Tuesday, September 17, 2024
HomeదైవంGarla: కొండంత అండ కొండలమ్మ

Garla: కొండంత అండ కొండలమ్మ

పాముల రూపంలో అమ్మవార్ల దర్శనం

అదేం చిత్రమో… ఆ ఊరికి వెళ్లి కొండ అన్నామంటే కనీసం ఓ పదిమంది చెవులు రిక్కిస్తారు. ఆ ఊరే కాదు చుట్టుపక్కల గ్రామాలలో కూడా కొండ, కొండలమ్మ, కొండయ్య, కొండలరావు వంటి పేర్లు ఇంచుమించు ఇంటికి ఒకటి చొప్పున వినిపిస్తుంటాయి. ఎందుకంటే కొలిచిన వారికి కొండంత అండగా ఉన్న ఆ దేవత పేరును తమ కడుపున పుట్టిన బిడ్డలకు పెట్టుకుంటూ ఆ తల్లి పేరుని నిత్యం తలుచుకుంటున్నారంటే ఆ అమ్మవారి పట్ల భక్తులకు ఎంత ప్రేమ భక్తి ప్రపత్తులు ఉన్నాయో అర్థమవుతుంది. సర్ప రూపంలో దర్శనమిస్తున్న కొండలమ్మ బయ్యమ్మ గారలమ్మలపై తెలుగు ప్రభ ప్రత్యేక కథనం.

- Advertisement -

సర్పాలనే దేవతలుగా ఆరాధించడం అనాదిగా ఉన్న సాంప్రదాయమే కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆలయంలో మాత్రం ముగ్గురు దేవతా మూర్తులు సర్పాలై సంచరిస్తుంటారు. ఇక్కడ భక్తులు అమ్మవార్లను సర్ప రూపంలో ప్రత్యక్షంగా దర్శనం చేసుకున్నవారు ఎందరో ఉన్నారు.

కాకతీయుల కాలంలో వారి ఇలవేల్పుగా పూజలందుకున్న కొండలమ్మ, బయ్యమ్మ, గారమ్మలు ఇప్పటికీ ఆలయంలో సర్ప రూపంలో ఇలా ప్రత్యక్ష దర్శనం ఇవ్వడం ఇక్కడి ఈ ప్రాంత ఆలయ విశేషం. ఈ కొండలమ్మ దేవాలయం కాకతీయుల పాలనకు ప్రతీకగా వారి సంస్కృతి వారసత్వానికి ప్రతిబింబంగా విలసిల్లుతూ గార్ల మండల పరిధిలోని పిన్ని రెడ్డిగూడెం గ్రామ శివారులో ప్రకృతి రమణీయతలకు నిలయమైన ప్రదేశంలో కొలువుదీరింది.

కొండలమ్మ దేవాలయం ఎంతో ప్రాచీనమైనది కాకతీయుల కాలంలో నిర్మించినది. ఓరుగల్లు పట్టణం హన్మకొండ ప్రాంతంలో నిర్మించిన వేయి స్తంభాల గుడితో పాటే ఇక్కడ ఈ ఆలయాన్ని కూడా కాకతీయుల రాజులు నిర్మించారని చరిత్రకారులు స్థానికులు చెబుతుంటారు. కాకతీయ రాజుల కళా వైభవానికి ప్రతీకగా నిలుస్తూ ప్రతి సంవత్సరం నాలుగు రోజులపాటు అంగరంగ వైభవంగా జాతరను నిర్వహిస్తారు. ఉగాది పర్వదినం సందర్భంగా మహా నైవేద్యాన్ని తల్లులకు సమర్పిస్తారు. ఈ జాతర ద్వారా దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేయడంతో ఆలయం పూర్వ వైభవాన్ని నూతన కళను సంతరించుకుంటుంది.

రుద్రమదేవి పాలనా కాలంలో కొండలమ్మ ఆలయాన్ని నిర్మించారని స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. గారమ్మ, కొండలమ్మ, బయ్యమ్మ అనే ముగ్గురు దేవతలు మనకి గర్భాలయంలో దర్శనమిస్తారు. వీరు ముగ్గురు అక్కా చెల్లెల్లని, వీరి పేరు మీదనే మూడు పుష్కరాలు చెరువులు నిర్మించారు. అవి గార్ల చెరువు బయ్యారం చెరువు కొండలమ్మ చెరువులు. ఈ ముగ్గురు దేవతల పేర్ల మీదన ఏర్పడినవే! ఈ ముగ్గురమ్మలు ఆ ముగ్గురమ్మలకి ప్రతిరూపాలేనని స్థానికుల నమ్మకం. అయితే ఇక్కడ అత్యంత ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడి ఆలయంలో భక్తులకు అడుగడుగునా పాములు కనిపిస్తాయి.

కానీ అవి భక్తుల జోలికి రావు ఎప్పుడు ఏ భక్తుడిని కూడా కాటు వేసిన చరిత్రే లేదు. దివ్య మంగళ రూపంతో ఉచ్చలమైన తేజస్సుతో ప్రకాశిస్తూ ఆలయానికి వచ్చే భక్తులను ఆశీర్వధిస్తున్నట్లు చూస్తూ ఉంటాయి. దేవతా మూర్తులైన సర్పాలకు భక్తులు పూజలు చేస్తుంటారు. దేవతలుగా పూజలందుకుంటున్న ఆ అక్కా చెల్లెల్లే ఇలా పాముల రూపంలో ప్రత్యక్షమవుతుంటారని ఇక్కడి భక్తుల ప్రగాఢ విశ్వాసం.

ఈ పురాతన ఆలయంలో ఉగాది పండుగను పురస్కరించుకొని ముందు రోజు నుండి నాలుగు రోజులపాటు అంగరంగ వైభవంగా జాతరను నిర్వహించడంతో పండగ సందర్భంగా భక్తులు ఎడ్ల బండ్ల ప్రభలతో మొక్కులు చెల్లించేందుకు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకొని తమ మొక్కులను, ముడుపులను చెల్లించుకుంటారు. భక్తులకు కొంగుబంగారంగా నిలుస్తున్న కొండలమ్మ దేవాలయం శిధిలావస్థకు చేరుకుంటున్నా దేవాదాయ శాఖ ఏం మాత్రం పట్టించుకోవడం లేదని, పురాతనమైన ఈ ఆలయాన్ని అభివృద్ధి పరచాలని గత ప్రభుత్వ హయాంలోని పాలకులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోకపోవడంతో అభివృద్ధికి నోచుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు.

పురాతన చరిత్ర కలిగి ఉండి ఎంతో మహిమగల కొండలమ్మ ఆలయంపై ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పాలకులైనా ప్రత్యేక దృష్టి సారించి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని స్థానిక గ్రామ ప్రజలు కోరుతున్నారు. ఈ సంవత్సరం కొండలమ్మ జాతర ఉత్సవాలకు ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతుంది. ఆలయ ప్రాకారాలు గోపురం మండపాలను వివిధ రంగులతో తీర్చిదిద్దడంతో పాటుగా ఆలయం బయట మిరమిట్లు గొలుపే విద్యుత్ దీపాలతో రకరకాల పూలతో అలంకరించడంతో ఆలయం నూతన శోభను సంతరించుకుంది.

నేటికీ భక్తులకు ఇలవేల్పుగా నిలుస్తున్న పినిరెడ్డి గూడెం కొండలమ్మ ఆలయంలో ఈనెల 7వ తేదీన ఎడ్లబండ్ల ప్రభల ఊరేగింపు, 8 న పూర్ణకుంభంతో దేవతారాధన, 9న నైవేద్యాల సమర్పణ, మహా జాతర, 10న భజన-సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News