luck-and-wealth-for-four-zodiac-signs/

ఈ విధంగా పది సంవత్సరాలు వ్రతం కొనసాగించి, పదకొండవ సంవత్సరంలో ఉద్యాపన చేయడం ఆచారం. ఈ వ్రతం స్త్రీల భక్తి, ఓర్పు, శ్రద్ధలను ప్రతిబింబించే ఆధ్యాత్మిక సంప్రదాయం. గౌరీదేవి అనుగ్రహంతో కుటుంబ సుఖశాంతులు కలగాలని ఆశిస్తూ అట్లతద్ది నోము నిర్వహిస్తారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad