Helicopter service In Kedarnath: ఉత్తరాఖండ్‌లో రుతుపవనాల ప్రభావం తగ్గుముఖం పట్టడంతో.. చార్‌ధామ్ యాత్ర సన్నాహాలు మళ్లీ ఊపందుకున్నాయి. ఈ నెల 15 నుంచి చార్‌ధామ్ యాత్రికులకు హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు ఉత్తరాఖండ్ సివిల్ ఏవియేషన్ డెవలప్‌మెంట్ అథారిటీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
49 శాతం పెరిగిన ఛార్జీలు: కేదార్‌నాథ్ ధామ్‌కు వెళ్లాలనుకునే యాత్రికులు ఈ సేవలకు గతేడాది కంటే 49 శాతం అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) సూచనల మేరకు షటిల్ సర్వీసుల సంఖ్యను తగ్గించడంతో ఛార్జీల పెంపు అనివార్యమైందని డీజీసీఏ తెలిపారు. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైటు ‘హెలియాత్ర.ఐఆర్‌సీటీసీ.సీవో.ఇన్’ ద్వారా బుధవారం నుంచి బుకింగ్స్ ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.
ఎక్కడ నుండి ప్రారంభమవుతుంది: కేదార్‌నాథ్ యాత్ర కోసం హెలికాప్టర్ సేవలు.. ఫాటా, గుప్త్‌కాశీ, మరియు సిర్సి వంటి హెలిప్యాడ్‌ల నుంచి అందుబాటులో ఉన్నాయి. యాత్రికులు IRCTC HeliYatra వెబ్‌సైట్ ద్వారా హెలికాప్టర్ సేవలను అధికారికంగా బుక్ చేసుకోవచ్చు. ఇది మోసపూరిత వెబ్‌సైట్ల నుంచి రక్షించడానికి సురక్షితమైన మార్గమని యూసీఏడీఏ పేర్కొంది. ప్రయాణ ధరలు బయలుదేరే ప్రదేశం, సీటింగ్ వర్గం, మరియు డిమాండ్‌ను బట్టి మారుతుంటాయని వెల్లడించింది.


