Sravanamasam Remedies: హిందూ ధార్మిక సంవత్సరంలో అత్యంత పవిత్రంగా భావించే శ్రావణ మాసం ఈసారి జులై-ఆగస్టు మధ్యకాలంలో కొనసాగుతోంది. ఈ మాసానికి శివుడు, లక్ష్మీదేవి, విష్ణుమూర్తి వంటి ప్రధాన దేవతలతో ప్రత్యేక సంబంధం ఉండటంతో భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. అయితే ఈ మాసంలో కేవలం ఆధ్యాత్మిక శాంతి మాత్రమే కాదు, ఆర్థిక సమస్యల నివారణకు కూడా కొన్ని సంప్రదాయాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. ప్రత్యేకించి అప్పుల బాధలు నుంచి బయట పడాలనుకునే వారు ఈ శ్రావణంలో కొన్ని పరిహారాలను పాటిస్తే మంచిదని ధర్మశాస్త్రాలు పేర్కొంటున్నాయి.
లక్ష్మీదేవిని పూజించడం వల్ల…
శ్రావణ మాసం ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం వల్ల ధన ప్రాప్తి కలుగుతుందన్న విశ్వాసం ప్రజల్లో బలంగా ఉంది. ఇంటిని శుభ్రపరిచి, లక్ష్మీదేవి చిత్రాన్ని ఏర్పాటు చేసి, ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే మంచిదని పండితులు చెబుతున్నారు.ఈ క్రమంలో పూజ చేసేటప్పుడు ఎరుపు రంగుని ధరించినా..అమ్మవారి వద్ద ఎరుపు రంగును ఉపయోగించినా విశేష ఫలితాలు ఉంటాయని పండితులు వివరిస్తున్నారు. తులసి, పసుపు, కర్పూరం వంటి శుభ పదార్థాలతో పూజ చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం లభిస్తుందని అంటున్నారు.
శివుడి పూజ…
అలాగే శ్రావణ మాసంలోని ప్రతి సోమవారం శివుడి పూజకు అత్యంత శుభదాయకమైనదిగా చెబుతారు. ఈ రోజున శివాలయానికి వెళ్లి రుద్రాభిషేకం చేయడం, శనగపప్పుతో నైవేద్యం సమర్పించడం శ్రేయస్కరమని పండితులు సూచిస్తున్నారు. “ఓం నమః శివాయ” మంత్రాన్ని లేదా మహామృత్యుంజయ మంత్రాన్ని నియమంగా జపించడం వల్ల మనసుకు ఓదార్పు లభించి, ఆర్థిక కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్మకం. బిల్వ దళాలతో శివార్చన మరింత శుభాన్ని తీసుకురాబోతుందని పురాణాలు చెబుతున్నాయి.
గణపతి పూజ..
ఇక శ్రావణ మాసంలో వచ్చే సంకటహర చతుర్థి రోజున గణపతిని పూజించడం వల్ల జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తున్నారు. ఈ రోజు నాలుగు దీపాలు వెలిగించి, గణేశుడికి జమ్మి ఆకులను సమర్పించడం, “ఓం గణ గణపతయే నమః” అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం ఎంతో శుభప్రదంగా పేర్కొంటారు. గణపతికి మోదకాలు లేదా లడ్డూలతో నైవేద్యం అర్పించడం వల్ల సంతోషం కలుగుతుందని పండితులు వివరిస్తున్నారు.
తులసి పూజ..
శ్రావణ మాసంలో తులసి మొక్కను పూజించడం కూడా లక్ష్మీ కటాక్షానికి మార్గంగా చెబుతారు. ప్రతిరోజూ ఉదయం తులసి కోట ముందు దీపం వెలిగించి, తులసి స్తోత్రాలు పఠించడం వల్ల ఇంట్లో శుభవాతావరణం ఏర్పడుతుందన్న విశ్వాసం భక్తుల్లో ఉంది. శివుడికి ప్రీతికరమైన మారేడు చెట్టును ఈ మాసంలో ఇంటి ఆవరణలో నాటడం వల్ల దారిద్య్రం తొలగి ఐశ్వర్యం చేకూరుతుందనే నమ్మకంతో చాలా మంది దీన్ని ఆచరిస్తుంటారు. మారేడు ఆకులను శివునికి సమర్పించడం వల్ల పవిత్రత, ధర్మబలం పెరుగుతాయని పురాణాలలో చెప్పారు.
శ్రావణ మాసం-దానాలు..
అంతేకాదు, శ్రావణ మాసంలో చేసే దానాలు, ధార్మిక సేవలు కూడా మన జీవితానికి శ్రేయస్సు తీసుకురావడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. పేదలకు అన్నదానాలు, వస్త్రదానాలు చేయడం.. ఆలయాల అభివృద్ధికి విరాళాలు ఇవ్వడం వంటి కార్యాచరణలు భౌతికంగా కాదు, మానసికంగా కూడా మనల్ని బలపరుస్తాయని నిపుణులు అంటున్నారు.
ఈ సమయాన్ని సాధ్యమైనంతగా ఆధ్యాత్మిక మార్గంలో ప్రయోగించుకుంటే మనలో ధైర్యం, నమ్మకం పెరుగుతాయి. ఏ సమస్య అయినా ముందు మనసు నిలకడగా ఉండాలి. దానికి అద్భుత మార్గం ఈ శ్రావణ మాస పూజలే. భక్తితో చేసిన చిన్న పూజలు కూడా మనలో సానుకూలతను నింపి, ఆర్థికంగా ముందుకు పోయే మార్గాన్ని చూపిస్తాయని నమ్మకం.
శ్రావణ మాసంలో చేసే ఈ అన్ని పూజలు, పరిహారాలు ఒకేఒక్క లక్ష్యంతో – మనలో శాంతిని పెంచటం, ఆర్థికంగా భద్రతను కలిగించడం.
ఈ మాసంలో కొన్ని నిబంధనలు పాటించడమూ మంచిదే. ఉదాహరణకు సత్యవ్రతం పాటించడం, మాంసాహారం నుంచి దూరంగా ఉండటం, దైవ సేవలను ఉన్నంతలోనైనా చేయడం వంటి చిన్న చిన్న మార్పులు కూడా జీవితాన్ని కొంతవరకైనా మార్చగలవు.


