Turtle Benefits:ఇటీవలి కాలంలో చాలా మంది తమ ఇళ్లలో తాబేలు పెంచుకోవడంపై ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది కేవలం ఒక అలవాటు మాత్రమే కాకుండా, మతపరమైన విశ్వాసాలు, వాస్తు, ఫెంగ్‌షుయ్ శాస్త్రాల ప్రకారం కూడా శుభప్రదంగా పరిగణిస్తారు. ముఖ్యంగా హిందూ మతం ప్రకారం తాబేలు విష్ణువు యొక్క కూర్మావతారానికి ప్రతీకగా భావిస్తారు. అందుకే, ఇంట్లో లేదా కార్యాలయంలో తాబేలు ఉంచడం వలన ఆధ్యాత్మికంగా, శాస్త్రపరంగా అనేక రకాల సానుకూల ప్రభావాలు కలుగుతాయని నమ్మకం ఉంది.
పాజిటివ్ ఎనర్జీ..
వాస్తు శాస్త్రం చెబుతున్న దాని ప్రకారం, తాబేలు ఉన్న ప్రదేశంలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ప్రతికూల శక్తులు దూరమై, ఆ ప్రాంతంలో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. ఫెంగ్‌షుయ్ నిపుణులు కూడా తాబేలు ఉన్న ఇళ్లలో వ్యక్తుల ఆయుష్షు పెరుగుతుందని, కుటుంబంలో ఆనందం, శాంతి నిలిచి ఉంటుందని పేర్కొంటున్నారు.
దీర్ఘాయుష్షుకు సూచనగా..
తాబేలు ఎక్కువ కాలం జీవించే ప్రశాంత జీవి. ఇది మనుషుల జీవితంలో స్థిరత్వం, దీర్ఘాయుష్షుకు సూచనగా పరిగణిస్తారు. తాబేలును గాజు పాత్రలో నీటితో ఉంచడం మంచిదని చెబుతారు. ఆ నీటిని ప్రతిరోజూ మార్చడం, అందులో తులసి ఆకు వేయడం శుభప్రదంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఇల్లు విడిచి బయలుదేరే ముందు తాబేలును చూసి వెళ్తే దోషాలు తొలగిపోతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా, తాబేలు దగ్గర నెయ్యి దీపం వెలిగించడం ధనలాభాలకు దారి తీస్తుందని నమ్మకం ఉంది.
ధైర్యం, శ్రేయస్సు, సంపదకు..
హిందూ పురాణాల్లో కూడా తాబేలు ప్రాధాన్యం విశేషంగా వర్ణించారు. క్షీరసాగర మథన సమయంలో విష్ణువు తాబేలు రూపంలో ప్రత్యక్షమై మందర పర్వతాన్ని తన వీపుపై మోసాడని కథల్లో చెప్పిన సంగతి తెలిసిందే. ఈ కారణంగా తాబేలు ధైర్యం, శ్రేయస్సు, సంపదకు ప్రతీకగా భావిస్తారు.
ఉత్తర దిశలో ఉంచడం..
వాస్తు ప్రకారం, తాబేలు చిత్రాన్ని లేదా విగ్రహాన్ని ఉత్తర దిశలో ఉంచడం చాలా శుభకరం. ఉత్తర దిశను లక్ష్మీదేవి దిశగా భావిస్తారు కాబట్టి, ఆ దిశలో తాబేలు ఉంచడం ద్వారా ఆర్థిక పరిస్థితి మెరుగవుతుందని, శత్రువుల ప్రభావం తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇల్లు లేదా వ్యాపార స్థలం ప్రధాన ద్వారం వద్ద తాబేలు చిత్రాన్ని ఉంచితే ఆర్థికాభివృద్ధి, వ్యాపార విజయాలు వస్తాయని విశ్వసిస్తారు.
అష్టధాతువుతో చేసిన తాబేలు..
క్రిస్టల్‌తో చేసిన తాబేలు, ఇత్తడి లేదా అష్టధాతువుతో చేసిన తాబేలు విగ్రహం కూడా శుభప్రదంగా భావిస్తారు. వీటిని నీటితో నింపిన పాత్రలో ఉంచడం మంచిదని చెబుతారు. ఇలాంటివి కుటుంబంలో ఐశ్వర్యం, సుఖసంతోషాలను పెంచుతాయని నమ్మకం ఉంది.
ఫెంగ్‌షుయ్ ప్రకారం, తాబేలు ఎప్పుడూ బెడ్‌రూం లో ఉంచకూడదు. ఆ ప్రదేశంలో తాబేలు ఉండడం ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాబేలు ఉంచడానికి అత్యంత అనుకూలమైన ప్రదేశం ఇంటి డ్రాయింగ్‌రూం లేదా హాల్. అలాగే, తాబేలు నోరు ఎప్పుడూ ఇంటి లోపలికి వైపు చూడేలా ఉంచాలి.
జంట తాబేళ్లను..
కుటుంబంలో తరచూ గొడవలు జరిగే పరిస్థితుల్లో, ఒక జంట తాబేళ్లను ఇంట్లో ఉంచడం మంచిదని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. దీనివల్ల విభేదాలు తగ్గిపోతాయి, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు పెరుగుతాయి. ఇల్లు లేదా వ్యాపారంలో సమస్యలు ఎదురవుతున్నప్పుడు కూడా తాబేలు ఉంచడం వల్ల ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయని చెబుతారు.
Also Read: https://teluguprabha.net/devotional-news/vastu-tips-for-old-wallet-and-its-impact-on-money/


