Lunar Eclipse: ఈ సంవత్సరం రెండవ, చివరి చంద్రగ్రహణం భాద్రపద మాసం పౌర్ణమి రోజున జరగనుంది. ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం ఇది బ్లడ్ మూన్ రూపంలో కనిపిస్తుందని చెబుతున్నారు. మరోవైపు జ్యోతిష్య నిపుణులు దీన్ని రాహు గ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణంగా పేర్కొంటున్నారు. ఈ సారి గ్రహణం కుంభరాశి శతభిష నక్షత్రంలో ఏర్పడడం విశేషం. ఈ రోజుతోపాటు పితృ పక్షం ప్రారంభమవుతుండటంతో, ఆధ్యాత్మికంగా కూడా ప్రాధాన్యత పొందుతోంది.
చివరి చంద్రగ్రహణం…
భారతదేశం సహా ఆసియా దేశాలు, ఆస్ట్రేలియా, ఇతర ప్రాంతాల ప్రజలు ఈ చంద్రగ్రహణాన్ని చూడగలరు. 2025 చివరి చంద్రగ్రహణం రాత్రి 9 గంటల 56 నిమిషాలకు మొదలై తెల్లవారుజామున 1 గంట 26 నిమిషాలకు పూర్తవుతుంది. మొత్తం వ్యవధి సుమారు 3 గంటల 28 నిమిషాలు ఉంటుంది. ఈ సమయంలో సూతక కాలం కూడా అమల్లో ఉంటుంది.
కుంభరాశిలో…
జ్యోతిష్య దృష్టిలో చంద్రగ్రహణం శుభప్రదంగా పరిగణించరు. ముఖ్యంగా ఈ గ్రహణం శనీశ్వరుడు అధిపత్యం వహించే కుంభరాశిలో జరగడం వలన ప్రతికూల ఫలితాలు అధికంగా ఉంటాయని నమ్మకం ఉంది. అందువల్ల గ్రహణ దోషాన్ని తగ్గించుకోవడానికి దానం చేయడం ముఖ్యమని పండితులు సూచిస్తున్నారు. గ్రహణ సమయంలో లేదా అది ముగిసిన తర్వాత మోక్ష కాలంలో దానం చేయడం అత్యంత శ్రేయస్కరమని భావిస్తారు.
ఆహారం దానం..
గ్రహణం పూర్తయిన వెంటనే ఆహారం దానం చేయడం చాలా శుభప్రదమని చెబుతారు. ఇలా చేయడం వలన ఇంట్లో ఎప్పుడూ అన్నప్రసాదాలకు లోటు ఉండదని నమ్మకం. అదేవిధంగా, చంద్రగ్రహణం రోజున బట్టలు దానం చేయడం కూడా శ్రేయస్కరం. ముఖ్యంగా చంద్రుడి అనుగ్రహం కోసం తెల్లని బట్టలు ఇవ్వడం మరింత ఫలవంతమని అంటారు.
పాల పదార్థాలతో..
చంద్రుడు పాల పదార్థాలతో సంబంధం కలిగి ఉండటంతో, పాలు లేదా పెరుగు దానం చేయడం ద్వారా కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయని విశ్వాసం ఉంది. మనసుకు ప్రశాంతత, గృహంలో ఆనందం కలుగుతుందని పండితులు వివరిస్తున్నారు.
చంద్రగ్రహణ సమయంలో వెండి, బియ్యం వంటి తెల్లని వస్తువులను దానం చేయడం కూడా శుభప్రదంగా పరిగణిస్తారు. చంద్రుడు తెల్లని వర్ణానికి ప్రతీక కావడంతో ఇవి దానం చేయడం వలన చంద్రదేవుని ఆశీస్సులు పొందుతారని చెబుతారు.
Also Read:https://teluguprabha.net/devotional-news/money-plant-vastu-tips-for-wealth-and-positivity-at-home/
అదనంగా చక్కెర దానం చేయడం లేదా దేవాలయాలలో ఇవ్వడం కూడా ముఖ్యమని నమ్మకం. దీని వలన ప్రతికూల శక్తులు తొలగిపోతాయని, కుటుంబంలో ఇబ్బందులు దూరమవుతాయని చెబుతున్నారు.


