Hindu Mythology: హిందూ పురాణాల ప్రకారం… బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులను త్రిమూర్తులుగా భావిస్తారు. బ్రహ్మను సృష్టికర్తగా, విష్ణువును సంరక్షకుడిగా, శివుడిని నాశనకర్తగా భావిస్తారు. అయితే ఈ ముగ్గురిలో విష్ణువు, శివుడు మాత్రమే నిత్యం పూజలు అందుకుంటూ ఉంటారు. అయితే త్రిమూర్తుల్లో ఒకడైనా బ్రహ్మకు మాత్రం పెద్దగా పూజలు జరిగినట్లు ఎక్కడా కనిపించదు.
ఈ అద్భుతమైన సృష్టి నిర్మాణం చేసింది బ్రహ్మదేవుడు. చదువుల తల్లి అయిన సరస్వతి దేవి బ్రహ్మ యెుక్క అర్ధాంగి. ఈయన నాలుగు తలలను కలిగి ఉంటారు. అందుకే బ్రహ్మను చతుర్ముఖుడు అని పిలుస్తారు. ఆయన నాలుగు తలలు నాలుగు వేదాలను సూచిస్తాయి. భక్తులు అరుదుగా సృష్టికర్తను పూజిస్తారు. ఈయనకు మన దేశంలో కూడా పెద్దగా ఆలయాలు లేవు. బ్రహ్మదేవుడిని పూజించక పోవడానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బ్రహ్మను పూజించక పోవడానికి శివుడే కారణమా..
బ్రహ్మను పూజించకపోవడానికి కారణం శివపురాణం ద్వారా తెలుస్తోంది. ఒకనొక సమయంలో బ్రహ్మ, విష్ణువు మధ్య తాను గొప్ప అంటే తాను గొప్ప అని వాదించుకున్నారు. ఈ వివాదం మహాదేవుడు వద్దకు వెళ్లింది. వెంటనే శివుడు ఒక అనంత స్తంభంలా మారిపోయాడు. దాని మెుదలు చివరను గుర్తించమని వారిద్దరికీ చెప్పాడు. ఎంత ప్రయత్నించినా ఆది అంతం కనిపెట్టలేకపోయారు బ్రహ్మ, విష్ణువులు. అయితే ఇరువురిలో బ్రహ్మ మాత్రం స్తంభం పైభాగాన్ని కనిపెట్టానని అబద్ధం చెప్పి శివుడి ఆగ్రహానికి గురయ్యాడు. కోపించిన శివుడు నువ్వు ఎవరి చేత పూజలు అందుకోవు అంటూ బ్రహ్మను శపించాడు. అప్పటి నుంచే బ్రహ్మ ఎవరి చేత పూజలు అందుకోని పరిస్థితికి వచ్చినట్లు పురాణ కథనం. భృగు మహర్షి, సరస్వతి దేవీల శాపాలు కూడా బ్రహ్మను పూజించకపోవడానికి మరో కారణం.
Also Read: Dasara – దసరా వేళ వీటిని దానం చేశారంటే..మీ కోరికలన్నీ నెరవేరుతాయి!
ఆ ఒక్క ఆలయమే..
మరొక కథనం ప్రకారం, మెుదట బ్రహ్మకు ఐదు తలలు ఉండేవట. బ్రహ్మ తానే సృష్టించిన శతరూప అనే అమ్మాయిపై మోహాన్ని పెంచుకున్నాడట. ఆమె ఎక్కడకు వెళ్లినా బ్రహ్మ కూడా తన వెనకాలే వెళ్లేవాడట. అతని పనులు చూసిన శివుడు కోపంతో సృష్టికర్త యెుక్క ఐదో తలను నరికేసాడట. దీంతో అప్పటి నుంచి బ్రహ్మను పూజించడం మానేశారని చెబుతారు. మిగతా దేవతతో పోలిస్తే బ్రహ్మకు పెద్దగా ఆలయాలు లేవనే చెప్పాలి. రాజస్థాన్ లోని పుష్కర్ లో మాత్రం బ్రహ్మదేవుడికి ఆలయం ఉంది. ఇక్కడ తప్ప ఎక్కడా కూడా చతుర్ముఖుడికి ఆలయాలు లేవు.


