మహాశివరాత్రి (Mahashivaratri) హిందువులు ఆచరించే ఒక ముఖ్యమైన పండగ. ఇది శివ, పార్వతుల వివాహం జరిగిన రోజు. ఈ రోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజు. హిందువుల క్యాలెండరులో ప్రతి నెలలో వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అంటారు. కానీ శీతాకాలం చివర్లో వేసవి కాలం ముందు వచ్చే మాఘ మాసంలో వచ్చే 13 లేదా 14 వ రోజుని మహాశివరాత్రి అంటారు. ఈ రోజున దేశవ్యాప్తంగా హిందువులంతా స్వామివారిని భక్తితో కొలుస్తారు. మహా శివరాత్రి పర్వదినాన ఆ స్వామి వారిని ఎలా పూజించాలో పురోహితులు చెబుతుంటారు.
ఆలయాలకు వెళ్లలేని వారు ఇలా చేయండి
పండగ రోజు ప్రముఖ దేవాలయాలకు వెళ్లి స్వామివారిని దర్శించుకోవాలని ఉంటుంది. ఆలయానికి వెళ్లలేని వారు ఇంట్లో కూడా స్వామివారిని ఆరాధించవచ్చు.ఆలయానికి వెళ్లలేని వారు శివలింగాన్ని తెచ్చుకొని ఇంట్లోనే పూజించాలి.
ఇంట్లోనే శివలింగానికి పూజలు
ఓం నమః శివాయ అనే శివపంచాక్షరి జపం చేత స్వామి వారిని పూజించవచ్చు. పుట్ట మట్టితో కూడా లింగాన్ని తయారు చేసుకోవచ్చు. ఆ శివరాత్రి రోజున ఇంట్లో లింగాన్ని ఏర్పాటు చేసుకొని పూజిస్తూ అభిషేకం చేయాలి. మరుసటి రోజు ఆ లింగాన్ని తులసి కోటకు తీసుకెళ్లి కరిగించాల్సి ఉంటుందని పురోహితులు తెలుపుతుంటారు.
ఉదయాన్నే తలంటూ స్నానం
మహా శివరాత్రి రోజున భక్తులు ఉదయాన్నే నిద్రలేవాలి. ఉదయం నిద్ర లేచి తల స్నానం చేయాలి. తలకి స్నానమాచరించి స్వామి శివనామం జపించాలి. కొత్త దుస్తులు ధరించాలి. ఇంట్లో దీపారాధన చేసుకోవాలి.
శివునికి పాలాభిషేకం
శివునికి వీలైతే ఇంట్లోనే ఆవు పాలతో అభిషేకం చేసుకోవాలి. స్వామివారికి మారేడు దళాలు నీటితో అభిషేకం చేయాలి. స్వామివారికి కొబ్బరికాయ కొట్టి ఇంట్లోవారికి తీర్థంగా ఇవ్వాలి. వారికి నైవేద్యంగా అరటిపండు మరియు పాయసం ఏదైనా సమర్పించవచ్చు. ఆ స్వామివారికి సమర్పించిన ప్రసాదాన్ని ఇంట్లో వారంతా స్వీకరించాలి.
ఓం నమః శివాయ మంత్రాన్ని జపిస్తూ జాగరణ
జాగరణ చేసే భక్తులు ఆ రోజంతా ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. ఇలా మహా శివరాత్రి రోజు స్వామివారిని ఆరాధించడం ద్వారా ఆయురారోగ్యాలతో పాటు ఆ స్వామివారి అనుగ్రహం కలుగుతుంది.