Gold silver crash- Lunar eclipse:గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరల్లో చోటు చేసుకున్న మార్పులు సాధారణ వినియోగదారులతో పాటు పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. గత ఏడాది కాలంగా ఎడతెరిపి లేకుండా పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా దిశ మార్చుకున్నాయి. 2026 జనవరి 30న ధరలు గణనీయంగా పడిపోవడంతో మార్కెట్‌లో ఒక రకమైన ఆందోళన వాతావరణం నెలకొంది. ఆ రోజు నుంచి బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టడం కొనసాగుతోంది.
ధరలు తగ్గడంతో కొత్తగా కొనుగోలు చేయాలని భావిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా పెళ్లిళ్లు, పెట్టుబడులు, దీర్ఘకాలిక అవసరాల కోసం బంగారం కొనాలనుకునే వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. అయితే ఇదే సమయంలో జ్యోతిష్య పండితులు, మార్కెట్‌ను గమనిస్తున్న వర్గాలు మాత్రం తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సూచిస్తున్నాయి.
Also Read: https://teluguprabha.net/devotional-news/saturn-pisces-transit-2026-benefits-for-four-zodiac-signs/
బంగారం, వెండి ధరలు..
ఇటీవల వరకు బంగారం, వెండి ధరలు ఎందుకు భారీగా పెరిగాయంటే, దానికి అనేక అంతర్జాతీయ కారణాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం, ఆర్థిక అనిశ్చితి వంటి అంశాలు పెట్టుబడిదారులను భద్రత కలిగిన సాధనాల వైపు నడిపించాయి. ఈ పరిస్థితుల్లో బంగారం, వెండి వంటి విలువైన లోహాలపై డిమాండ్ పెరిగింది.
ట్రంప్ టారిఫ్ లు..
దీనికి తోడు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పలు దేశాలపై విధించిన టారిఫ్స్, ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా గ్లోబల్ మార్కెట్లపై ప్రభావం చూపాయి. మరోవైపు డాలర్ విలువ బలహీనపడటం కూడా బంగారం, వెండి ధరలు పెరగడానికి కారణమైంది. డాలర్ పడిపోతే, పెట్టుబడిదారులు ప్రత్యామ్నాయంగా బంగారాన్ని ఆశ్రయించడం సాధారణంగా జరుగుతుంటుంది.
ప్రాఫిట్ బుకింగ్..
అయితే ఇటీవల పరిస్థితులు కొంతవరకు మారాయి. అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి తగ్గడం, డాలర్ ఇండెక్స్ మళ్లీ బలపడటం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీంతో గతంలో అధిక ధరలకు కొనుగోలు చేసిన పెట్టుబడిదారులు లాభాలు పొందేందుకు బంగారం, వెండిని విక్రయించడం ప్రారంభించారు. ఈ ప్రాఫిట్ బుకింగ్ కారణంగా ధరలు ఒక్కసారిగా క్షీణించాయి.
ఈ పరిణామాలను గమనించిన కొంతమంది పెట్టుబడిదారులు ఇప్పుడు స్టాక్ మార్కెట్ వైపు దృష్టి పెట్టారు. బంగారం, వెండి ధరలు పడిపోవడాన్ని ఒక అవకాశం గా చూసి, ఆ డబ్బును షేర్లలో పెట్టుబడి పెట్టాలని భావిస్తున్నారు. కానీ ఇక్కడే నిపుణులు మరోసారి హెచ్చరిస్తున్నారు.
మార్చి 3న చంద్రగ్రహణం..
వచ్చే మార్చి 3న చంద్రగ్రహణం 2026 సంభవించనుంది. ఆ తేదీ వరకు, అంటే చంద్రగ్రహణం ముగిసే వరకు స్టాక్ మార్కెట్‌తో పాటు బంగారం, వెండి పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. ప్రతి ఏడాది సూర్యగ్రహణం, చంద్రగ్రహణం వస్తూనే ఉంటాయి. కానీ ప్రతి గ్రహణం ప్రభావం ఒకేలా ఉండదని వారు చెబుతున్నారు.
