Naivedyam Purity-Puja Rules: హిందూ సంప్రదాయంలో దేవుని పూజ పూర్తయిన తర్వాత నైవేద్యం సమర్పించడం అత్యంత ముఖ్యమైన ఆచారంగా భావిస్తారు. దేవతలకు సమర్పించే ఆహారం సాధారణ భోజనం కాకుండా పవిత్రతతో కూడినదిగా ఉండాలి. భక్తులు తమ శ్రద్ధా భక్తులతో, నిర్మలమైన మనసుతో నైవేద్యాన్ని సిద్ధం చేస్తారు. అయితే పూజా సమయంలో లేదా నైవేద్యం తయారు చేసే సమయంలో అనుకోకుండా వెంట్రుకలు, పురుగులు లేదా ఈగలు ఆహారంలో పడితే ఆ పరిస్థితిని ఎలా తీసుకోవాలో అనేవిషయం గురించి అనేకమందికి సందేహం వస్తుంది. ఈ అంశంపై పండితులు స్పష్టమైన వివరణ ఇచ్చారు.
వెంట్రుక, ఈగ లేదా ఇతర కీటకాలు..
పండితులు చెబుతున్నదాని ప్రకారం, దేవునికి సమర్పించబోయే నైవేద్యంలో ఎలాంటి అపరిశుభ్రతలు కనపడినా ఆ ఆహారాన్ని సమర్పించడం సరికాదు. ఒకవేళ వెంట్రుక, ఈగ లేదా ఇతర కీటకాలు ఆహారంలో పడితే ఆ నైవేద్యాన్ని పక్కన పెట్టి కొత్తదాన్ని తయారు చేయాలని పండితులు సూచించారు. దేవునికి సమర్పించే ఆహారం ఎప్పటికీ కలుషితం కాకూడదని, అది భక్తి ,పవిత్రతకు ప్రతీక అని ఆయన వివరించారు.
Also Read: https://teluguprabha.net/devotional-news/dasara-jammi-tree-pooja-significance-rituals-and-astrology/
ఆడవారు జుట్టును విప్పి..
ఇక నైవేద్యం తయారు చేసే సమయంలో పాటించాల్సిన నియమాల గురించి కూడా ప్రత్యేకంగా చెప్పారు. ఆడవారు జుట్టును విప్పి ఉంచడం పూజ సమయంలో తప్పని చెబుతున్నారు. కలియుగంలో అలాంటి అలవాట్లు విస్తరించడం వల్ల పూజా విధానంలో స్వచ్ఛత దెబ్బతింటుందని ఆయన చెప్పారు. అందుకే పూజ సమయంలోనే కాకుండా నైవేద్యం తయారు చేసే సమయంలో కూడా జుట్టును సరిగా ముడిపెట్టుకొని ఉంచుకోవడం అవసరమని పండితులు చెబుతున్నారు.
మాట్లాడకూడదని…
ఇదే సందర్భంగా మరో ముఖ్యమైన అంశాన్ని కూడా నిపుణులు చెబుతున్నారు. నైవేద్యం తయారు చేస్తూ మాట్లాడకూడదని ఆయన అన్నారు. ఎందుకంటే మాట్లాడుతున్నప్పుడు నోట్లోని లాలాజలం అనుకోకుండా ఆహారంలో పడే ప్రమాదం ఉంది. అలాంటి సందర్భాల్లో నైవేద్యం పవిత్రత కోల్పోతుందని, అది దేవునికి అర్పించడానికి పనికిరాదని పండితులు స్పష్టం చేశారు. అందువల్ల నైవేద్యం తయారీలో శుభ్రత పాటించడం అత్యంత ముఖ్యమని ఆయన సూచించారు.
పరిశుభ్రంగా..
నైవేద్య తయారీలో శుభ్రతపై కూడా పండితులు స్పష్టమైన దిశానిర్దేశం ఇచ్చారు. వంట ప్రారంభించే ముందు చేతులను బాగా కడుక్కోవాలి. వంటగదిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. భక్తి భావంతో తయారు చేసే నైవేద్యం శరీరానికి మాత్రమే కాకుండా మనసుకు కూడా పవిత్రతనిస్తుందని ఆయన వివరించారు.
ఆహారాన్ని పారేయకుండా..
పండితులు చెప్పిన మరో అంశం ఏమిటంటే, ఒకవేళ నైవేద్యం తయారీలో అపరిశుభ్రతలు కలిసినట్లయితే ఆ ఆహారాన్ని పారేయకుండా జంతువులకు లేదా పక్షులకు ఆహారంగా ఇవ్వవచ్చని. ఆహారాన్ని వృథా చేయకుండా ఉపయోగించడం కూడా ఒక విధమైన ధర్మం అని ఆయన సూచించారు. దేవునికి సమర్పించకూడదని మాత్రమే చెప్పి, ఆహారం వృథా చేయొద్దని ఆయన సూచన వెనుక భావం ఉంది.
భక్తి, శ్రద్ధ, పరిశుభ్రత…
నైవేద్యం తయారీలో భక్తి, శ్రద్ధ, పరిశుభ్రత ముఖ్యమని పండితులు పదేపదే గుర్తుచేశారు. పూజలో లేదా దేవునికి సమర్పించే ఏ ఆచారంలోనైనా పవిత్రత కాపాడటం అనేది ప్రధాన కర్తవ్యమని ఆయన వివరించారు. దేవునికి అర్పించే ఆహారం శుద్ధంగా ఉండాలి, అందుకే నైవేద్యం తయారీలో చిన్న తప్పిదం కూడా జరిగకూడదని స్పష్టంగా చెప్పారు.
Also Read: https://teluguprabha.net/devotional-news/coconut-tree-vastu-benefits-and-importance-in-home/
భక్తులు తరచుగా ఎదుర్కొనే సందిగ్ధ పరిస్థితులకు సమాధానం ఇస్తూ పండితులు ఇచ్చిన మార్గదర్శకాలు చాలా స్పష్టంగా ఉంటాయి. నైవేద్యంలో ఏదైనా అపరిశుభ్రత కలిసినట్లయితే దేవునికి అది సమర్పించకూడదు. దానికోసం కొత్తగా ఆహారం సిద్ధం చేయాలి. ఇలా చేయడం ద్వారా దేవునికి సమర్పించే నైవేద్యం పవిత్రంగా నిలుస్తుంది.


