భక్తులకు భోగభాగ్యాలిచ్చే భోగేశ్వరుడు మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్నాడు. మండల పరిధిలోని గడిగరేవుల గ్రామ సమీపంలోని ఎర్రకనుమ కొండల్లో వెలసిన ఈ స్వామి క్షేత్రం దక్షిణ కాశీగా వెలుగొందుతోంది. కాశీలో తప్ప మరే క్షేత్రంలో లేని కాలభైరవుడు ఇక్కడ ఉండటం విశేషం. ఇలా ఎన్నో ప్రత్యేకతలు గాంచిన ఈ క్షేత్రంలో కోనేరు, పరిసరాలు భక్తులకు కనువిందు చేస్తాయి. దీంతో ఏటా మహా శివరాత్రి ఉత్సవాలకు ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ఈనెల 25 నుంచి ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆలయాధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు.

ఐదు రోజుల ఉత్సవాలు
శ్రీదుర్గా భోగేశ్వరాలయంలో ఐదు రోజుల పాటు శివరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. తొలి రోజు ఈనెల 25వ తేదీన గడిగరేవుల గ్రామంలో ఉత్సవ మూర్తులకు వర ప్రయాణం, 26న స్వామివారి ఆలయ ప్రవేశం, నందివాహన, పుణ్యవాచనం, ధ్వజరోహణం కార్యక్రమాలు జరుగుతాయి. 27న నంది వాహనోత్సవం, స్వామి వార్ల తిరుమంజనము, అభిషేకార్చనలు, నైవేద్యాల సమర్పణ, తెల్లవారు జామున స్వామివారి కల్యాణోత్సవం, 28న రథోత్సవం, మార్చి1వ తేదీన నాకబలి, వసంతోత్సవంతో బ్రహోత్సవాలు ముగుస్తాయి. ఈ ఉత్సవాల సమయంలో నంద్యాల, నందికొట్కూరు ఆర్టీసీ డిపోల నుంచి క్షేత్రానికి ప్రత్యేక బస్సుల నడుపనున్నట్లు ఈఓ రామానుజన్ తెలిపారు.

సాంస్కృతి కార్యక్రమాలు
27,28 వ తేదీల్లో రాత్రి భక్తుల కోసం సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఈఓ తెలిపారు. ఆలయానికి వచ్చిన భక్తులకు శ్రీదుర్గాబో గేశ్వరస్వామి, కాశీరెడ్డినాయన, బ్రాహ్మణ, రెడ్డి, వీర శైవ, ఆర్యవైశ్య సత్రాల్లో ఉచితంగా భక్తులకు అన్న దానం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
