Vinayaka Chaviti-Thummikura: శ్రావణం ముగిసిన వెంటనే భాద్రపద మాసం ప్రారంభమవుతుంది. ఈ నెలలో వచ్చే వినాయక చవితి పండుగను దేశమంతా అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటారు. గణపతి పూజను హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. అడ్డంకులను తొలగించే వాఘనుడు, జ్ఞానం ప్రసాదించే దేవుడు, శ్రేయస్సుకు కారణమైన విఘ్నేశ్వరుడిని ఈ రోజు భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. భాద్రపద శుక్ల చతుర్థి నాడు ప్రారంభమయ్యే ఈ వేడుకలు తొమ్మిది రోజుల పాటు సాగే సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా పండుగ వాతావరణం అలుముకుంటుంది.
తుమ్మికూర వండుకుని..
పండుగ సమయంలో గణపతికి ఇష్టమైన రకాల వంటకాలు సిద్ధం చేస్తారు. లడ్డు, పులిహోర, వడలు, అప్పాలు వంటి తీయటి, కారాలు అన్నీ నైవేద్యంగా సమర్పిస్తారు. అయితే ఒక ప్రత్యేక ఆచారం తరతరాలుగా కొనసాగుతోంది. వినాయక చవితి నాడు తప్పనిసరిగా తుమ్మికూర వండుకుని తినాలని పెద్దలు చెబుతారు. ఈ తుమ్మికూరనే ద్రోణపుష్పి ఆకులు అని కూడా పిలుస్తారు. దీనిని పూజలో సమర్పించడం మాత్రమే కాకుండా ఆ తర్వాత భోజనంలో భాగం చేసుకోవడం ఒక ప్రత్యేకత.
శరీరంలో కూడా మార్పులు..
ఈ ఆచారం ఎందుకు ఏర్పడిందనే ప్రశ్నకు సమాధానం ప్రకృతితో ముడిపడి ఉంటుంది. గణేష్ పండుగ జరగేది వర్షాకాలం ముగిసిన తరువాత, శరదృతువు ప్రారంభమయ్యే సమయంలో. ఈ కాలంలో వాతావరణంలో మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. వర్షాల కారణంగా మన శరీరంలో కూడా మార్పులు చోటు చేసుకుంటాయి. దగ్గు, జలుబు, జ్వరం వంటి ఇన్ఫెక్షన్లు సులభంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మన పూర్వీకులు కొన్ని ఔషధ గుణాలు కలిగిన ఆకులను పూజలో ఉపయోగించి, ఆ తర్వాత వాటిని ఆహారంలో కూడా చేర్చే ఆచారాన్ని ఏర్పరిచారు.
ప్రత్యేక ఔషధ మొక్క…
తుమ్మికూర అలాంటి ప్రత్యేక ఔషధ మొక్క. ద్రోణపుష్పి ఆకులు అని పిలిచే ఈ కూరను గణపతికి సమర్పించడం భక్తి, విశ్వాసం, అంకితభావానికి సంకేతం. పూజ అనంతరం దానిని భోజనంలో భాగం చేసుకోవడం కేవలం సంప్రదాయం మాత్రమే కాదు, శరీరానికి మేలు చేసే అలవాటు. మన పూర్వీకులు అనుసరించిన ఈ సూత్రం “దేవుడికి సమర్పించినది శరీరానికి ఔషధం” అనే భావనను ప్రతిబింబిస్తుంది.
రోగనిరోధక శక్తిని..
తుమ్మికూరలోని గుణాలు ఆరోగ్య పరంగా ఎంతో విలువైనవి. ఇది రోగనిరోధక శక్తిని పెంచే సామర్థ్యాన్ని కలిగి ఉంది. శరీరానికి హాని చేసే వైరస్‌లు, బ్యాక్టీరియాలతో పోరాడే శక్తి దీనిలో ఉంది. తరచుగా తుమ్మికూరను తినడం వల్ల దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలను నివారించవచ్చు.
జీర్ణక్రియను మెరుగుపరచడంలో..
ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తుమ్మికూర తీసుకోవడం ద్వారా తగ్గుతాయి. ఈ ఆకుల రసాన్ని కషాయంగా వాడితే కడుపులోని నొప్పి, వాపు నుండి ఉపశమనం లభిస్తుంది. కాలేయాన్ని శుభ్రపరచడం, దాని పనితీరును మెరుగుపరచడంలో కూడా ఇది సహకరిస్తుంది.
చర్మ సమస్యలను తగ్గించడంలో కూడా ఈ ఆకులు ఉపయోగకరంగా ఉంటాయి. ద్రోణపుష్పి ఆకులతో తయారు చేసిన పేస్ట్‌ను చర్మంపై రాస్తే దద్దుర్లు, దురద, ఫంగస్ వంటి ఇబ్బందులు తగ్గుతాయి.మహిళల ఆరోగ్యంలో కూడా తుమ్మికూరకు ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా నెలసరి సమయంలో సమస్యలు ఎదుర్కొనే వారికి ఈ కూర ఉపయోగకరంగా ఉంటుంది. వారానికి కనీసం ఒకసారి తుమ్మికూర తింటే శరీరంలోని వ్యర్థాలు బయటకు పోవడమే కాకుండా, జీర్ణవ్యవస్థ కూడా సక్రమంగా పనిచేస్తుంది.
ఈ విధంగా గణేష్ చతుర్థి రోజున తుమ్మికూర తినే ఆచారం కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాదు. ఇది ఆరోగ్యానికి మేలు చేసే శాస్త్రీయమైన పద్ధతి. మన పూర్వీకులు “ఆహారమే ఔషధం” అనే సూత్రాన్ని జీవనంలో ప్రతిబింబించేలా ఈ ఆచారాన్ని ఏర్పరిచారు. భక్తి, ఆరోగ్యం, సంప్రదాయం అన్నీ కలిసేలా ఈ అలవాటు కొనసాగుతోంది.


