Hanuman Jayanti 2026: “”” సనాతన హైందవ ధర్మంలోని భాగవతోత్తములలో ఆంజనేయుడు విశిష్టమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడు. ఆయన పరమ భాగవతోత్తముడు. కడు వినయశీలి. సదా శ్రీరాముని సేవలో మునిగి ఉండేవాడు. భగవంతుని సేవ చేసే అవకాశం దొరకనప్పుడు విచారపడేవాడు. భగవంతుని నిరంతరం సేవించేవాడు. ప్రతిఫలాపేక్ష లేని సేవ కేవలం హనుమంతుడికి మాత్రమే సాధ్యం! కలియుగంలో ఏ ఇతర దేవతకు లభించనంత ప్రాముఖ్యం హనుమంతుడికి లభించింది. గ్రామ గ్రామాన ఆంజనేయుని గుళ్ళు ఉన్నాయి. ఎక్కడెక్కడ రామాలయం ఉంటుందో అక్కడే ఆంజనేయుడు గుడి కూడా ఉంటుంది.
ఆంజనేయుడు శక్తికి ప్రతీక. నవవ్యాకరణవేత్త. బ్రహ్మా, ఈశ్వరుడు, ఇంద్రుడు, యముడు, కుబేరుడు, వరుణుడు, అగ్ని, విశ్వకర్మ వీరందరి వరాలు లభించిన ఏకైక భాగవతోత్తముడు ఆంజనేయుడు. కాబట్టి అతడు చిరంజీవి. అజరామరుడు. నాలుగు యుగాల్లోనూ అతడు విభిన్న రూపాలలో విలసిల్లుతాడు. సత్య యుగంలో అనాది అయిన శివుని రూపంలోనూ, త్రేతా యుగంలో శ్రీరామ కథా సూత్రధారుడైన ఆంజనేయుని రూపంలోనూ, ద్వాపర యుగంలో అర్జునుని రథం పైన గల ధ్వజం రూపంలోనూ విలసిల్లాడు. ఈ కలియుగంలోనైతే ఎక్కడ రామకథ గానం జరుగుతుందో.. అక్కడ దానిని వినే ప్రథమ శ్రోతగా అదృశ్య రూపంలో ఉంటాడు. “యత్ర యత్ర రఘునాధ కీర్తనం, తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్..” శ్రీరామునికి ప్రియతమ భక్తుడైన ఆంజనేయుడు విపత్తులను తొలగించే దివ్య మంగళ మూర్తి. కర్తవ్యపరాయణతకు స్ఫూర్తి.
స్వామి భక్తి పరాయణతకు దీప్తి. కానీ బాల్యంలో అతడు చేసిన చిలిపి పనుల వల్ల ఋషుల శాపం అతనికి ఉంది. అందువల్ల అతడు తన శక్తి యుక్తులను మరిచిపోయాడు. ఎవరైనా అతనికి తన శక్తిని ఙ్ఞప్తికి తెప్పిస్తే అతడు అద్భుతాలను చేయగల ధీశాలి. ఎవరైతే సమర్పణ భావంతో శ్రద్ధా భక్తులతో ఆంజనేయుని శరణాగతిని కోరుతారో.. వారికి అన్ని సుఖాలు లభిస్తాయి. ఆంజనేయుని భక్తుడు రోగాలకు, భయానికి చాలా దూరంగా ఉంటాడు. నిజానికి భయంగాని రోగంగాని అతడి దరి చేరవు. భక్తుడి శారీరక, దైవిక విపత్తులు తొలగిపోతాయి. హనుమంతుడి అనుగ్రహంతో పాటు శ్రీరాముని అనుగ్రహం కూడా లభిస్తుంది. హనుమంతుడు పరమదయాశీలుడు. అందువల్లనే ఆయన భక్తునికి వెంటనే ఫలం లభిస్తుంది. ఎవరైతే పవనపుత్రుడిపై విశ్వాసాన్ని ఉంచుతారో.. వారికి తప్పనిసరిగా మేలు కలుగుతుంది. ఆంజనేయుని కథ అనంతమైనది. ఆయన మహిమకు అంతమనేదే లేదు. విష్ణువు, నారదుడు, శ్రీరాముడు, కుబేరుడు, సరస్వతి దేవి, సప్త ఋషులు మొదలైన వారంతా ఆంజనేయుడు గుణగణాలను కొనియాడారు. ఆంజనేయుని భక్తులమైన మనం కూడా అదే విధంగా చేసి ఆ స్వామిని పూజించి, స్మరించి, ఆరాధించి ఆయన కృపను పొందుదాం! “”
హనుమజ్జయంతి గానా లేక హనుమద్విజయోత్సవం గానా?
శ్రీ హనుమత్ విజయోత్సవం ప్రతి సంవత్సరం చైత్ర పౌర్ణమి నాడు జరుపుకునే పవిత్రమైన దినం. హనుమంతుడు సీతాదేవిని దర్శించుకుని, లంకలో రావణాసురుని సైన్యాన్ని, నికుంభుడిని సంహరించి విజయం సాధించినందుకు ప్రతీకగా దీనిని జరుపుకుంటారు. ఇది సుందరకాండలో హనుమంతుని విజయాలను స్మరిస్తూ, శ్రీరామునికి ఆంజనేయుడు అత్యంత సన్నిహితుడైన రోజు. కనుక ఈ రోజు హనుమద్వి జయోత్సవంగా జరుపుకోవాలి. అయితే కొన్ని ప్రాంతాల్లో ఈరోజు హనుమజ్జయంతి ని జరుపుతారు. అది సరికాదు.
“వైశాఖే మాసి కృష్ణాయాం” అనేది హనుమజ్జయంతికి సంబంధించిన ప్రసిద్ధ శ్లోకం. ఈ శ్లోకం హనుమంతుని జన్మ తిథిని తెలుపుతుంది.ఈశ్లోకం శ్రీ ఆంజనేయ మంగళాష్టకం లోనిది.
వైశాఖే మాసి కృష్ణాయాం
దశమ్యాం మందవాసరే ।
పూర్వాభాద్రా ప్రభూతాయ
మంగళం శ్రీహనుమతే॥
(వైశాఖ మాసంలో, కృష్ణ పక్షంలో, దశమి తిథి నాడు, శనివారం (మందవాసరే), పూర్వాభాద్ర నక్షత్రంలో జన్మించిన శ్రీ హనుమంతునికి మంగళం కలుగుగాక!) అనే శ్లోకం ప్రకారం, హనుమజ్జయంతి ని వైశాఖ బహుళ దశమినాడు జరుపుకుంటారు. కావున ఈ రోజును హనుమద్విజయోత్సవంగానే జరుపుకోవాలని శాస్త్రం చెబుతుంది.
ఏకాదశ రుద్రావతారుడు ఆంజనేయుడు
కలియుగంలో ఏ ఇతర దేవతకు లభించనంత ప్రాచుర్యం ఆంజనేయుడికి లభించింది. లభిస్తుంది. ఊరూరా ఆంజనేయుని గుళ్ళు ఉన్నాయి. రామాలయాలు ఎక్కడెక్కడ ఉంటాయో అక్కడక్కడ ఆంజనేయుని గుడి కూడా ఉంటుంది. కలియుగంలో హనుమద్ ఉపాసనకు ప్రథమ స్థానం లభిస్తున్నదంటే అతిశయోక్తి కాదు. ఈ నేలపై రుద్రావతారంగా జన్మించిన ఆంజనేయుడు తన దృఢమైన ఇచ్ఛా శక్తి, కఠిన కార్యదీక్ష, అద్వితీయమైన శౌర్య పరాక్రమాలు, మహత్తరమైన ప్రజ్ఞా పాఠవాలు, అకుంఠితమైన సేవాభావం, విద్యా, బుద్ధి, వివేకం, మనస్సు పైన దృఢమైన నియంత్రణ, భగవంతుని పట్ల అవిచలిత భక్తి భావం కారణంగా అష్టసిద్ధులు, నవనిధులకు అధిపతిగా పూజించబడ్డాడు. ఆంజనేయుడు తన సేవాపరాయణత తన మంచి ప్రవర్తన తాను చేసిన మంచి కార్యాల వల్ల ఈ భూమిపై అతనికి అమరత్వం లభించింది. అందువల్లనే అతడు అన్నిచోట్ల అందరి హృదయాలలో ఉండి అందరితో ఆరాధింపబడుతు న్నాడు. ముఖ్యంగా శైవులు ఆంజనేయుని 11వ రుద్రావతారంగా భావిస్తారు. స్కంద పురాణంలోని ఈ శ్లోకం.
వోవై ఏకాదశో రుద్రో;
హనుమాన్ స మహా కపిః।
అవతీర్ణం సహాయతార్ధ;
విష్ణోర్మిత తేజసః॥
(రాముడిగా అవతరించిన విష్ణుమూర్తికి సహాయపడడానికి సాక్షాత్తు పరమశివుడే ఆంజనేయుడిగా ఉద్భవించాడు.) శివ పురాణం కూడా రామకార్యం కోసమే శివుడు హనుమంతుడిగా జన్మించాడని పేర్కొంటుంది.
శ్రీరామకథా సూత్రధారి!
“దుష్ట శిక్షణ శిష్ట రక్షణ” నియమాన్ని ఏర్పరచుకున్న శ్రీమహావిష్ణువు త్రేతాయుగాన దశరథ మహారాజు పుత్రుడుగా అవతారాన్ని ఎత్తే సందర్భంలో.. వివిధ దేవతలు శ్రీరామునికి సహాయపడటానికి వానరులుగా జన్మించారు. అటువంటి వానరులలో హనుమంతుడు ఒకడు. ఇతడు వాయునందనుడు. రుద్రావతారుడు. రామావతార సమయంలో శివుడు రాముని సేవించుకోవడానికి హనుమంతుడిగా ఈ జగత్తులో అవతరించాడు. వానర శ్రేష్టుడైన ఆంజనేయుడు అనంతమైన గుణగణాలకు ఆలవాలం. రామ కార్యం కోసమే అతడు కూడా దివి నుండి భువికి వచ్చాడు. శ్రీరాముని కలిసినప్పటినుండి శ్రీరాముని ప్రతి కార్యంలోనూ ఇతడు సూత్రధారిగా వ్యవహరించాడు. సుందరకాండ కు సూత్రధారియై సీతారాముల వియోగాన్ని బాపి, సీతారాముల పట్టాభిషేకానికి ప్రధాన కారకుడు కావడమే కాకుండా శ్రీరాముని ప్రేమకు పాత్రులు కాగలిగాడు ఆంజనేయుడు.
అతులిత వ్యక్తిత్వశీలి ఆంజనేయ స్వామి
ఆంజనేయుడు అతులిత వ్యక్తిత్వశీలి. అమిత శక్తిశాలి తన బాల్యంలోనే సూర్యుణ్ణి ఎర్రని పండుగ భావించి మింగడానికి ఆకాశంలోకి ఎగిరాడు. అతడు అన్ని విద్యలను తెలిసినవాడు. సకల శాస్త్రాలను అభ్యసించినవాడు. అమిత బుద్ధిశాలి. అజయ బలశాలి. స్వయంగా సూర్యభగవానుడే అతనికి శాస్త్ర జ్ఞానాన్ని ప్రసాదించాడు. సూర్యుడు తన తేజస్సులో నూరవ శాతం ఆంజనేయునికి ఇచ్చాడు. కాబట్టి శాస్త్ర జ్ఞానంలో అతనితో పోటీపడే వారెవ్వరూ లేరు. హనుమంతుడు గొప్ప వినయశీలి. గొప్ప భక్తుడు. తన వాక్చాతుర్యంతో ఎవరినైనా తన వైపు తిప్పుకోగల సమర్థుడు. అతని వల్లే సుగ్రీవునికి రాముని మిత్రత్వం లభించింది. అతని వల్లే విభీషణునికి రాముని శరణాగతి, లంకా రాజ్యాధిపత్యం లభించింది. హనుమంతుని కృప లేకుండా రామభక్తి లభించదు. రామభక్తి లభించనిదే ముక్తి కూడా లభించదు.
ఆంజనేయుడి అద్భుత పరాక్రమానికి మచ్చుతునకలు
సీతమ్మను వెతకడానికి వెళ్లిన ఆంజనేయుడికి జాంబవంతుడు అతని శక్తిని జ్ఞప్తికి తెప్పిస్తాడు. ఫలితంగా ఆంజనేయుడు పర్వతాకారుడుగా మారి సముద్రాన్ని అవలీలగా లంఘిస్తాడు. అతడు రావణునితో సహా రాక్షసులందరినీ సంహరించి, సీతాదేవిని శ్రీరాముని చెంతకు తీసుకు వెళ్ళేటంతటి శక్తిమంతుడే. కానీ ప్రభువు ఆజ్ఞాపించలేదు. కాబట్టి అతడు ఆ పని చేయలేదు. హనుమంతుడు మర్యాద కలవాడు. బ్రహ్మాస్త్రం కూడా బ్రహ్మ ఇచ్చిన వరం వల్ల తనను ఏమీ చేయలేదని విషయం అతడికి తెలుసు. కానీ బ్రహ్మాస్త్ర మర్యాదను రక్షించడానికి దాని ప్రభావం వల్ల తాను మూర్ఛిల్లినట్లు నటిస్తాడు. నాగపాశంతో బంధించి మేఘనాధుడతన్ని రావణుని సభకు తీసుకొని వెళ్ళినప్పుడు అతడు నిర్భయంగా తన ప్రభువైన శ్రీ రామచంద్రుని గుణగణాలను రావణుని ముందు ఉంచుతాడు.
