వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఏ వస్తువులు ఎక్కడ ఉంచాలో నిర్ణయించుకుంటే శుభఫలితాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇంటి నిర్మాణం, అందులో వస్తువుల అమరిక ప్రకృతితో సమన్వయంగా ఉంటే శాంతి, సంపత్తి నిలుస్తాయని వాస్తు శాస్త్రం సూచిస్తుంది. ఈ క్రమంలో ఇంట్లో వాషింగ్ మిషన్ వంటి బరువైన వస్తువులు ఎక్కడ ఉంచాలో వాస్తు నిపుణులు, పండితులు వివరించారు. దీని ప్రకారం వాషింగ్ మిషన్ ఇంట్లో ఏ దిక్కున ఉంచాలో తెలుసుకుందాం.
బరువైన వస్తువులు సాధారణంగా నైరుతి మూలన ఉంచడం శ్రేయస్కరమని పండితులు చెబుతున్నారు. ఇది వాస్తు శాస్త్రానికి అనుగుణంగా ఉంటుంది. వాషింగ్ మిషన్ కూడా బరువైన వస్తువుల కేటగిరీలోకే వస్తుంది కాబట్టి, దానిని కూడా నైరుతి మూలన ఉంచడం ఉత్తమం. ప్రత్యేకంగా హాల్‌లో వాషింగ్ మిషన్ ఉంచాలనుకుంటే, హాల్‌లోని నైరుతి మూలనే ఎంపిక చేసుకోవాలి. అక్కడ స్థలం లేనప్పుడు దక్షిణ దిక్కు లేదా పడమర మధ్య భాగాన్ని కూడా ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చని పండితులు అంటున్నారు.
ఈశాన్యంలో వాషింగ్ మిషన్ ఉంచడం వాస్తు పరంగా అనుకూలం కాదని, ముఖ్యంగా బియ్యం బస్తాల పక్కన ఈశాన్యంలో ఉంచినట్లయితే దోషాల అవకాశాలు ఉంటాయని హెచ్చరించారు. ఈశాన్యం ఇల్లు తలపోయే మూలగా భావించబడుతుందనీ, అక్కడ కాంతి, స్పష్టత, శుభత కీలకమని వాస్తు శాస్త్రం చెబుతుంది. అలాంటి ప్రదేశంలో బరువులు ఉంచితే శుభ ప్రభావాలు తగ్గిపోతాయని హెచ్చరిస్తున్నారు.
ఇంట్లో శాంతి, ఆరోగ్యం, ఆర్థిక స్థిరత్వం కోరుకునే వారు వాస్తు సూచనలను గమనించి, బరువైన వస్తువులను నైరుతి, దక్షిణ లేదా పడమర ప్రాంతాల్లోనే ఉంచాలని పండితులు సూచిస్తున్నారు. (గమనిక: ఈ కథనం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. దీనిని తెలుగు ప్రభ ధృవీకరించడం లేదు.. ఏదైనా సలహా పాటించే ముందు నిపుణులను సంప్రదించండి.)