Bhagini Hasta Bhojanam:దీపావళి ఉత్సవం ముగిసిన రెండవ రోజున జరుపుకునే భాయ్ దూజ్ లేదా భగినీహస్త భోజనం అన్నాచెల్లెల మధ్య ఉన్న ప్రేమ, అనుబంధానికి ప్రతీకగా పరిగణిస్తారు. ఈ రోజున సోదరీమణులు తమ అన్నల దీర్ఘాయుష్షు, సుఖశాంతి, ఆరోగ్యం కోసం ప్రార్థిస్తారు. అలాగే తమ చేతివంటతో అన్నకు భోజనం పెట్టి తిలకం పెట్టి ఆయన శ్రేయస్సు కోరుతారు. ఈ పండగ భారతీయ కుటుంబ విలువలు, బంధాలకు ప్రతీకగా నిలుస్తుంది.
సాంప్రదాయం ప్రకారం, దీపావళి తర్వాతి రోజు అన్నాచెల్లెలు పండగగా పిలుస్తారు. ఇది కార్తీక మాస శుద్ధ విదియ నాడు జరుపుకుంటారు. ఈ సందర్భంలో సోదరీమణులు తమ సోదరుడి నుదిటిపై తిలకం పెట్టి, దీపం వెలిగించి, ఆయన ఆరోగ్యం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఆ తర్వాత తమ చేతితో వండి తయారుచేసిన వంటకాలను అన్నకు వడ్డిస్తారు. ఈ తిలకం వేయడం కేవలం ఆచారం మాత్రమే కాదు, అది సోదర ప్రేమకు చిహ్నం కూడా.
యమధర్మరాజు-యమున కథ…
భారతీయ పురాణాల్లో ఈ పండగకు ఉన్న ప్రాముఖ్యత ప్రత్యేకం. యమధర్మరాజు, ఆయన చెల్లెలు యమున కథ ఈ పండగకు మూలంగా చెప్పబడుతుంది. పురాణాల ప్రకారం, సూర్యభగవానుడి సంధ్యాదేవికి పుట్టిన యమధర్మరాజు, యమున సోదర సోదరీమణులు. యమున తన అన్నను ఎంతో ప్రేమతో చూసేది. తరచుగా తన ఇంటికి భోజనానికి రావాలని ఆహ్వానించేది. కానీ యమధర్మరాజు తన ధర్మకార్యాలలో బిజీగా ఉండటంతో చెల్లెలు కోరిక తీర్చలేకపోయాడు. కాలం గడుస్తూ ఉండగా ఒక రోజు కార్తీక శుద్ధ విదియ నాడు యమధర్మరాజు చెల్లెలి ఇంటికి వెళ్లాలని నిర్ణయించాడు.
అపమృత్యు దోషం…
ఆ రోజు యమున ఎంతో ఆనందంగా తన అన్నకు ఇష్టమైన వంటకాలను సిద్ధం చేసింది. యముడు వచ్చి ఆమె వండిన భోజనాన్ని ప్రేమగా తిన్నాడు. భోజనం ముగిసిన తర్వాత చెల్లెలి సేవతో సంతోషించిన యముడు ఆమెకు వరం కోరమన్నాడు. అప్పుడు యమున తన అన్నను చూసి, “ఈ రోజు నా అన్న నా ఇంటికి వచ్చి భోజనం చేసినట్లుగా ఎవరైనా తమ సోదరీమణుల చేతి వంట భోజనం చేస్తే వారికి అపమృత్యు దోషం తగలనివ్వకు” అని కోరింది. ఆమె కోరికను అంగీకరించిన యముడు “తథాస్తు” అని దీవించి వెళ్లిపోయాడు. అప్పటి నుంచీ కార్తీక శుద్ధ విదియ నాడు సోదరులు చెల్లెల్ల ఇంటికి వెళ్లి భోజనం చేయడం, తిలకం వేయించుకోవడం ఆచారంగా మారింది.
భగినీహస్త భోజనం” లేదా “అన్నా చెల్లెలు పండగ..
ఈ సంప్రదాయం భారతదేశంలో భిన్న పేర్లతో జరుపుకుంటారు. ఉత్తర భారతదేశంలో దీనిని “భాయ్ దూజ్” అని పిలుస్తారు. దక్షిణ భారతదేశంలో “భగినీహస్త భోజనం” లేదా “అన్నా చెల్లెలు పండగ”గా ప్రసిద్ధి పొందింది. పేర్లు వేర్వేరు అయినా, భావం మాత్రం ఒకటే సోదర సోదరీమణుల ప్రేమ, రక్షణ, నమ్మకం.
ఈ పండగ రోజున సోదరీమణులు తెల్లవారుజామున స్నానం చేసి, పూజకు సిద్ధమవుతారు. తరువాత పూజా స్థలంలో దీపాలు వెలిగించి, యమధర్మరాజు, యమున దేవతకు నమస్కరిస్తారు. తిలకం పెట్టే సమయంలో ఉంగరపు వేళ్లు ఉపయోగించడం శుభప్రదమని నమ్మకం. ఈ వేలు పవిత్రతకు చిహ్నమని భావిస్తారు. కొందరు బొటనవేళ్లు సంపదకు సంకేతం కాబట్టి వాటిని ఉపయోగించరాదని విశ్వసిస్తారు.
ప్రేమతో బహుమతులు..
సోదరులు కూడా ఈ రోజున తమ చెల్లెల్లకు ప్రేమతో బహుమతులు ఇస్తారు. అది డబ్బు, వస్త్రం లేదా చిన్న గుర్తుగా ఉండొచ్చు. ఈ బహుమతి కేవలం ఒక వస్తువు కాదు, చెల్లెలు పట్ల కృతజ్ఞతా భావం అని కూడా చెప్పవచ్చు. ఈ పండగ అన్నాచెల్లెల మధ్య ఉన్న భావోద్వేగ బంధాన్ని మరింతగా బలపరుస్తుంది.
Also Read:https://teluguprabha.net/devotional-news/feng-shui-tips-to-attract-positive-energy-and-prosperity/
2025 సంవత్సరంలో భాయ్ దూజ్ లేదా అన్నా చెల్లెలు పండగ అక్టోబర్ 23న జరుపుకుంటారు. పంచాంగం ప్రకారం, విదియ తిథి అక్టోబర్ 22న రాత్రి 8:16 గంటలకు ప్రారంభమై, అక్టోబర్ 23న రాత్రి 10:46 గంటలకు ముగుస్తుంది. అందువల్ల అక్టోబర్ 23న పండగ జరుపుకోవడం అత్యంత శుభప్రదంగా పరిగణిస్తారు. ఆ రోజు మధ్యాహ్నం సమయం తిలకం పెట్టడానికి ఉత్తమ సమయంగా భావిస్తారు.


