గార్ల మండల పరిధిలోని పిని రెడ్డిగూడెం గ్రామ శివారులోని కొండలమ్మ దేవాలయ ప్రాంగణంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని కొండలమ్మ జాతరను వైభవంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఉగాది పండుగ రోజు కొండలమ్మ జాతరను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతూ, కోరుకున్న కోర్కెలను తీర్చే కొండలమ్మ దేవతలకు భక్తులు ప్రభ బండ్లతో కొండలమ్మ దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. కొండలమ్మ దేవతలను దర్శించుకునేందుకు దేవాలయం ఎదుట భక్తుల సౌకర్యార్థం క్యూ లైన్ కోసం భారీ కేడ్లు నిర్మించారు. జాతర సందర్భంగా దేవాలయం ప్రాంగణంలో రకరకాల ఆటవస్తులు దుకాణాలు వెలిశాయి. బయ్యారం కారపెల్లి డోర్నకల్ కోరవి మండలాలకు చెందిన భక్తులు రావడంతో దేవాలయం ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది.
ఆలయ నిర్వాహక కమిటీ చైర్మన్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు చోటు చేసుకోకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. జాతర సమయంలో సర్పాల రూపంలో అమ్మ వార్లు భక్తులకు దర్శనం ఇచ్చారు. పాముల రూపంలో భక్తులకు దర్శనమిచ్చిన కొండలమ్మ, బయ్యమ్మ, గారమ్మ అమ్మవార్లను భక్తులు దర్శించుకుని, కోరిన కోరికలు నెరవేరి తమకు మంచి జరగాలని ముడుపులు కట్టి పరమాన్నంతో నైవేద్యాన్ని సమర్పించారు.
జాతర సమయంలో మాత్రమే అమ్మవారి రూపంలో పాములు భక్తులకు కనిపించి తిరిగి ఎక్కడికి వెళ్తాయో తెలియదు. కాకతీయ కళా వైభవానికి ప్రత్యేకంగా నిలుస్తున్న అద్భుత కట్టడం వేయి స్తంభాల గుడిని పోలిన శ్రీ కొండలమ్మ దేవాలయం అభివృద్ధికి నోచుకోకుండా శిథిలావస్థకు చేరుకుంటుందని గ్రామస్తులు కమిటీగా ఏర్పడి ప్రతి సంవత్సరం ఉగాది పండుగ రోజు దేవాలయాన్ని ముస్తాబు చేసి జాతరను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు దేవాదాయ శాఖ అధికారులు పట్టించుకుని కాకతీయుల కాలంలో నిర్మించిన ఆలయాన్ని అభివృద్ధి పరచాలని కోరుతున్నారు.
ఈ జాతరలో భాగంగా ఇల్లందు శాసన సభ్యులు కోరం కనకయ్య కొండలమ్మ దేవాలయాన్ని దర్శించుకుని కొండలమ్మ, బయ్యమ్మ, గారమ్మ తల్లులకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎస్సై జీనత్ కుమార్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బట్టు నాగరాజు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ధనియాకుల రామారావు ఇందుర్తి వెంకటరెడ్డి బిక్షపతి గౌడ్ మల్లేశం నవీన్ వీరన్న ఆలయ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.