శ్రీశైలం(Srisailam)లోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ఆలయంలో హుండీ లెక్కింపును సోమవారం నిర్వహించారు. మొత్తం 2 కోట్ల 18 లక్షల 94 వేల 668 రూపాయలు ఆదాయం లభించినట్లు తెలిపారు ఆలయాధికారులు. దేవస్థానానికి. గత 17 రోజులుగా (31.01.2025 నుండి 16.02.2025 వరకు) భక్తులు భక్తి శ్రద్ధలతో సమర్పించిన ఈ కానుకలను దేవస్థానం పలు అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు ఆలయ ఈవో తెలిపారు.
కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు:
హుండీ లెక్కింపు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య జరిగింది. సీసీ కెమెరాల నిఘాతో పాటు, దేవస్థానం ప్రత్యేక బృందాలు పర్యవేక్షణ చేపట్టాయి. లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు.
ఆదాయం వివరాలు
ఈ హుండీ లెక్కింపులో నగదుతో పాటు బంగారు, వెండీ, ఇతర దేశాల కరెన్సీలు కూడా ఉన్నాయి. ఇందులో 152 గ్రాముల 400 మిల్లీగ్రాముల బంగారం, 2 కేజీల 150 గ్రాముల వెండి ఉన్నాయన్నారు. వివిధ దేశాల నుంచి వచ్చిన భక్తులు సమర్పించిన యుఎస్ఏ డాలర్లు 423, మలేషియా రింగిట్స్ 108, యూకే పౌండ్స్ 20, సింగపూర్ డాలర్లు 10, జింబాబ్వే క్వచ్చాస్ 120, కెనడా డాలర్లు 50, సౌదీ అరేబియా రియాల్స్ 20, థాయిలాండ్ భట్స్ 20 వంటి విదేశీ కరెన్సీ కూడా కానుకల రూపంలో వచ్చినట్లు ఆలయా అధికారులు తెలిపారు.
ఆలయాభివృద్దికి
దేవస్థానం పాలక మండలి ఈ ఆదాయాన్ని ఆలయ అభివృద్ధికి వినియోగించనున్నారు. ఈ ఆదాయంతోనే భక్తుల సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించనున్నారు. భక్తులకు మరింత విశ్రాంతి, ఆధ్యాత్మిక అనుభూతిని అందించేందుకు ఆలయ ప్రాంగణంలో కొత్త వసతులు ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు.