Monday, March 3, 2025
HomeదైవంRudraksha: ఏ రుద్రాక్ష ఎలాంటి ప్రయోజనం కలిగిస్తుంది.. అత్యంత శక్తివంతమైన రుద్రాక్ష ఏదంటే..?

Rudraksha: ఏ రుద్రాక్ష ఎలాంటి ప్రయోజనం కలిగిస్తుంది.. అత్యంత శక్తివంతమైన రుద్రాక్ష ఏదంటే..?

రుద్రాక్ష అనేది రుద్రుడు (శివుడు).. అక్ష అంటే కంటి నుంచి పడిన నీటితో ఉద్భవించినవని పండితులు చెబుతుంటారు. ప్రధానంగా రుద్రాక్షలు హిమాలయాలు, నేపాల్, ఇండోనేషియా మరియు థాయ్‌లాండ్ ప్రాంతాల్లో ఇవి విరివిగా దొరుకుతాయి. ఇక ఇవి ముఖాలు (ముఖి) ఆధారంగా వర్గీకరించబడతాయి. ఒక్క ముఖి నుండి 21 ముఖుల వరకు రుద్రాక్షలు లభిస్తాయి. ప్రతీ ముఖి రుద్రాక్షకు ప్రత్యేక శక్తి, ప్రయోజనం ఉంటుందని చెబుతుంటారు. ఎవరికి ఏ రుద్రాక్ష సరిపోతుందో, వారి జాతక చక్రం, గ్రహ స్థితి, ఆరోగ్య పరిస్థితులు, జీవిత లక్ష్యాలు వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. ప్రతి రుద్రాక్షకు ప్రత్యేక శక్తి, ప్రయోజనం ఉంటుందని పండితులు అంటుంటారు.

- Advertisement -

రుద్రాక్షలు పవిత్రమైనవని మన పురాణాలు చెబుతున్నాయి. దీన్ని సరిగ్గా ధరిస్తే, జీవితంలో సానుకూల మార్పులు వస్తాయని నమ్ముతారు. శివుడికి ప్రియమైన ఈ రుద్రాక్షను ధరించడం ద్వారా ఆ వ్యక్తికి దేవుని అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. ఈ కథనంలో రుద్రాక్షల రకాలు, దాని ప్రయోజనాలు అలాగే అది ధరించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ కథనంలో 6 రకాల రుద్రాక్షలు.. వాటి ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. ఏకముఖి రుద్రాక్ష చాలా అరుదుగా లభిస్తుంది. దీనిని శివుని రూపంగా భావిస్తారు. ఏకముఖ రుద్రాక్ష మనస్సు, ఆత్మ, శరీరానికి శాంతిని అందిస్తుంది. అలాగే ఇది మానసిక స్థిరత్వాన్ని ఇస్తుంది. జీవితంలో ఆనందం, శ్రేయస్సును పెంచుతుంది. ద్విముఖి రుద్రాక్షను అర్ధనారీశ్వరులకు ప్రతీకగా భావిస్తారు. ఇది కుటుంబ సౌఖ్యం, దాంపత్య జీవితం, సంబంధాల్లో శాంతిని కలిగిస్తుందంట. ఇక దాంపత్య జీవితంలో సమస్యలు ఉన్నవారు, ప్రేమలో విఫలమైనవారు దీనిని ధరించాలని చెబుతుంటారు.

ఐదు ముఖాలు ఉన్న రుద్రాక్షను పంచ ముఖి రుద్రాక్ష అంటారు. దీనిని రుద్రుడికి ప్రతీకగా భావిస్తారు. ఐదు ముఖాల రుద్రాక్ష ధరించడం వలన ఆరోగ్యం, మనశ్శాంతి, నిద్ర సమస్యలు తొలగిపోతాయని చెబుతుంటారు. ఇది ప్రతి ఒక్కరూ ధరించవచ్చని ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ధరించాలని పండితులు అంటుంటారు. ఏడు ముఖాలు ఉన్న రుద్రాక్షను సప్తముఖి రుద్రాక్ష అంటారు. ఈ రుద్రాక్షకి మహాలక్ష్మి దేవి ప్రతినిధి అంటుంటారు. ఇది ధరించడం వలన ధన, సంపద, వ్యాపార విజయాలు కలుగుతాయని పండితులు చెబుతుంటారు. వ్యాపారులు, ఆర్థిక ఇబ్బందులు పడుతున్నవారు ఈ రుద్రాక్ష ధరించాలని చెబుతుంటారు.

