Bhima Shankaram temple story : సహ్యాద్రి పర్వత పచ్చని పరువాల మధ్య, ప్రకృతి సోయగాల నడుమ వెలసిన పరమ పవిత్ర క్షేత్రం భీమ శంకరం. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఆరవదిగా పూజలందుకుంటున్న ఈ ఆలయ పేరు వెనుక ఓ రాక్షసుని కథ దాగి ఉంది. అసలు పరమేశ్వరుడి పవిత్ర జ్యోతిర్లింగానికి ఓ రాక్షసుని పేరు ఎందుకు వచ్చింది? ఆ భీకర యుద్ధ సమయంలో శివుడి శరీరం నుంచి జారిన చెమట చుక్కలు ఓ జీవనదిగా ఎలా మారాయి? కార్తిక మాసం వేళ ఆ శివయ్య లీలను, క్షేత్ర మహాత్మ్యాన్ని తెలుసుకుందాం.
స్థల పురాణం – రాక్షసుని కథ : పురాణ గాథల ప్రకారం, త్రేతాయుగంలో కుంభకర్ణుని వంశాంకురమే ఈ క్షేత్ర నామానికి కారణమైంది. కుంభకర్ణుని భార్య కర్కటి. కుంభకర్ణుడు మరణించే సమయానికి ఆమె గర్భవతి. ఆ తర్వాత ఆమెకు ‘భీముడు’ అనే కుమారుడు జన్మించాడు. తన తండ్రి మరణానికి శ్రీరాముడే కారణమని తల్లి ద్వారా తెలుసుకున్న భీముడు, ప్రతీకార జ్వాలతో రగిలిపోయాడు. అపారమైన శక్తిని సంపాదించేందుకు బ్రహ్మ దేవుని గురించి ఘోర తపస్సు చేశాడు.
భీముని తపస్సుకు మెచ్చిన బ్రహ్మ, అతనికి అజేయమైన శక్తిని వరంగా ప్రసాదించాడు. ఆ వరగర్వంతో భీముడు మూడు లోకాలను గడగడలాడించాడు. దేవతలను, ఋషులను హింసిస్తూ స్వర్గాన్ని సైతం ఆక్రమించాడు. అతని దురాగతాలు భరించలేక దేవతలందరూ పరమశివుని శరణు వేడారు.
శివుని ఆగమనం – భీముని సంహారం : దేవతల మొర ఆలకించిన మహేశ్వరుడు, భీముని దురాగతాలకు అడ్డుకట్ట వేయాలని నిశ్చయించుకున్నాడు. ‘వినాశకాలే విపరీత బుద్ధి’ అన్నట్లు, శివుని హెచ్చరికలను పెడచెవిన పెట్టిన భీముడు, పరమేశ్వరునిపైకే యుద్ధానికి తలపడ్డాడు. ఇరువురి మధ్య వేల సంవత్సరాల పాటు భీకరమైన యుద్ధం జరిగింది. బ్రహ్మ వరం ఉన్నప్పటికీ, శివుని దివ్యశక్తి ముందు భీముడు నిలవలేకపోయాడు. చివరికి ఆ ముక్కంటి చేతిలో హతమయ్యాడు. భీముని సంహరించిన తర్వాత, లోక కల్యాణం కోసం అదే ప్రదేశంలో జ్యోతిర్లింగ రూపంలో వెలసి ఉండమని దేవతలు ప్రార్థించగా, శివుడు అంగీకరించాడు. భీముడనే రాక్షసుడిని సంహరించిన శంకరుడు కాబట్టి, ఈ క్షేత్రానికి “భీమ శంకరం” అని పేరు స్థిరపడింది.
చెమట చుక్కల నుంచి జీవనది : భీమునితో జరిగిన భీకర యుద్ధ సమయంలో, పరమశివుని శరీరం నుంచి జారిన చెమట బిందువులు భూమిపై పడి, ఒక నదిగా ప్రవహించడం ప్రారంభించాయని స్థల పురాణం చెబుతోంది. ఆ నదియే నేటి “భీమా నది”. భక్తులు ఈ నదిలో పుణ్యస్నానమాచరించి స్వామిని దర్శించుకోవడం ఇక్కడి సంప్రదాయం.
ఆలయ విశేషాలు : పశ్చిమ కనుమలలోని పచ్చని అడవుల మధ్య కొండ చరియల్లో ఈ ఆలయం కొలువై ఉంది. ఆలయాన్ని చేరుకోవడానికి భక్తులు కొంత దూరం కాలినడకన ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ ప్రయాణం మరపురాని ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది. గర్భాలయంలో భీమశంకరుడు జ్యోతిర్లింగ రూపంలో దర్శనమిస్తాడు.
పూజలు, ఉత్సవాలు : ఈ క్షేత్రంలో ప్రతిరోజూ త్రికాల పూజలు శాస్త్రోక్తంగా జరుగుతాయి. శ్రావణ, కార్తిక, మాఘ మాసాల్లో, ముఖ్యంగా మహాశివరాత్రి పర్వదినాన ఇక్కడ జరిగే ఉత్సవాలు అత్యంత వైభవంగా ఉంటాయి. ఈ ఉత్సవాలను తిలకించడానికి దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తారు. భారతదేశ ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీకగా నిలిచే ఈ భీమ శంకర క్షేత్ర దర్శనం, శత్రుజయాన్ని, ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.


