Saturday, November 15, 2025
HomeTop StoriesDiwali Festival: దీపావళికి దీపాలు ఎందుకు వెలిగిస్తారో మీకు తెలుసా!

Diwali Festival: దీపావళికి దీపాలు ఎందుకు వెలిగిస్తారో మీకు తెలుసా!

Diwali Festival Significance:భారతదేశంలో అత్యంత విశిష్టమైన పండుగలలో దీపావళి ఒకటి. చెడుపై మంచిని గెలిపించే స్ఫూర్తిని అందించే ఈ పండుగకు పలు పౌరాణిక కథలు ఆధారంగా ఉన్నాయి. నరకాసురుని సంహారం, శ్రీరాముడు అయోధ్యకు తిరిగివచ్చిన సందర్భం, లక్ష్మీదేవి అవతారం, పాండవుల తిరుగు ప్రయాణం ఇవన్నీ దీపావళితో ముడిపడి ఉన్న కథలు. ఈ పండుగలో వెలిగించే ప్రతి దీపం ఆధ్యాత్మిక ప్రకాశానికి ప్రతీకగా భక్తులు నమ్ముతారు.

- Advertisement -

దీపావళి వేడుకలు కేవలం ఆనందానికి మాత్రమే కాకుండా, ఆధ్యాత్మిక శుద్ధికి కూడా చిహ్నం. హిందూ సంప్రదాయాల్లో దీపాన్ని లక్ష్మీదేవిగా భావించి పూజించడం ఒక ముఖ్యమైన ఆచారం. ప్రతి ఇంట్లో వెలిగే దీపాలు ఐశ్వర్యం, శాంతి, సుభిక్షం తేవాలని అందరూ కోరుకుంటారు.

Also Read:https://teluguprabha.net/devotional-news/lucky-zodiac-signs-for-diwali-2025-and-their-prosperity/

నరక చతుర్దశి కథ

దీపావళి వేడుకలకు ముందు రోజు జరుపుకునే నరక చతుర్దశి, శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి నరకాసురుని సంహరించిన రోజుగా భావిస్తారు. ఆ రోజు చెడు శక్తుల అంతానికి సంకేతంగా భావిస్తారు. భగవంతుడు దుష్ట శక్తులను నాశనం చేసి ప్రజలకు విముక్తి ఇచ్చినందుకు ఆనందంగా దీపాలు వెలిగించడం ప్రారంభమైంది. హరివంశం మరియు విష్ణు పురాణాల్లో ఈ కథకు ప్రాముఖ్యత ఉంది.

నరక చతుర్దశి ఉదయం నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం చేయడం శాస్త్రప్రకారం ముఖ్యమైన ఆచారం. ఈ రోజున సూర్యోదయానికి ముందుగా స్నానం చేయడం ద్వారా శరీరశుద్ధి, ఆత్మశుద్ధి కలుగుతాయని విశ్వాసం. కొన్ని ప్రాంతాల్లో ఈ రోజు గంగాస్నానం చేయడం కూడా ఆనవాయితీ.

దీపారాధన ఆచారం

దీపావళి సాయంత్రం ప్రతి ఇంట్లో దీపాలు వెలిగించడం ప్రధాన సంప్రదాయం. దీపం వెలిగించడం కేవలం వెలుగును అందించడం మాత్రమే కాదు, మనసులోని చీకట్లను తొలగించే ప్రతీక. పురాణాల ప్రకారం యమధర్మరాజుని స్మరిస్తూ దీపాలు వెలిగించడం వలన నరకబాధలు తొలగుతాయని పెద్దలు,పండితులు చెబుతుంటారు.

దీపం వెలిగించే సమయంలో “దీపం జ్యోతి పరబ్రహ్మ” అనే భావనను మనసులో ఉంచుకుంటారు. ఈ సమయంలో ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి దీపాలను వెలిగించడం లక్ష్మీదేవి కృప పొందడానికి మార్గం అని అంతా నమ్ముతారు.

