Sunday, October 6, 2024
HomeదైవంBoddemma: బొడ్డెమ్మ-పండుగ, ప్రాధాన్యత

Boddemma: బొడ్డెమ్మ-పండుగ, ప్రాధాన్యత

గౌరీ దేవిని పిల్లలు పూజించటాన్ని బొడ్డెమ్మ పండుగ అంటారు

సృష్టిలో ప్రతి జీవిది బ్రతుకు పోరాటమే బ్రతుకుతో ప్రత్యక్ష సంబంధం ఉన్న పండుగ బతుకమ్మ. ప్రకృతితో మనిషికి ఉండే సంబంధాన్ని స్పష్టంగా చెప్పే పండుగ. ప్రత్యేకించి తెలంగాణ ఆడపడుచులకు అన్ని పండగల కెల్లా పెద్ద పండుగ బతుకమ్మ. స్త్రీలలో ఉన్న అద్వితీయమైన శక్తిని వెలికి తీసే పండుగ తెలంగాణ స్త్రీల హృదయం బతుకమ్మ పండుగ. బతుకమ్మ పండుగ గురించి అందరికీ సుపరిచితమే కానీ బతుకమ్మ కంటే ముందు బొడ్డెమ్మ పండుగను చేయడం పురాతన కాలం నుండి వస్తున్న సాంప్రదాయం
పెళ్లి కావలసిన కన్నెపిల్లలు బొడ్డేమ్మను పూజిస్తారు సుమంగళి భాగ్యం కోరుకునే ముత్తయిదువలు సద్దుల బతుకమ్మను పేర్చి జరుపుకునే పూర్తిస్థాయి మహిళల పండుగ బతుకమ్మ. గౌరీ దేవియే బొడ్డెమ్మగా అవతరించి సకల ప్రాణులకు మరియు బాలలకు సంతోషాన్నిస్తుంది. బొడ్డెమ్మ బతుకమ్మ పండుగలు ఒకదాని వెంట ఒకటి జరుపుకునేవే ఒకదానికి ఒకటి సంబంధం ఉన్న పండుగలు రెండు గౌరీదేవి రూపాలే. రెండు పండగల్లో పాటలు ఒకే విధంగా ఉంటాయి బొడ్డెమ్మ పిల్లల పండగ అయితే బతుకమ్మ పెద్దల పండుగ.
ఈ పండుగను వినాయక చవితి తర్వాత వచ్చే భాద్రపద బహుళ పంచమి నుండి ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమికి ముందు వచ్చే అమావాస్య వరకు బొడ్డెమ్మ పండుగ జరుపుకుంటాం.
మన తెలంగాణలో సాధారణంగా భాద్రపద బహుళ పంచమి నాటికి మెట్ట పంటలన్నీ ఇండ్లకు చేరుతాయి. ధాన్య లక్ష్మి ఇంట్లో కళకళలాడుతుంది రాబోయే బతుకమ్మ పండుగకు ఇల్లు వాకిలి శుభ్రం చేసి ముగ్గులు పెట్టడంలో పెద్దలు నిమగ్నమై ఉంటారు వారికి బొడ్డెమ్మను ఆడే తీరిక ఉండదు ఉత్సాహం ఆపుకోలేని పిల్లలు సంబరంగా బొడ్డెమ్మను ఆడుకుంటారు.
వినాయక చవితి తర్వాత వచ్చే భాద్రపద బహుళ పంచమి నుండి శుద్ధ పాడ్యమికి ముందు వచ్చే అమావాస్య వరకు బొడ్డెమ్మ పండుగ జరుపుకుంటాం.
బొడ్డెమ్మ అంటే బొట్టే, బొడప, బొటీమ, పొట్టి అని అర్థాలు ఉన్నాయి. మొత్తానికి బొడ్డెమ్మ అంటే చిన్నదని అర్థం. బుడ్డమ్మ అంటే ధాన్యపురాశి ధాన్యపు కుప్ప అని కూడా అనుకోవచ్చు.
పిల్లలందరూ పొద్దున్నే సుచిగా శుభ్రంగా తయారై పాలు నీళ్లు పసుపు కుంకుమ పూలు తీసుకొని పుట్ట దగ్గరికి పాలు నీళ్లు చల్లి పసుపు కుంకుమలు సమర్పించి పూలతో పూజించి అలంకరించి పుట్టకు భక్తి శ్రద్ధలతో పూజలు చేసి పుట్టమన్ను తవ్వుకొని తీసు కొస్తారు. ఒక చెక్క పీటపై మూడు లేదా ఐదు లేదా తొమ్మిది దొంతరలుగా బొడ్డెమ్మను తయారు చేసి ఎర్రమట్టితో అలికి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి గన్నేరు ద్రాక్ష, కట్ల, కాకర, బీర, బంతి, జాజి పూలతో అలంకరించి పైన శిఖరం ప్రదేశంలో బియ్యంతో నిండిన కలశాన్ని పెట్టి కొత్త రవిక బట్టను దానిపై ఉంచి తమలపాకులు, పసుపు గౌరమ్మను పెడతారు.
