అయోధ్య రామ మందిరంలో బాల రాముడి ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకొని అంగరంగ వైభవంగా శోభాయాత్ర నిర్వహించారు. తొలుత గార్ల మండల కేంద్రంలోని స్థానిక పుట్టకోట బజార్ రామాలయంలో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయం నుండి సీతా రామ లక్ష్మణ ఆంజనేయ ఉత్సవ విగ్రహాలను రథంపై వేయింపజేశారు. ప్రతి ఇంటి నుండి తెలుపు పసుపు రంగు సాంప్రదాయ దుస్తులు ధరించి రామచంద్ర స్వామి ఉత్సవ విగ్రహాలను సన్నాయి మేళ తాళాల చప్పుళ్ళు డీజే పాటల నడుమ కోలాటాలతో కాషా జెండాలను చేతబూని.. జై శ్రీరామ్ అంటూ నినాదాలతో ప్రజా సంకీర్తనలతో గార్ల పట్టణ పురవీధుల గుండా భక్తజనం భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా శోభయాత్ర నిర్వహించారు.
మహిళలు మంగళ హారతులతో రామయ్య స్వామి రథానికి స్వాగతం పలుకుతూ పూజలు నిర్వహించారు. దీంతో పట్టణ పరిసరాలు ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ప్రతి ఒక్కరిలోనూ భక్తి భావం పెల్లుబికింది. అనంతరం స్థానిక వత్తక సంఘం భవనంలో మండపంలో ఏర్పాటు చేసిన ఉత్సవ విగ్రహాలకు భక్తజనం పుష్పాభిషేకం నిర్వహించారు. భక్తులకు రామచంద్ర స్వామి ప్రాణ ప్రతిష్ట కమిటీ సభ్యులు లడ్డు ప్రసాదాలను వితరణ చేశారు. మండలంలోని అన్ని పంచాయతీలోని గ్రామాలలో ఆయా రామాలయాలలో ప్రత్యేక పూజలు చేసి వీధులలో శోభాయాత్ర నిర్వహించి, మహా అన్నదానాలను నిర్వహించారు.
ఆకట్టుకున్న బాల రాముడి వేషధారి
శ్రీరామ జన్మభూమి అయోధ్య రామ మందిరంలో బాల రాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని పురస్కరించుకొని సోమవారం గార్ల పట్టణ పురవీధులలో నిర్వహించిన శోభాయాత్రలో బాల రాముడి వేషధారణలో ఓ బాలుడు హుషారుగా తిరుగుతుండడంతో పలువురిని విశేషంగా ఆకట్టుకుంది. ధనుర్భాణాలను చేతభూని రాముడి వేషధారణలో బాలుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. బాలుడిని రాముడి వేషధారణలో తీర్చిదిద్దిన బాలుడి తల్లిదండ్రులు మనోజ్ అగర్వాల్, స్నేహ అగర్వాల్ లు మాట్లాడుతూ అయోధ్యలో బాల రాముడి ప్రతిష్టాపనోత్సవం నేపథ్యంలో రామాయణంపై అవగాహన కల్పించేందుకు ఈ వేషధారణ వేసినట్లు వారు వివరించారు.