శ్రీ బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అమ్మవారి కల్యాణోత్సవ వేడుకలలో భాగంగా మూడో రోజు నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిధిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి రథాన్ని లాగి రథోత్సవాన్ని ప్రారంభించారు. రథోత్సవానికి ముందు డప్పు చప్పుళ్ళు, వివిధ కళాకారుల వేషధారణలతో ఆకట్టుకున్నారు. రదోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సరళ, ఆలయ ఈఓ అన్నపూర్ణ, ఆలయ ఛైర్మెన్ సాయిబాబా గౌడ్, సూపరిండెంట్ రమేష్, అమీర్‌పేట డివిజన్ అధ్యక్షులు హన్మంతరావు, ఆలయ ధర్మకర్తలు తదితరులు పాల్గొన్నారు.
అభినందనలు తెలిపిన మంత్రి తలసాని
శ్రీ బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం, రదోత్సవాన్ని ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించడం పట్ల ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అభినందనలు తెలిపారు. భక్తులు ఎలాంటి అసౌకర్యానికి, ఇబ్బందులకు గురికాకుండా ఏర్పాట్లను చేసిన జిహెచ్ఎంసి, ఎలెక్ట్రికల్, దేవాదాయ శాఖ, పోలీస్, ట్రాఫిక్ పోలీస్,ఆర్ అండ్ బి, వాటర్ వర్క్స్, సమాచార శాఖ, అగ్నిమాపక శాఖ అధికారులు, భక్తులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన స్వచ్చంద సంస్థల నిర్వహకులు, భక్తులకు సేవలు అందించిన వాలంటీర్ లు, ఆలయ కమిటీ సభ్యులు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు మంత్రి ప్రత్యేక అభినందనలు తెలిపారు.