తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ నెల 25 నుంచి 27 వరకు ఎంతో వైభవోపేతంగా నిర్వహించే మహా శివరాత్రి జాతర వేడుకలకు రావాల్సిందిగా కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ, ఎమ్మెల్యే లకు రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, ఆలయ అర్చకులు, అధికారులు మహాశివరాత్రి ఆహ్వాన పత్రికను మంగళవారం అందజేశారు. అనంతరం ఆలయ అర్చకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాజన్న ప్రసాదం అందజేసి వేదోక్త ఆశీర్వచనం అందజేశారు.

ఆలయ విస్తరణ పనులపై సీఎం ఆరా
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపడుతున్న రాజన్న ఆలయ విస్తరణ అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీయగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పనులు టెండర్ దశలో ఉన్నాయని వివరించారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వంలో లాగా పనుల్లో జాప్యం చేయకుండా ఆలయం విస్తరణ పనులను వేగవంతం చేయాలని, రాజన్న దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన దర్శనం కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
వేములవాడ ప్రజలు రాజన్న భక్తులు ఎంత కాలం నుంచి ఎదురు చూస్తున్నా రోడ్డు వెడల్పుకు సంబంధించి భూ సేకరణ కోసం నిధులు విడుదల చేయాలని సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.
మహాశివరాత్రికి ఘనంగా ఏర్పాట్లు చేయాలి
మహాశివరాత్రి జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. భక్తులకు శీఘ్ర దర్శనం, క్యూలైన్లలో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా తాగునీటి వసతి, చలువ పందిళ్ళు తదితర ఏర్పాట్లు ముమ్మరం చేసి రాజన్న భక్తులకు మెరుగైన వసతులు కల్పించి మహాశివరాత్రి జాతర ఘనంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఈవో కే వినోద్ రెడ్డి, ఏఈఓ బ్రహ్మన్న గారి శ్రీనివాస్, అర్చకులు చంద్రగిరి శరత్, గోపన్న గారి చందు, మామిడిపల్లి శరత్,తమ్మల అర్చక వెంకన్న తదితరులు ఉన్నారు.