అపర భద్రాద్రిగా పేరొందిన ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శనివారం రాత్రి శ్రీ సీతారాములకు పుష్పయాగం వేడుకను అర్చకులు కనుల పండుగగా జరిపించారు. శ్రీ సీతారాములకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ ఆవరణలో అందంగా అలంకరించిన వేదికపై సుగంధ పరిమళ పుష్పాలంకృతులైన శ్రీ సీతారాముల ఉత్సవమూర్తులను కొలువు తీర్చగా మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్ఛరణల నడుమ ఆలయ ప్రధాన అర్చకులు శేషం రామాచార్యులు, శేషం వంశీధరాచార్యుల ఆధ్వర్యంలో వేద పండితులు శ్రీ సీతారాములకు శ్రీ పుష్పయాగం (నాఖబలి) వేడుకను వైభవోపేతంగా జరిపించారు.
పుష్పయాగం వేడుకకు హాజరైన భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో కే సుధాకర్ ఆధ్వర్యంలో తగు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఇల్లందకుంట సర్పంచ్ కంకణాల శ్రీలత సురేందర్ రెడ్డి, ఆలయ ఉద్యోగులు మోహన్, రవి, రాజయ్య, ప్రవీణ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.