బనగానపల్లె మండలంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మండలంలోని నందవరం గ్రామంలో వెలసిన శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి దేవస్ధానం నందు అమ్మవారిని ప్రాతః కాలం నందే మేల్కొలిపి ప్రాతః కాల అర్చన , అభిషేకాది విశేష పూజలు నిర్వహించి అటు తరవాత యాగశాలలో ఆలయ వేద పండితుల, అర్చకులు ఆద్వర్యంలో గణపతి పూజ, పుణ్యఃవచన, అంకురార్పణ, కళశస్థాపనాది క్రతువులు నిర్వహించారు. ఇందులో భాగంగా అమ్మవారి ఉత్సవమూర్తి మొదటి రోజు శైలపుత్రి అలంకారంలో భక్తులను అనుగ్రహించారు.
సాయంత్రం ప్రాకార రథోత్సవం నిర్వహించారు. ఇందులో ఆలయ అసిస్టంట్ కమిషనర్, కార్యనిర్వాహణాధికారిణి జి కామేశ్వరమ్మ, మాజీ చైర్మన్ కుమార్ రెడ్డి పాల్గొని భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పర్యవేక్షించారు. అలాగే బనగానపల్లె పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి దేవస్థానంలో వాసవి మాత శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కార్యక్రమంలో ఆర్యవైశ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.