Karthika Masam-Karthika Somavaram Puja:హిందూ సనాతన సంప్రదాయంలో కార్తీక మాసానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ నెలను దేవతల మాసంగా కూడా పండితులు , పురాణాలు చెబుతున్నాయి. పురాణాల ప్రకారం కార్తీక మాసంలో జరిపే వ్రతాలు, పూజలు, స్నానాలు మనిషికి పాప విమోచనాన్ని, మోక్షప్రాప్తిని కలిగిస్తాయని చెబుతారు. ఈ మాసం శరదృతువులో వస్తుంది. ప్రతి రోజు పవిత్రమైనదే కాబట్టి దీన్ని పుణ్య మాసం అని కూడా పిలుస్తారు.
నది స్నానం….
కార్తీక పురాణం ప్రకారం ఈ నెలలో నది స్నానం చేయడం, దీపం వెలిగించడం, పూజలు చేయడం అత్యంత శుభంగా అందరు పరిగణిస్తారు. సాయంత్రం వేళ ఆలయాల్లో దీపారాధన చేస్తే పాపాలు తొలగి, మంచి ఫలితాలు లభిస్తాయని విశ్వాసం ఉంది. పురాణాల్లో చెప్పిన్నట్లుగా శ్రీ మహావిష్ణువు ఆషాఢ శుక్ల దశమి నాడు యోగ నిద్రలోకి వెళ్లి, కార్తీక శుక్ల ద్వాదశి నాడు నిద్రలేస్తాడు. ఈ కారణంగా భక్తులు ఈ మాసాన్ని ప్రత్యేక భక్తి భావంతో జరుపుకుంటారు. ఆయన నిద్రలేచే ఈ సమయం దేవతలకు కూడా శుభ సమయంగా పండితులు వివరిస్తారు.
కార్తీక మాసంలో చేసే పూజలు, దీపదానం, వన సమారాధన, పురాణ పఠనం వంటి ఆచారాలు పుణ్య ఫలితాలను ఇస్తాయి. అలాగే ఈ నెలలో ప్రతి సోమవారం రోజుకి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. కార్తీక సోమవారాల్లో చేసే వ్రతాలు అత్యంత శ్రేష్ఠమైనవిగా అందరూ నమ్ముతారు. ఈ రోజున ఉపవాసం, స్నానం, దానం, జపం, దీపారాధన వంటివి చేస్తే ఆచారకర్తకు పాప నాశనం కలుగుతుందని పురాణాలు చెబుతాయి.
దీపం వెలిగించి నైవేద్యం..
కార్తీక మాసంలో ఉపవాసానికి కూడా విశిష్టత ఉంది. భక్తులు ఈ నెలలో ప్రతిరోజూ ఉదయం స్నానం చేసి దేవాలయంలో పూజలు చేయడం, సాయంత్రం దీపం వెలిగించి నైవేద్యం సమర్పించడం చేస్తారు. కార్తీక మాసం ప్రారంభం నుండి చివరి రోజు వరకు ఈ విధంగా పూజలు చేయడం సర్వ శుభదాయకం అని విశ్వాసం ఉంది.
వశిష్ట మహర్షి వివరించిన ప్రకారం కార్తీక సోమవారం వ్రతానికి ఆరు విధానాలు ఉన్నాయి. ఉపవాసం, ఏకభుక్తం, నక్తం, అయాచితం, స్నానం, తిలాదానం. వీటిలో ఒక్కటి ఆచరించినా శుభ ఫలితాలు లభిస్తాయని శివపురాణం వివరిస్తుంది.
ఉపవాసం అంటే…
ఉపవాసం అంటే పగలంతా ఆహారం తీసుకోకుండా ఉండి సాయంత్రం శివాభిషేకం చేసి తులసి తీర్థం సేవించడం. ఏకభుక్తం అంటే మధ్యాహ్నం భోజనం చేయడం, రాత్రికి శివ తీర్థం లేదా తులసి తీర్థం మాత్రమే స్వీకరించడం. నక్తం అంటే రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేయడం. అయాచితం అంటే ఎవరైనా పిలిచి భోజనం పెట్టినపుడు మాత్రమే తినడం. తిలాదానం అంటే నువ్వులు దానం చేయడం. వీటిలో ఏదైనా పాటించడం ఆధ్యాత్మిక శాంతిని, పుణ్యాన్ని ఇస్తుందని విశ్వాసం ఉంది.
కార్తీక సోమవారం వ్రతం…
కార్తీక సోమవారం వ్రతం వెనుక ఒక పౌరాణిక కథ కూడా ఉంది. వశిష్ట మహర్షి జనక మహారాజుకి ఈ కథను వివరించాడు. నిష్టురి అనే ఒక స్త్రీ తన జీవితంలో ఎన్నో తప్పులు చేసింది. వివాహం అనంతరం కూడా భర్తను మోసగించి పాపాలు చేసింది. ఆ కారణంగా మరణానంతరం ఆమె ఒక కుక్కగా జన్మించింది. ఆ తరువాత ఒక వేద పండితుడు కార్తీక మాసంలో తన ఇంటి ముందు ఉంచిన బలి అన్నాన్ని ఆ కుక్క తింటుంది. అదే సమయంలో ఆమెకు పూర్వజన్మ స్మృతి వస్తుంది.
పాపాల నుంచి విముక్తి…
ఆమె పాపాల నుంచి విముక్తి పొందడానికి ఆ వేదపండితుడిని ప్రార్థిస్తుంది. అతను తన దివ్యదృష్టితో ఆ కుక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలుసుకుంటాడు. కార్తీక సోమవారం వ్రతం ద్వారా తాను ఆచరించిన పుణ్యఫలంలో ఒక భాగాన్ని ