బన్నీ ఉత్సవానికి దేవరగట్టు సర్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా ఇప్పటికే మాళమల్లేశ్వర స్వామి వారి ఉత్సవ విగ్రహాలు దేవరగట్టు చేరుకున్నాయి. దేవరగట్టు శ్రీ మాళమల్లేశ్వర స్వామి బన్ని ఉత్సవాలు కంకణధారణతో ప్రారంభమయ్యాయి. నేరణికి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ మాళ మల్లేశ్వరస్వామి విగ్రహమూర్తులను నేరణికి, నేరణికి తాండ, కొత్తపేట గ్రామ ప్రజలు, ఆలయ కమిటీ నిర్వాహకులు దేవరగట్టుకు చేర్చారు. అనంతరం నేరణికి గ్రామ పురోహితుల చేత గణపతి పూజ చేసి రాత్రి 7 గంటల సమయంలో గిరిపై నుంచి స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా తీసుకొని వచ్చి చెరువు కట్టమీద స్వామి అమ్మవార్లకు కంకణ ధారణము నిశ్చితార్థము, ద్వజారోహణము చేసి, కంకణధారణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామస్తులు, కర్ణాటక, తెలంగాణ ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ నిర్వాహకులు తీర్థ ప్రసాదాలు అందించారు.