Gautama Buddha: “సనాతన భారత దేశంలో ఆవిర్భవించి, చైనా, జపాన్, శ్రీలంక, బర్మా, కంబోడియా, మంగోలియా, కొరియా, టిబెట్టు, థాయిలాండ్, లావోస్ మొదలైన అనేక దేశాలకు వ్యాపించి, నేడు కూడా అక్కడ సజీవంగా ఉండి ప్రజలందరికీ మార్గదర్శనం చేస్తున్న విశ్వ మతం బౌద్ధమతం. ఇది ప్రజలకు దుఃఖ నివారణ ఉపాయాన్ని చూపించి వారిని ధర్మం వైపు ఆకర్షించింది. సిద్ధార్థుడు బౌద్ధమత ప్రవక్త ఆయన గౌతమ గోత్రానికి చెందిన వాడు. కాబట్టి గౌతముడని, శాక్య తెగకు చెందిన వాడు కాబట్టి శాక్యమునియని, బోధిసత్వుడని పిలవబడుతున్నాడు.
బౌద్ధ మతం విశ్వాసానికి చెందినది. ఆచరణకు సంబంధించినది. దీనిలో నీతి ఉంది. సామాజికత ఉంది. ధనాన్ని పోగు చేయాలని కోరిక దురాశకు మూలం. ఈ దురాశయే ఎదుటివారిని పీడిస్తుంది. దుఃఖం నుండి బాధల నుండి ప్రజలకు విముక్తి కలుగజేయడమే బౌద్ధ మత ధ్యేయం. స్వార్థాన్ని, ఆశను నాశనం చేస్తేనే మనిషి అభ్యున్నతి సాధించగలుగుతాడని దమ్మ (ధర్మ) పథం చెబుతుంది. బౌద్ధ సంస్కృతిని సూత్రాలను హెచ్చుతగ్గులుగా చేసే కుల వ్యవస్థను, కుల, మత, విద్వేషాన్ని బుద్ధ భగవానుడు నిరసించాడు. ఆయన మతం కులాతీతమైనది. విశ్వ మానవాళికి ప్రేమామృతాన్ని ప్రసాదించినది.”
శుద్ధోదన, మాయాదేవిల ముద్దుల సిద్ధార్థుడు
గౌతముడు క్రీ॥ పూ॥ 563 వ సంవత్సరంలో నేటి నేపాల్ దేశంలో గల కపిలవస్తు నగరంలోని లుంబిని వనంలో శుద్దోధనుడు, మాయాదేవి అను క్షత్రియ రాజ దంపతులకు జన్మించాడు. ఈయన జన్మ నక్షత్రాన్ని పరిశీలించిన జ్యోతిష్యులు ఇతడు గొప్ప మునిగా గాని, చక్రవర్తిగా గాని మారుతాడని జోష్యం చెప్పారు. సన్యాసం వైపు మరల రాదని శుధ్ధోధనుడు ఈయనకు సుఖవంతమైన, విలాసవంతమైన జీవితాన్ని అమర్చాడు. ఇతనికి 16 వ యేట యశోధర అనే కన్యతో వివాహం జరిగింది. వారికి రాహులుడనే పుత్రుడు జన్మించాడు.
బోధి వృక్షఛ్ఛాయాలో బుద్ధుడు
తన సారధితో రథంలో విహరిస్తూ సిద్ధార్థుడు ఒక రోగిని, ఒక వృద్ధుడిని, ఒక శవాన్ని చూసి, రోగం, వృద్ధాప్యం, మృత్యువు, దుఃఖ కారణాలని, ప్రపంచం నుండి ఈ దుఃఖాలను తొలగించాలని భావించి, తన 29వ ఏట కపిలవస్తు నగరాన్ని వదిలిపెట్టాడు. దక్షిణం వైపు పయనించి, ఆనోమ నదిని దాటి, మొదట అనూఫియా ప్రాంతంలో, అటు పిమ్మట మగధ రాజధాని అయిన రాజ గృహంలో కొంత కాలం నివసించాడు. అక్కడ అలారా, కాలంద, ఉద్ధరక, రామపుత్ర మొదలగు యోగ గురువుల వద్ద జ్ఞానార్జన మరియు యోగ సాధన చేశాడు. సాంఖ్య శాస్త్రాన్ని అభ్యసించాడు. దుఃఖ నివారణోపాయాన్ని కనుగొనడానికి ఘోర తపస్సు చేశాడు. తన శరీరాన్ని ఎన్నో కఠిన శ్రమలకు గురి చేశాడు.