సూర్యగ్రహణం..
2026లో సంభవించబోయే సూర్యగ్రహణం ఉగాది పండుగకు ముందు, మహాశివరాత్రి తర్వాత వచ్చే అమావాస్య రోజున జరుగుతుంది. ఈ సూర్యగ్రహణం భారత్‌లో కనిపించదు. అయితే మార్చి 3న జరిగే చంద్రగ్రహణం మాత్రం ముఖ్యమైనదిగా పరిగణిస్తున్నారు. ఈ రెండు గ్రహణాల సమయం మార్కెట్లపై ప్రభావం చూపుతుందని జ్యోతిష్య విశ్లేషణలు చెబుతున్నాయి.
బంగారం, వెండి ధరలు..
గత ఏడాది కాలంగా బంగారం, వెండి ధరలు వేగంగా పెరగడం, ఇప్పుడు ఒక్కసారిగా తగ్గడం ఒక కీలక దశగా భావిస్తున్నారు. ఈ దశను బ్రేక్ ఈవెన్ స్థితిగా కొందరు జ్యోతిష్య పండితులు పేర్కొంటున్నారు. అంటే, ధరలు స్థిరపడే దశలో ఉన్నాయని వారి అభిప్రాయం.
పంచగ్రహ కూటమి..
ఈ ఏడాది గ్రహణాలు పంచగ్రహ కూటమి సమయంలో జరుగుతున్నాయని చెబుతున్నారు. బుధుడు, శుక్రుడు, రాహువు, రవి, చంద్రుడు ఈ ఐదు గ్రహాలు ఒకే సమయంలో ప్రభావం చూపే స్థితిని పంచగ్రహ కూటమిగా పరిగణిస్తారు. ఈ గ్రహాల్లో ఎక్కువ శీఘ్రగతిని కలిగినవే కావడం వల్ల ప్రపంచవ్యాప్తంగా అస్థిరత ఏర్పడే అవకాశం ఉంటుందని జ్యోతిష్య విశ్లేషణ.
చంద్రుడు అతి వేగంగా..
ప్రత్యేకంగా చంద్రుడు అతి వేగంగా కదిలే గ్రహంగా భావిస్తారు. అలాగే బుధుడు, శుక్రుడు ఎక్కువగా సూర్యుడి సమీపంలోనే ఉంటాయి. ఈ కారణాల వల్ల ఆర్థిక రంగంలో హెచ్చుతగ్గులు కనిపించే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు.
పరాభవ నామ సంవత్సరం..
మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే, ఉగాది 2026తో ప్రారంభమయ్యే పరాభవ నామ సంవత్సరం. ఈ సంవత్సరం ఆర్థికంగా, రాజకీయంగా అస్థిరతలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయని జ్యోతిష్య పండితుల అభిప్రాయం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు భద్రత కోసం బంగారం, వెండి వంటి సంప్రదాయ పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతారు.
అందువల్ల సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ముగిసిన తర్వాత బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు. ఆ సమయంలో జాగ్రత్తగా పెట్టుబడి పెట్టగలిగితే లాభాలు పొందే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు.
చంద్రగ్రహణం పూర్తయ్యే వరకు ..
కానీ అప్పటి వరకు, అంటే మార్చి 3న చంద్రగ్రహణం పూర్తయ్యే వరకు బంగారం, వెండి లేదా స్టాక్ మార్కెట్‌లో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టకుండా వేచి ఉండటం మంచిదని నిపుణుల సూచన. మార్కెట్‌లో ఉన్న పరిస్థితులను, అంతర్జాతీయ పరిణామాలను గమనిస్తూ నిర్ణయాలు తీసుకోవాలని వారు చెబుతున్నారు.

