అపర భద్రాద్రిగా పేరొందిన ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి గ్రామాలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను వేద పండితులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీ సీతారామచంద్రస్వామి ఉత్సవమూర్తులను పల్లకిలో అధిరోహించగా వేద పండితులు శేషం వంశీధరాచార్యుల వేదమంత్రోత్సరాల నడుమ శ్రీ స్వామి వారు ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని కనుల పండుగ జరిపించారు. అనంతరం స్వామివారి ఉత్సవమూర్తులను పల్లకిలో అధిరోహింపజేసి భక్తుల శ్రీరామ నామ స్మరణలతో మాడ వీధులలో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కార్యనిర్వహణాధికారి కందుల సుధాకర్, ఆలయ ఉద్యోగులు మోహన్, రాజయ్య, ప్రవీణ్, రమేష్, మాజీ ఎంపీటీసీ సభ్యుడు కటంగూరి రాంస్వరన్ రెడ్డి, భక్తులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.