Vinayaka Chaviti 2025:విఘ్నాలను తొలగించే దేవుడిగా ప్రసిద్ధుడైన గణపతి పుట్టినరోజే గణేశ్ చతుర్థి. ప్రతి సంవత్సరం భాద్రపద మాసం శుక్ల పక్షం చవితి రోజున ఈ పండగను దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. శివపార్వతుల కుమారుడైన గణనాథుడు ఏ పనైనా ప్రారంభించేముందు మొదటగా పూజించాల్సిన దేవుడిగా పండితులు చెబుతారు. వినాయకుడిని ఆరాధిస్తే కష్టాలు తొలగి విజయాలు కలుగుతాయన్న నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది. ఈసారి గణేశ్ చతుర్థి ఆగస్టు 27, 2025 బుధవారం వస్తోంది. ఈ ప్రత్యేక సందర్భంలో పూజకు అనువైన సమయాలు, దుస్తుల రంగు, విగ్రహ ఎంపిక వంటి విషయాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ఆకుపచ్చ రంగుపై..
ఈ సంవత్సరం వినాయక చవితి బుధవారం రావడం విశేషం. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం బుధుడికి ఆకుపచ్చ రంగుపై ప్రత్యేకమైన అభిరుచి ఉంటుంది. వినాయకుడికీ ఈ రంగు ఎంతో ప్రీతిపాత్రమైనదే. అందువల్ల గణేశ్ చతుర్థి రోజున ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించి పూజ చేస్తే మరింత శుభఫలితాలు పొందవచ్చని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. గ్రీన్ కలర్ దుస్తులు లేని వారు కనీసం చిన్న రుమాలు లేదా వస్త్రపు ముక్కను దగ్గర ఉంచుకుని పూజ చేయడం మంచిదని సూచిస్తున్నారు.
పదిహేనునిమిషాల వ్యవధి…
పూజ చేయడానికి అనువైన సమయాల విషయానికొస్తే, 2025 ఆగస్టు 27న ఉదయం 5 గంటల 20 నిమిషాల నుండి 7 గంటల 20 నిమిషాల వరకు సింహ లగ్నం ఉంటుంది. ఈ రెండు గంటల సమయం వినాయక పూజకు అత్యంత శుభకరమని భావిస్తున్నారు. ఈ సమయంలో దీపం వెలిగించి పూజను ఆరంభిస్తే వినాయకుని ఆశీస్సులు సమృద్ధిగా లభిస్తాయని విశ్వాసం. ఉదయం పూజ చేయలేని వారు మరో శుభ సమయాన్ని ఉపయోగించుకోవచ్చు. అదే రోజు ఉదయం 11 గంటల 35 నిమిషాల నుండి 11 గంటల 50 నిమిషాల మధ్య వృశ్చిక లగ్నం ఉంటుంది. ఈ పదిహేనునిమిషాల వ్యవధి కూడా వినాయక పూజకు అత్యుత్తమ సమయంగా పేర్కొంటున్నారు నిపుణులు.
తొండం ఎడమవైపు…
వినాయకుడి విగ్రహం ఎంపిక విషయంలో కూడా ప్రత్యేకమైన నియమాలు ఉన్నాయి. చాలా మంది భక్తులు గణపతి తొండం ఎటువైపు ఉంటే శ్రేయస్కరం అన్న సందేహంలో పడుతుంటారు. ఈ విషయంలో జ్యోతిష్య శాస్త్రం స్పష్టమైన సూచనలు ఇస్తుంది. వినాయక విగ్రహం లేదా ఫోటోలో తొండం ఎడమవైపు వంగి ఉండటం అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది. అలాంటి విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్టించి పూజిస్తే కోరికలు నెరవేరడంతో పాటు ధనలాభం కూడా కలుగుతుందని నమ్మకం ఉంది.
వినాయక చవితి రోజున పూజ చేసేటప్పుడు శ్రద్ధ, భక్తి అత్యంత ముఖ్యమైనవి. పండుగ రోజు ఇంటిని శుభ్రం చేసి, పువ్వులు, పండ్లు, మిఠాయిలతో వినాయకుడిని ఆరాధిస్తారు. కుటుంబ సభ్యులు అందరూ కలసి పూజలో పాల్గొని సంకల్పాలు చేసుకుంటారు. గణపతి వ్రతకల్పం సమయంలో సాధ్యమైనంత వరకు శాస్త్రోక్త విధానాలను పాటించడం ఉత్తమం.


