Hariyali Amavasya 2025 Date and Time: రేపటి నుంచి శ్రావణ మాసం మెుదలుకాబోతుంది. ఇది శివుడికి ఎంతో ప్రీతిపాత్రమైనది. ఈ నెలలో పార్వతీపరమేశ్వరులను భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల మీరు కోరుకున్నది జరుగుతుంది. ఈ శ్రావణ మాసంలో వచ్చే అమావాస్యనే హరియాలి అమావాస్య లేదా శ్రావణ అమావాస్య అని పిలుస్తారు. సనాతన ధర్మంలో ఈ రోజును చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈశుభదినాన పవిత్ర నదుల్లో స్నానమాచరించి తర్పణాలు వదలడం మరియు దానాలు చేయడం వల్ల మీరు అనుకున్నది సిద్ధిస్తుంది.
హరియాలీ అమావాస్య తేదీ, శుభ ముహూర్తాలు
ఈ ఏడాది హరియాలీ అమావాస్యను గురువారం, 24 జూలై 2025న జరుపుకోనున్నారు. అమావాస్య తిథి జూలై 24 తెల్లవారుజామున 2:28 గంటలకు ప్రారంభమై.. తర్వాత రోజు(జూలై 25) మధ్యాహ్నం 12:40 గంటలకు ముగుస్తుంది. పంచాంగం ప్రకారం, ఉదయ తిథి ఆధారంగానే అమావాస్యను లెక్కిస్తారు. ఈరోజున స్నానదాన సమయం ఉదయం 4:15 నుండి 4:57 వరకు, అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:00 నుండి 12:55 వరకు, మధ్యాహ్నం 2:26 నుండి 3:58 వరకు అమృత కాలం ఉంటుంది.
ఈ అమావాస్య నాడు శివుడిని పూజించడంతోపాటు జలాభిషేకం చేస్తే మంచి ఫలితాలను పొందుతారని పండితులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ పవిత్రదినాన పూర్వీకులకు తర్పణాలు వదలడం, దానం చేయడం వల్ల వారు సంతోషించి మిమ్మల్ని ఆశీర్వాదిస్తారు. దీంతో మీకు జీవితంలో ఐశ్వర్యంతోపాటు ఆనందం కూడా ఉంటుంది. ఈరోజున మథురలోని ద్వారకాధీశ ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు.
ఆ రోజే పవిత్రమైన యోగాలు
ఈ రోజునే కొన్ని శుభయోగాలు కూడా ఏర్పడుతున్నాయి. అవే గురు పుష్య యోగం, సర్వార్థ సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగం. ఏదైనా కొత్త పని ప్రారంభించాలన్నా, మతపరమైన కార్యక్రమాలు చేయాలన్నా ఈ యోగాలు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. అద్భుతమైన యోగాలతో వచ్చే హరియాలి అమావాస్యను సక్రమంగా జరుపుకుంటే మీకు జీవితంలో దేనికీలోటు ఉండదు.