నవ ముఖి రుద్రాక్షకు తొమ్మిది ముఖాలు ఉంటాయి. ఈ రుద్రాక్ష దుర్గా దేవిని సూచిస్తుందంట. దుర్గామాత శక్తి, ధైర్యం, నెగటివ్ ఎనర్జీని తొలగిస్తారని భక్తుల నమ్మకం. మహిళలు, శత్రు భయం ఉన్నవారు ఈ రుద్రాక్షను ధరించాలని పండితులు చెబుతుంటారు. ఇక గర్వ ముఖి, గణపతి రుద్రాక్షలు ఎంతో ప్రత్యేకమైనవి. ఇవి అన్ని రకాల విజయాలు, అవరోధాలు తొలగడానికి ఉపయోగ పడతాయని పండితులు చెబుతున్నారు. వీటిని ధరించడం వల్ల ఆరోగ్యం, బలం, ధైర్యం సిద్ధిస్తుందని చెబుతుంటారు. విద్యార్థులు, ఉద్యోగులు, ప్రతి కార్యక్రమంలో విజయం సాధించాలనుకునేవారు వీటిని ధరించాలని సూచిస్తున్నారు పండితులు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు: రుద్రాక్ష ధరించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అతిపెద్ద ప్రయోజనం మనశ్శాంతి. ఇది ఒత్తిడిని తగ్గించి జీవితాన్ని సమతుల్యంగా ఉంచుతుంది. అలాగే ఇది ప్రతికూల శక్తి నుండి రక్షించి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. రుద్రాక్ష చాలా ఉపయోగకరంగా పరిగణించబడుతుంది, ముఖ్యంగా ఆధ్యాత్మిక పురోగతి వైపు పయనించే వారికి. ఇక వీటిని ధరించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయానికి వస్తే.. రుద్రాక్ష ధరించే ముందు, మంచి జ్యోతిష్కుడిని సంప్రదించాలి. దానిని శుభ్రంగా, చక్కగా ఉంచుకోవాలి. కొందరు పండితుల అభిప్రాయం ప్రకారం రుద్రాక్షను నిద్రపోయేటప్పుడు లేదా అంత్యక్రియలకు వెళ్ళేటప్పుడు ధరించకూడదు.

రుద్రాక్ష ధరించిన వ్యక్తి మాంసాహారం, మత్తు పదార్థాల వినియోగానికి దూరంగా ఉండాలి. తద్వారా వారు దాని పూర్తి ప్రయోజనాలను పొందుతారని చెబుతున్నారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు రుద్రాక్షను ధరించకూడదని పండితులు అంటుంటారు. ఎందుకంటే ఇది అధిక శక్తిని ఉత్పత్తి చేస్తుంది, ఇది పుట్టబోయే బిడ్డకు హాని కలిగిస్తుందంట. మాంసాహారం తినేవారు లేదా మాదకద్రవ్యాలకు బానిసలైనవారు రుద్రాక్ష ధరించక పోవడం మంచిది. అనర్నిటికన్నా ముఖ్యంగా శివునిపై విశ్వాసం లేకుండా.. ఫ్యాషన్ కోసం రుద్రాక్షను ధరించే వారికి దీనికి ఎటువంటి ప్రాముఖ్యత లేదు, కాబట్టి వారు దానిని ధరించకూడదు. (గమనిక: ఈ కథనం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా రాసినది.. దీనిని తెలుగు ప్రభ ధృవీకరించడం లేదు.)

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News