తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించేందుకు బిఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవాన్ని ఈ నెల 20 వ తేదీన అంగరంగ వైభవంగా నిర్వహించేలా భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం వద్ద ఈ నెల 20వ తేదీన జరిగే బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ముందుగా ఆలయం వద్ద నూతనంగా నిర్మించిన భక్తుల నూతన క్యూ లైన్ ను ప్రారంభించారు. అనంతరం ఆలయంలో రుద్రాక్ష మండపం నిర్మాణ పనులను ప్రారంభించారు. తదనంతరం అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సిఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం అమ్మవారి కళ్యాణానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తూ వస్తుందని వివరించారు.
వివిధ ప్రాంతాల నుండి వచ్చే లక్షలాది మంది భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా వివిధ శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గత సంవత్సరం అమ్మవారి కళ్యాణాన్ని 8 లక్షల మంది భక్తులు తిలకించారని, ఈ సంవత్సరం మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఎన్ని కోట్లు ఖర్చు అయినా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. 20 వ తేదీన జరిగే అమ్మవారి కళ్యాణానికి, 21 వ తేదీన నిర్వహించే రథోత్సవానికి వచ్చే లక్షలాది మంది భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పటిష్టమైన భారికేడ్ లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అమ్మవారి కళ్యాణాన్ని వివిధ ప్రాంతాలలోని భక్తులు కూడా వీక్షించే విధంగా ప్రత్యక్ష ప్రసారం కు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆలయ పరిసరాలలో అమ్మవారి కళ్యాణాన్ని వీక్షించే విధంగా 5 ఎల్ఇడి స్క్రీన్ లను ఏర్పాటు చేస్తామని అన్నారు. గతంలో అమ్మవారి కళ్యాణాన్ని ఆలయం లోపల నిర్వహించే వారని, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆలయం ముందు అతిపెద్ద రేకుల షెడ్డును నిర్మించి లక్షలాది మంది భక్తుల సమక్షంలో ఆరుబయట అమ్మవారి కళ్యాణాన్ని నిర్వహిస్తూ వస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పటికే ఆలయం వద్ద వివిధ అభివృద్ధి పనులు చేపట్టి ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దినట్లు వివరించారు.