లక్ష్మీపూజ ప్రాముఖ్యత

దీపావళి రోజు లక్ష్మీపూజ చేయడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. పురాణాల ప్రకారం సముద్ర మథనంలో లక్ష్మీదేవి అవతరించింది. ఆమెను సంపద, ఐశ్వర్యం, సుఖసంతోషాల ప్రతీకగా భావిస్తారు. కాబట్టి ఈ రోజు ఆమెను ఆరాధించడం ద్వారా ధనసంపద,ఐశ్వర్యం పొందుతామని ప్రజలు నమ్ముతారు.

పద్మపురాణం ప్రకారం బలి చక్రవర్తి కాలంలో లక్ష్మీదేవి బంధి అయిన సందర్భంలో లోకమంతా దరిద్రంతో కూరుకుపోయింది. ఆ తరువాత విష్ణుమూర్తి వామనావతారంలో బలిని అణగదొక్కి లక్ష్మీదేవిని విముక్తి చేశారు. ఆ రోజు ఆశ్వయుజ అమావాస్య. అదే కారణంగా ఆ రోజు దీపాలు వెలిగించి లక్ష్మీదేవికి స్వాగతం పలికారు. ఈ ఆచారం క్రమంగా దీపావళి పండుగగా మారింది.

దీపమే లక్ష్మీ స్వరూపం

దీపాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా పూజించడం హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన ఆచారం. దీపం వెలిగించడం అంటే చీకటిలో వెలుగు నింపడం మాత్రమే కాదు, మనసులోని నిస్పృహను తొలగించడం కూడా. దీపం వెలిగిన ప్రదేశం లక్ష్మీదేవికి ఇష్టమైన ప్రదేశం అని నమ్మకం. అందుకే దీపావళి రోజున ప్రతి ఇంటి ముందు, దేవాలయాల్లో, వీధులలో దీపాల వెలుగులు నిండిపోతాయి.

శ్రీసూక్తం ప్రకారం లక్ష్మీదేవి సుఖసంపదల మూలం. ఆమె కరుణ పొందిన వారికి ధనం, పదవి, కీర్తి, సంతానం, ఐశ్వర్యం లభిస్తాయి.

Also Read:https://teluguprabha.net/devotional-news/diwali-toran-ideas-with-mango-ashoka-and-betel-leaves/

ధనలక్ష్మి పూజ

దీపావళి రోజున ధనలక్ష్మిని ఆరాధించడం ద్వారా దారిద్రం తొలగి ధనం, సుభిక్షం లభిస్తాయని నమ్మకం. అయితే ధనలక్ష్మి స్థిరంగా నివసించాలంటే ఇల్లు పరిశుభ్రంగా ఉండాలి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉండాలి, సత్యం, ధర్మం పాటించే చోట ఆమె ఉంటుంది. తులసి, గోమాత పూజించే ఇంట్లో లక్ష్మీదేవి సదా నివసిస్తుందని పురాణ విశ్వాసం.

ఆధ్యాత్మిక ఆంతర్యం

దీపావళి పండుగ కేవలం వెలుగుల వేడుక కాదు. ఇది మనలోని చీకట్లను తొలగించి జ్ఞానం, ధర్మం, శాంతి, ఐశ్వర్యం ప్రసాదించే పండుగ. ప్రతి దీపం మనలోని ఆశ, నమ్మకం, ధైర్యం, సానుకూలతకు సంకేతం.

దీపావళి రోజు వెలిగించే దీపాల వెలుగు మన ఇంటి పరిసరాలను మాత్రమే కాదు, మన మనసులను కూడా వెలిగిస్తుంది. ఈ రోజు లక్ష్మీదేవిని స్మరిస్తూ ఆమె కృప కోరుకుంటే సంతోషం, సుభిక్షం మన జీవితంలో నిలుస్తాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad