యాదాద్రికి ధీటుగా వల్మిడి సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తన్నీరు హరీష్ రావు పేర్కొన్నారు. పాలకుర్తి మండలం వల్మీడి గుట్టపై నూతనంగా నిర్మించిన శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి మంగళ శాసనములచే శ్రీ సీతారామాంజనేయ విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఎర్రబెల్లి దయాకర్ రావు నేతృత్వంలో శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో జరిగిన సీతారాముల విగ్రహాల పునః ప్రతిష్టాపన దేవాలయ పునః ప్రారంభోత్సవ కార్యక్రమానికి త్రిదండి చిన్న జీయార్ స్వామి, రాష్ట్ర మంత్రులు టి.హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్ లు హాజరయ్యారు.
ముందుగా త్రిదండి చిన్న జీయార్ కొత్తగా నిర్మించిన శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో వేదమంత్రోచ్ఛరణల నడుమ సీతారాముల విగ్రహాన్ని ప్రతిష్ట చేశారు. అనంతరం ఆలయ సన్నిధిలో ఇతర విగ్రహాలను, ఆలయ గోపురం పై కలశాన్ని చిన్నజీయర్ స్వామి ప్రతిష్టించారు. ఈ సందర్బంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ రాష్ట్రం లో పురాతన దేవాలయాల అభివృద్ధి తో పాటుగ నూతనంగా నిర్మిస్తున్న దేవాలయాలకు అత్యంత నిధులు మంజూరు చేస్తున్నామని గుర్తు చేశారు. దేవాలయాలలో మౌలిక వసతుల కల్పన భక్తులకు అన్ని సౌకర్యాల ఏర్పాటుకు ప్రభుత్వం తగిన కృషి చేస్తోందన్నారు. దేవాలయాల నిర్మాణమే కాకుండా జీర్ణదశలో వున్నా దేవాలయాలకు ధూపదీప నైవేద్యం కింద ఇప్పటికే ఏడూ వేల దేవాలయాలకు నిధులు చెల్లిస్తున్నామన్నారు. గతంలో ధూపదీపాల కింద ఆరు వేల ఉండేదని దానిని 10 వేలకు పెంచారని మంత్రి తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలయాల నిర్మాణం చేస్తూ ప్రజల్లో భక్తిభావాన్ని పెంచుతున్నారన్నారు.
కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన ఈ పదేండ్లలో రాష్ట్రంలో ఎటువంటి కరువు కాటకాలు రాలేదని ఆ దేవుడి ఆశీస్సులు కృప రాష్ట్రం, రాష్ట్ర ప్రజలపై ఉందన్నారు. మునుల గుట్టపై రామానుజ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చిన్న జీయార్ స్వామి కోరగా ముణుల గుట్టపై నిర్మాణం చేపట్టి సీతారామచంద్ర స్వామి కొండ నుంచి మునుల గుట్టను కలుపుతూ వేలాడే వంతెన నిర్మాణం చేపడతామని మంత్రి ఈ సందర్బంగా హామీ ఇచ్చారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఆధ్వర్యంలో పాలకుర్తి అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని
పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధిలో పట్టు వదలని విక్రమార్కుకుడిలా కృషి చేస్తున్నారని కొనియాడారు. దేశ స్థాయిలో అనేక అవార్డ్స్ తీసుకున్న ఘనత ఆయనకే దక్కుతుందని అత్యధిక అవార్డులు తెచ్చుకున్న మంత్రిత్వ శాఖ ఆయనదని పేర్కొన్నారు.