Chanakya Niti- Fake Friends: స్నేహం అనేది మనిషి జీవితంలో ఎంతో విలువైన బంధం. నిజమైన స్నేహితుడు ఉన్నప్పుడు కష్టసుఖాలు ఎలా వచ్చినా మనిషి ధైర్యంగా నిలబడగలడు. అయితే ప్రతి స్నేహం నిజమైనదిగా ఉండదు. కొంతమంది స్నేహం పేరుతో దగ్గరగా ఉండి, అవసరమైనప్పుడు దూరం అవుతారు. ఇలాంటి వారిని ముందుగానే గుర్తించడం చాలా ముఖ్యం అని ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో వివరించాడు.
నిజమైన స్నేహితుడు
చాణక్యుడు చెప్పిన వివరాల ప్రకారం.. నిజమైన స్నేహితుడు ఎప్పుడూ మనం సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే కాకుండా, కష్టకాలంలో కూడా మన వెంట ఉంటాడు. మన సమస్యల సమయంలో మనతో ఉన్నవాడే మన నిజమైన మిత్రుడు. కష్ట సమయాల్లో కనిపించకుండపోయే స్నేహం కేవలం నటన మాత్రమే. అటువంటి వ్యక్తులు జీవితంలో ప్రమాదకరంగా మారవచ్చు.
Also Read: https://teluguprabha.net/devotional-news/significance-of-kartika-mondays-and-the-moon-curse-story/
అసూయతో కుళ్లిపోతూ..
స్నేహం పేరుతో దగ్గరగా వచ్చే కొందరు బయటకు మంచిగా కనిపించవచ్చు, కానీ మన వెనుక అసూయతో కుళ్లిపోతుంటారు. మన అభివృద్ధిని చూసి అంతర్గతంగా బాధపడతారు. అలాంటి వారు మన బలహీనతలను తెలుసుకుని, వాటిని ఇతరుల ముందు చెబుతూ మన ప్రతిష్టను దెబ్బతీస్తారు. ఎవరైనా శత్రువు ఉంటే అతను ప్రత్యక్షంగా దాడి చేస్తాడు, కానీ నకిలీ స్నేహితుడు మన వెనుక నుండి మనకు నష్టం కలిగిస్తాడు. అందుకే చాణక్యుడు అవసరాన్ని బట్టి రంగు మార్చే వ్యక్తులని ఊసరవెల్లితో పోల్చాడు.
ఇలాంటి స్నేహితులను గుర్తించడానికి కొన్ని సూచనలు చాణక్యుడు ఇచ్చాడు. ఒకవేళ మీరు ఏదైనా పనిలో విజయం సాధించినప్పుడు వారు ఆనందం వ్యక్తం చేయకపోవడం, అంతర్గత అసూయను దాచడం, అది వారి చెడు మనసుకు సంకేతం. వారు మీ తప్పులను సరిచేయడానికి ప్రయత్నించకుండా, వాటిని ఇతరుల ముందు చెబుతూ మీను ఎగతాళి చేస్తారు. ఆ ప్రవర్తన వారి నిస్సార స్నేహానికి సాక్ష్యం.
అవమానంలో ఆనందం..
అలాగే, మీ రహస్యాలను గౌరవంగా దాచుకోవాల్సింది పోయి, ఆ విషయాలను ఇతరుల వద్ద చెప్పి నవ్వులు పంచుకునే వారు నిజమైన స్నేహితులు అవ్వరు. నిజమైన స్నేహితుడు మీ తప్పులు ఎప్పుడు బయటకి చెప్పడు. ఆయన వాటిని సరిచేయడానికి మౌనంగా సహాయం చేస్తాడు. కానీ నటన చేసే వ్యక్తి మాత్రం మీ అవమానంలో ఆనందం పొందుతాడు.
మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఆర్థికంగా లేదా మానసికంగా కష్టాల్లో ఉన్నప్పుడు మీ పట్ల నిర్లక్ష్యం చూపేవాడు స్నేహితుడు కాదని చాణక్యుడు హెచ్చరించాడు. అలాంటి వ్యక్తి సుఖసమయంలో మాత్రమే మీతో ఉండి, కష్టసమయంలో కనబడడు. నిజమైన స్నేహం అంటే పరస్పర అర్థం చేసుకోవడం, అవసర సమయాల్లో తోడుగా నిలబడడం.
చెడు స్నేహితుడు శత్రువుకంటే..
చాణక్యుడు చెప్పినట్టుగా, చెడు స్నేహితుడు శత్రువుకంటే ప్రమాదకరం. ఎందుకంటే శత్రువు ఎప్పుడు ఎటువంటి దాడి చేస్తాడో మనకు తెలిసి ఉంటుంది, కానీ స్నేహం ముసుగులో దాగి ఉండే వ్యక్తి ఏ సమయంలో వెన్నుపోటు పెడతాడో చెప్పలేం. ఆ వ్యక్తి ఎప్పుడైనా మన విశ్వాసాన్ని ద్రోహం చేయవచ్చు.
మన చుట్టూ ఉన్నవారిని జాగ్రత్తగా గమనించడం చాలా అవసరం. వారు మనం ఎదుగుతున్నప్పుడు ప్రోత్సహిస్తున్నారా? లేక అసూయతో నిండిపోయారా? మన సంతోషంలో భాగస్వామ్యం అవుతున్నారా లేక మన వెనుక చెడుగా మాట్లాడుతున్నారా? ఈ ప్రశ్నలకు సమాధానం మన స్నేహం ఎంత నిజమో తెలుస్తోంది.
నకిలీ స్నేహానికి…
స్నేహితుడి మనసును తెలుసుకోవడానికి చిన్నచిన్న సందర్భాలు చాలవు. ఉదాహరణకు, మీరు విజయం సాధించినప్పుడు ఆయన మీకు శుభాకాంక్షలు తెలిపినా, కళ్లల్లో సంతోషం లేకపోతే అది నకిలీ స్నేహానికి సంకేతం. లేదా మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఒక్క సారీ అయినా పరామర్శించకపోతే, ఆ వ్యక్తి స్నేహితుడి రూపంలో శత్రువు అన్న మాట స్పష్టమవుతుంది.
చాణక్యుడి ప్రకారం, నిజమైన స్నేహం స్వార్థరహితంగా ఉండాలి. లాభనష్టాల లెక్కలు వేసే బంధం ఎప్పటికీ నిలబడదు. ఒక స్నేహితుడు మీకు మేలు జరగాలని కోరుకుంటే, ఆయన నిజమైనవాడు. కానీ మీ మీద ప్రయోజనం కోసం మాత్రమే స్నేహం చూపేవాడు మోసగాడు అని గుర్తించాలి.