నేలపైన అలికి ముగ్గులు పెట్టి బొడ్డెమ్మ పీటను తెచ్చి ఆ ముగ్గుపై ఉంచి ప్రతిరోజు పిడికెడు బియ్యాన్ని తెచ్చి కలశంలో పోసి తెచ్చిన పసుపు కుంకుమలను వేసి పూలతో బొడ్డెమ్మను అలంకరించి పిల్లలందరూ చుట్టూ చేరి ఆడుతూ పాడుతూ కోలాటాలు వేస్తూ భక్తి శ్రద్ధలతో బొడ్డెమ్మ పేరుతో పిలవబడే గౌరమ్మను భక్తితో పూజిస్తారు.
బొడ్డెమ్మ బొడ్డెమ్మ కోల్‌…
బిడ్డాలెందారేదారే కోల్‌…
నీ బిడ్డ నీల గౌరు కోల్‌ -…
నిత్య మల్లె చెట్టేసి కోల్‌ ….
నిత్యమల్లె చెట్టూకు కోల్‌…
నిత్యం నీళ్ళు పోసి కోల్‌…
కాయలు బిందెలు కోల్‌….
ఘనమైన కాతా కోల్‌ ….
కాయలన్నీ దింపి కోల్‌ ….
కడవల్లా పోసి కోల్‌….
తెంపిన కాయల్లు కోల్‌…..
బండికి ఎత్తంగా కోల్‌…
పోయేనే ఆ బండి కోల్‌ ….
ఐలోని దాకా కూల్‌ …..
ఐలోని మల్లన్న కోల్‌….
పండ్లోయి పండ్లు కోల్‌…..
ఏమి పండ్లో కానీ కోల్‌….
ఎంతో గుమగుమ కోల్‌….
చూసేటోరేగాని కోల్‌…
కొనేటోరు లేరు కోల్‌….
ఆ నుండి ఆ బండి కోల్‌….
కొమ్మాలా దాక కోల్‌…..
కొమ్మాల నరసింహ స్వామి కోల్‌ ….
పండ్లోయి పండ్లు కోల్‌…..
అంటూ పాట ఇలా సాగిపోతుంది బొడ్డెమ్మ బిడ్డ పేరు నీలగౌరు ఆమె నిత్య మల్లె చెట్టు పెట్టి నిత్యం నీళ్లు పోసేదట చెట్లు పెరిగి కాయలు పండ్లు ఘనంగా కాసిందట ఆ పళ్లన్నీ తెంపి యాదగిరి నరసన్నకు ఐలోని మల్లన్నకు వేములాడ రాజన్నకు భద్రాచలం రామన్నకు కొమ్మాల నరసింహ స్వామికి పంపించగా ఎవరు సేకరించలేదట చివరకు వరంగల్‌ భద్రకాళీ మాత్రం తీసుకుందని తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా వరంగల్‌ జిల్లాలో ఈ విధంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను తలుచుకుంటూ ఈ విధంగా పాడుకుంటాం.
రామాయణ భారత భాగవత ఘట్టాలు శివ పార్వతుల కళ్యాణం సీతారాముల కళ్యాణం ఘట్టాలకు సంబంధించిన కథలను పాటల రూపంలో మరియు చారిత్రక మహిళల జీవిత చరిత్రలను పాట రూపంలో జనపదులు జానపదాలు పాడుతూ భక్తితో వేడుతూ చేసుకునే పండగ బొడ్డెమ్మ.
ప్రతిరోజు ప్రసాదాలను అమ్మవారికి సమర్పించి అటుకులు బెల్లం కొబ్బరి నువ్వులు బెల్లం మరియు పప్పు బెల్లం ప్రసాదాలను పంచుకుంటారు.
ఇలా తొమ్మిది రోజులు భక్తిశ్రద్ధలతో పూజించి చతుర్దశినాడు సాయంత్రం యధావిధిగా బొడ్డెమ్మను పూజించి ప్రతిరోజు తలా పిడికెడు తెచ్చి కలశంలో పోసిన బియ్యంతో ప్రసాదం వండి అమ్మవారికి నైవేద్యం సమర్పించి అందరూ కూడా ప్రసాదం తీసుకొని బొడ్డెమ్మ పీఠాన్ని నెత్తిన పెట్టుకొని చెరువు దగ్గరికి తీసుకెళ్లి నీళ్లలో నిమజ్జనం చేస్తారు. పసుపు గౌరమ్మను పిల్లలకు గంధం బొట్టు లేదా చెంపలకు పూస్తారు పెద్దలైతే మంగళ సూత్రాలకు ధరిస్తారు. అత్యంత వైభవోపేతంగా జరిగే ఈ బొడ్డెమ్మ పండుగ ద్వారా పిల్లల్లో కలివిడితనం స్నేహపూరిత వాతావరణం అలవడుతుంది. వాళ్లలో ఉన్న సృజనాత్మక శక్తిని వెలికితీసి చక్కని ఆలోచనను మానసికోల్లాసాన్ని పెంపొందించడానికి బొడ్డెమ్మ పండుగ ఎంతగానో తోడ్పడుతుందని చెప్పవచ్చు.
-కొమ్మాల సంధ్య
తెలుగు ఉపన్యాసకులు
9154068272

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News