కానీ నూతన జ్ఞానాన్ని అప్పుడు పొందలేక పోయాడు. ఆయన మనస్సుకు శాంతి లభించలేదు. శరీరాన్ని సుష్కింప చేయడం వ్యర్థం అని భావించి, ఆయన మళ్లీ ఆహారాన్ని తీసుకోవడం ఆరంభించాడు. పిదప బుద్ధ గయ వద్ద ఉన్న బోధి వృక్షం క్రింద ధ్యానంలో నిమగ్నుడైయున్న అతనికి జ్ఞానోదయం అయ్యింది. ఏకాగ్రతను జోడించి, సమచిత్తుడై అతడు శాంతిని, పవిత్రతను సాధించి బుద్ధుడయ్యాడు. తనకు లభించిన జ్ఞాన సారాన్ని బోధించడానికి అతడు వారణాసి వెళ్ళాడు. అక్కడి మృగ వనంలో ఉన్న ఐదుగురికి మొట్టమొదటిసారిగా తాను కనుగొన్న దర్శనాన్ని బోధించాడు. ఆ తరువాత ఎంతో మంది రాజులు, ప్రజలు ఆయన సిద్ధాంతాలను అంగీకరించి ఆయన శిష్యులుగా మారారు.
సమత్వం, సమతా ధర్మం బోధించిన క్రాంత దర్శి
గౌతమ బుద్ధుడు ఒక క్రాంత దర్శి. ఆయన తన మతంలో యజ్ఞ యాగాదులకు, తీర్థప్రసాదాలకు, దేవునికి ప్రాధాన్యత ఇవ్వలేదు. అతడు సత్యాన్వేషణకై ఎంత కృషి చేశాడో అంతే కృషి తన మత ప్రచారం కోసం చేశాడు. బుద్ధుని బోధనలు ఆనాటి ప్రజల భాష అయిన ‘పాళి’ లో ఉన్నాయి. ఆయన బోధనల సాహిత్య రూపమే దమ్మ పథం. దీనిలో మానవ ఉత్తాననికి, అభివృద్ధికి సంబంధించిన నాలుగు వందల ఇరవై మూడు కథలు ఉన్నాయి. ఈ గ్రంథంలో బౌద్ధమత సారం ఉందంటే అతిశయోక్తి కాదు. ఈ గ్రంథం జీవన సూత్రాల నిధి.
దీనిలో ప్రేమకు ప్రాధాన్యత ఇవ్వబడింది. సత్యాన్ని సత్సంగంగా, అసత్యాన్ని అసత్సంగంగా తెలుసుకున్నవాడే జ్ఞానవంతుడని ధర్మ పథం సెలవిచ్చింది. శ్రమణుడు రాగ, ద్వేష, మొహాలను, సంచలత్వాన్ని, విషయ వాంఛలను, మూర్ఖత్వాన్ని విడనాడాలని వ్యక్తి తన నోటితో అన్నదాన్ని ఆచరణ రూపంలో చేసి చూపెట్టాలని, అతడు నిజాయితీగా, నిబ్బరంగా, శీలవంతుడిగా, ఆచరణ శీలిగా, ఉండాలని, దమ్మ పథం సెలవిస్తుంది. దమ్మ పథం మానవులంతా ఒకటేనని, వారిలో ఉచ్చని చాలు లేవని పేర్కొన్నది. అందువల్ల మనం బౌద్ధాన్ని ఉచ్చ నీచ తేడాలు లేకుండా సమత్వాన్ని బోధించే సమతా ధర్మం అని అనవచ్చు.