గర్వాన్ని పరిత్యజించి రాముని శరణు జొచ్చుమని ఉద్భోదిస్తాడు. గర్వం వినాశనం వైపు వ్యక్తులను కొనిపోతుందని, శ్రీరామునితో వైరం పెట్టుకునే వానికి వేరొక చోట ఆశ్రయం లభించదనే సత్యాన్ని రాక్ష సభలో నొక్కి వక్కాణించాడు ఆంజనేయుడు. తన తోకకు నిప్పంటిస్తే దానికి ప్రతీకారంగా లంకా దహనం చేసి హనుమంతుడు వాహనర శక్తిని రాక్షసుల ముందు ప్రదర్శించాడు. మేఘనాథుని శక్తి ప్రహారంతో లక్ష్మణుడు మూర్ఛిల్లినప్పుడు లంక నుండి సుశేనుడని వైద్యుణ్ని గృహసమేతంగా యుద్ధరంగంలోనికి తీసుకొని వచ్చి తిరిగి అతన్ని లంకలో దింపి వచ్చాడు. ద్రోణాచల పర్వతాన్ని సంజీవని మౌలిక కోసం తెచ్చి లక్ష్మణునికి స్వస్థత చేకూర్చాడు. ఔషధానికై పర్వతాన్ని ఎత్తుకొని రావడం లక్ష్మణున్ని రక్షించడం మహిరావణుని చంపి రామలక్ష్మణులను రక్షించడం కొన్ని మచ్చుతునకలు మాత్రమే!
భక్తితో హనుమను సేవిద్దాం! శ్రీ రాముని కృపను పొందుదాం!
ఎవరైతే సమర్పణా భావంతో, శ్రద్ధతో, భక్తితో హనుమంతుని శరణాగతిని కోరుతారో.. వారికి అన్ని సుఖాలు లభిస్తాయి. హనుమంతుని భక్తుడు రోగాలకు, భయాలకు చాలా దూరంగా ఉంటాడు. భూత, ప్రేత, పిశాచాది భయాలు గాని, రోగంగాని వారి దరి చేరవు. భక్తుల శారీరక దైవిక విపత్తులన్నీ తొలగిపోతాయి. వారికి హనుమంతుడి అనుగ్రహంతో పాటు శ్రీరాముని అనుగ్రహం కూడా లభించి తీరుతుంది. హనుమంతుడు దయాశీలుడు. అందువల్ల ఆయన భక్తునికి వెంటనే ఫలం లభిస్తుంది. ఎవరైతే పవన పుత్రుడిపై పరిపూర్ణమైన విశ్వాసాన్ని ఉంచుతారో, వారికి ఎంతో మేలు కలుగుతుంది. ఆంజనేయుని కథ అనంతమైనది. ఆయన మహిమకు అంతమనేదే లేదు. విష్ణువు, నారదుడు, శ్రీరాముడు, కుబేరుడు, సరస్వతి దేవి, ఋషులు మొదలగువారు ఆంజనేయుని గుణగణాలను కీర్తించారు. అందువల్ల భక్తులమైన మనందరం కూడా అదే విధంగా కొనసాగించి ఆంజనేయుని భక్తి ప్రపత్తులతో పూజించి, స్మరించి, ఆరాధించి ఆయన కృపను తద్వారా శ్రీ రాముని కృపను పొందుదాం!
సర్వత్ర విజయ ప్రాప్తికై రోజూ ఉదయం సాయం కాలాల్లో తప్పక పాటించాల్సిన శ్లోకం.
హనుమాన్ అంజనాసూనుః
వాయుపుత్రో మహాబలః
రామేశ్టః ఫల్గుణ సఖః
పింగాక్షోమిత విక్రమః
ఉదధి క్రమణశ్చైవ
సీతా శోక వినాశకః
లక్ష్మణ ప్రాణదాతాచ
దశగ్రీవస్య దర్పహా
ద్వాదశైతాని నామాని
కపీంద్రస్య మహాత్మనః
స్వాప కాలే పఠేన్నిత్యం
యాత్రా కాలే విశేషతః
తస్య మృత్యుః భయన్నాస్తి
సర్వత్ర విజయీ భవేత్॥
“సాహిత్య కళా విభూషణ్” చౌడూరి నరసింహారావు
ప్రవచన కర్త, ఆధ్యాత్మిక విశ్లేషకులు

