Diwali 2025 Rituals And Remedies:హిందువులు ఎంతో వేడుకగా జరుపుకునే పండుగల్లో దీపావళి ఎప్పుడూ మొదటి స్థానంలో ఉంటుందనే విషయం తెలిసిందే. ఇది కేవలం వెలుగుల పండుగ మాత్రమే కాదు, ఆనందం, ఐశ్వర్యం, కుటుంబ సఖ్యతకు ప్రతీకగా కూడా పండితులు చెబుతుంటారు. చిన్న, పెద్ద తేడా లేకుండా సమానంగా పాల్గొనే ఈ వేడుకలో ప్రతి రోజు ప్రత్యేకమైన ఆచారాలు, పూజా విధానాలు ఉంటాయి. ఈ సంవత్సరం దీపావళి అక్టోబర్ 20వ తేదీ సోమవారం రోజున జరుపుకోనున్నారు.
ఆ రోజు సాయంత్రం లక్ష్మీదేవి, గణపతిని పూజించడం ముఖ్యమైన సంప్రదాయం. ఈ విధంగా పూజిస్తే లక్ష్మీదేవి ఇంటిలోకి ప్రవేశించి ఏడాది మొత్తం ఆర్థికంగా సుభిక్షత కలిగిస్తుందని భక్తులు నమ్ముతారు. దీపావళి అనేది ఐదు రోజుల పాటు జరిగే పండుగ. మొదటి రోజును ధన త్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి ప్రధాన రోజు, నాగుల చవితి, అన్నచెల్లెల పండుగలుగా ఐదు రోజులుగా జరుపుతారు. ప్రతి రోజుకీ ప్రత్యేకమైన ఆచారాలు, పూజా విధానాలు ఉన్నాయి.
Also Read: https://teluguprabha.net/devotional-news/dhanteras-2025-items-to-avoid-buying-on-dhan-trayodashi/
ధన త్రయోదశి :
దీపావళి మొదటి రోజుగా భావించే ధన త్రయోదశి రోజు సంపదల దేవత లక్ష్మీదేవి, ధనాధికారి కుబేరుడిని పూజిస్తారు. ఈ రోజు వారిని పూజించడం వలన ఇంటికి ధనాభివృద్ధి కలుగుతుందని నమ్మకం. కుబేరుడి ఆశీర్వాదం పొందిన వారు డబ్బు కొరత లేకుండా ఉంటారని విశ్వసిస్తారు. సాయంత్రం సమయాన దక్షిణ దిశలో యమధర్మరాజుకు దీపం వెలిగించడం కూడా ఓ ముఖ్యమైన ఆచారం.
బియ్యం పిండితో ఒక ప్రమిద..
ఇంటి దక్షిణ వైపున బియ్యం పిండితో ఒక ప్రమిద చేసి, అందులో ఆవు నెయ్యి వేసి నాలుగు వత్తులతో దీపాన్ని వెలిగిస్తారు. ఈ యమ దీపం వెలిగించడం వలన యమధర్మరాజు కటాక్షం లభించి అపమృత్యు దోషం తొలగుతుందని భావిస్తారు. అదే సమయంలో పూజా గదిలో లక్ష్మీదేవి ముందర రెండు నెయ్యి దీపాలు వెలిగించి, అమ్మవారికి ఇష్టమైన కలువ పూలు, దానిమ్మ వంటి పండ్లను సమర్పిస్తారు. ప్రధాన ద్వారం వద్ద రెండు దీపాలు వెలిగిస్తే ఇంటిలో లక్ష్మీ, కుబేరుల ఆశీర్వాదం నిలిచిపోతుందని విశ్వాసం.
నరక చతుర్దశి :
దీపావళికి ముందు రోజు నరక చతుర్దశి అని పిలుస్తారు. ఈ రోజు నది స్నానం చేయడం పవిత్రంగా భావిస్తారు. తెల్లవారుజామున తలకు, ఒంటికి నువ్వుల నూనె రాసుకొని సున్నిపిండితో నలుగు పెట్టుకుని స్నానం చేయడం ఆనవాయితీ. తరువాత కొత్త బట్టలు ధరించి పూజ చేయడం మంచిదని పండితులు చెబుతారు. ఇలా చేయడం వలన శరీరంలో ఉన్న నెగటివ్ శక్తులు తొలగిపోతాయని చాలా మంది నమ్ముతారు.
నువ్వుల నూనెతో దీపం…
సాయంత్రం సమయంలో లక్ష్మీదేవిని పూజించి, నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వలన అష్ట ఐశ్వర్యాలు, సుఖ సంతోషాలు కలుగుతాయని విశ్వసిస్తారు. ఈ రోజు దీపం వెలిగించడం అనారోగ్యం, దుస్థితులను తొలగించే శుభకార్యం.
దీపావళి..
ఈ రోజు దీపావళి పండుగకు ముఖ్యమైనది. సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల మధ్య లక్ష్మీదేవి, గణపతిని పూజించడం శుభప్రదంగా ఉంటుంది. ఇంటి ముందు దీపాలను వెలిగించడం ద్వారా చెడు శక్తులను దూరం చేయవచ్చని నమ్మకం.
పూజ సమయంలో బంగారం, వెండి ఆభరణాలు, గులాబీ పూలు ఉంచి అమ్మవారిని ఆరాధిస్తారు. ఈ విధంగా పూజిస్తే ఇంటికి ఐశ్వర్య లక్ష్మీ నడుచుకుంటూ వస్తుందని చాలా మంది నమ్ముతారు. దీపావళి రాత్రి లక్ష్మీదేవి భూమిపై సంచరిస్తుందని, దీపాలతో అలంకరించిన ఇళ్లలో ప్రవేశిస్తుందని పూర్వీకుల నమ్మకం. అందువల్ల ప్రతి ఇల్లు వెలుగులతో ముస్తాబవుతుంది.
ఐశ్వర్యం కోసం గోధుమ దీపం ఆచారం:
దీపావళి సాయంత్రం గోధుమ దీపం పెట్టడం ద్వారా సౌభాగ్యం, ఐశ్వర్యం లభిస్తుందని చెబుతారు. పూజ సమయంలో ఒక పళ్లెంలో గోధుమలు వేసి, మధ్యలో మట్టి ప్రమిద పెట్టి, నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తారు. ఈ దీపం ఎంత సేపు వెలిగితే అంతకాలం ఆర్థిక సుఖం ఉంటుందని విశ్వాసం.
దీపం ఆరిన తర్వాత ఆ గోధుమలను ఆవుకు ఆహారంగా అందించడం ఆచారం. ఇది లక్ష్మీ అనుగ్రహం పొందేందుకు చేయాల్సిన ముఖ్యమైన పరిహారంగా చెప్పబడింది.
Also Read: https://teluguprabha.net/devotional-news/jade-plant-brings-wealth-prosperity-and-positivity-at-home/
నాగుల చవితి, అన్నచెల్లెల పండుగ:
దీపావళి తర్వాతి రోజున నాగుల చవితి జరుపుకుంటారు. ఈ రోజు నాగదేవతకు పాలు సమర్పించి కుటుంబ రక్షణ కోసం ప్రార్థిస్తారు. దీని తరువాత అన్నచెల్లెలు ప్రేమను జరుపుకునే పండుగ వస్తుంది. చెల్లెళ్లు అన్నల దీర్ఘాయుష్కు కోసం పూజ చేస్తారు, అన్నలు చెల్లెళ్లకు బహుమతులు ఇస్తారు.