సనాతన హైందవ ధర్మం నుంచే బౌద్ధమతావిర్భావం
గౌతమ బుద్ధుడు తనకంటే ముందున్న సనాతన హైందవ ధర్మాన్ని, జైన మతాన్ని, చార్వాక వాదాన్ని, ప్రకృత కాత్యాయనుడు, అసికేత కంబళి మరియు సంజయ వేలంతి పుత్తల ఆలోచనా విధానాలను బాగా పరిశీలించాడు. వీటన్నిటి సారాంశమే బౌద్ధ మత ఆవిర్భావము. అందువల్లనే వీటి ప్రభావం బౌద్ధ మత సిద్ధాంతాలపై స్పష్టంగా కనబడుతుంది. బుద్ధుడు ముఖ్యంగా వ్యక్తి విముక్తికి కాక సామాజిక విముక్తికై కృషి చేశాడు. ఆయన తన దృష్టిని మోక్షం నుండి సంఘం వైపు, భోగం నుండి తాత్వికత వైపు మరలించాడు. ఆయన సమాజానికి మేలు కలిగించే వృత్తులను ఎన్నుకోవాలని, కీడు కలిగించే వృత్తులను వదులుకోవాలని ప్రజలకు ఉద్భోధించాడు.
అయితే బౌద్ధ మతానికి భిక్షువులు చాలా ముఖ్యమైనవారు. సంచార జీవనం చేసే ఈ పరివ్రాజకులు. విహారాలు నిర్మించి, స్థూపాలను ప్రతిష్టించి సంఘజీవనాన్ని ఆరంభించారు. ఆ తర్వాత సంఘంలో బౌద్ధమతం ముఖ్య సంస్థగా మారిపోయింది. దీని ద్వారానే బౌద్ధం ఒక ఉద్యమంగా రూపు దాల్చింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను ఆకర్షించింది. విగ్రహారాధన వైపు ఆస్తికులను మరల్చింది. బౌద్ధ బిక్షువులు బ్రహ్మచారులు. వారికి స్థిర నివాసం గాని, ఆస్తిపాస్తులు గాని అసలే ఉండవు. బౌద్ధ ఉపాసకులు మాత్రం గృహస్తులై ఉండవచ్చు. అందువల్ల బుద్ధుని కాలంనాటి బౌద్ధ మతానుయాయులు భిక్షువులుగా లేక కుటుంబీకులుగా ఉండేవారు. సంఘ జీవనం గడిపే భిక్షువులకై విరాళాలు లభించేవి. ఆనాటి రాజులు వీరికై ఎన్నో గ్రామాలను కూడా దానంగా ఇచ్చినట్లు చారిత్రక ఆధారాలు కనబడుతున్నాయి.
పంచశీల, అష్టాంగాలను బోధించిన బుద్ధుడు
బుద్ధుని బోధనలను మనం ఆయన తెలిపిన నాలుగు సత్యాలు, పంచశీల, అష్టాంగ మార్గంలో చూడవచ్చు. ఈ ప్రపంచంలో దుఃఖం ఉంది. ఈ దుఃఖానికి కారణం ఉన్నది. దీనికి నివారణ ఉంది. నివారణోపాయం ఉంది. అనునవి ఆయన తెలిపిన నాలుగు సత్యాలు. అహింస, వ్యభిచరించకపోవడం, ఇతరుల ధనాన్ని ఆశించకపోవడం, అసత్య భాషణ నుండి దూరంగా ఉండడం, సురాపానాన్ని చేయకపోవడం అను ఈ ఐదు సూత్రాలు ‘పంచశీల’ క్రిందికి వస్తాయి. 1) సమ్యక్ దృష్టి, 2) సమ్యక్ సంకల్పం, 3) సంమ్యక్ వాణి, 4) సంమ్యక్కర్మ, 5) సమాజానికి కీడు కలిగించని వృత్తి, 6) సంమ్యక్ వ్యాయామం, 7) సంమ్యక్ స్మృతి, 8) సంమ్యక్ సమాధి. అను ఈ ఎనిమిది సూత్రాలు అష్టాంగ మార్గం క్రిందికి వస్తాయి. అష్టాంగ మార్గం ద్వారా దుఃఖం ఏర్పడే చోటే దాన్ని నివారించు కోవచ్చునని గౌతమ బుద్ధుడు సెలవిచ్చాడు.
విద్యా వ్యాప్తితో విశ్వ మతంగా బౌద్ధం
గౌతమ బుద్ధుని తర్వాత బౌద్ధ మత ప్రచారానికి మౌర్య వంశానికి చెందిన అశోక చక్రవర్తి, అంబేద్కర్ మహాశయుడు చేసిన సేవలు మరువరానివి. కళింగ యుద్ధం లో జరిగిన రక్తపాతానికి అశోకుడు విచలితుడయ్యాడు. అప్పుడతడు బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. అతడు అనేక బౌద్ధ నగరాలను, స్థూపాలను, విహారాలను, చైత్రాలను, స్తంభాలను, శిలా శాసనాలను నిర్మించాడు. బౌద్ధ మత వ్యాప్తికై ఎంతో తోడ్పడ్డాడు. దీన్ని ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేయడానికి ‘ధర్మ ప్రచారకుల’ను వివిధ దేశాలకు పంపాడు. అశోకుడి ప్రయత్నం వల్లనే బౌద్ధ మతం విశ్వ మతంగా ప్రపంచమంతటా వ్యాపించింది. నలందా, వల్లభి, విక్రమశిల వంటి ఎన్నో విశ్వవిద్యాలయాలు ఆనాడు బౌద్ధమత వ్యాప్తికై ఎంతగానో తోడ్పడ్డాయి. బుద్ధుని తర్వాత 300 సంవత్సరాలకే బౌద్ధం అనేక శాఖలుగా విడిపోయింది. హీనా యానం, మహా యానం, వజ్ర యానం, మంత్ర యానం అన్నది వీటిలో కొన్ని. హిందూ మతం లోని అంటరానితనం పై తీవ్ర అసంతృప్తిని కలిగి తీవ్ర మనస్థాపాన్ని పొందిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన అనుయాయులైన ఐదు లక్షల మంది దళితులతో బౌద్ధ మతాన్ని స్వీకరించి ఈ మతం వ్యాప్తికి ఎంతగానో తోడ్పడ్డారు.
మానవాళికి ప్రసాదించిన మూడు ఆణిముత్యాలు
బౌద్ధ మతం ఒక తాత్విక దార్శనిక రూపం. ప్రపంచంలో పరిఢవిల్లుతున్న ఉచ్చ, నీచ భేదాలను తొలగించి, ద్వేషాన్ని, క్రౌర్యాన్ని, కపటత్వాన్ని రూపు మాపి కరుణను, ప్రేమను, స్వచ్ఛతను ప్రపంచానికి ప్రసాదించింది. అందుకే ఎందరో బౌద్ధమత అనుయాయులుగా మారారు. వారందరికీ బుద్ధ భగవానుడు ఆణిముత్యాల వంటి మూడు వాక్యాలను బోధించి వాటిని విశ్వవ్యాప్తం ప్రచారం చేయించాడు.
“బుద్ధం శరణం గచ్చామి!
సంఘం శరణం గచ్చామి!
ధర్మం శరణం గచ్చామి! “
“సాహిత్య కళా విభూషణ్” చౌడూరి నరసింహరావు
ప్రవచన కర్త, ఆధ్యాత్మిక విశ్లేషకులు

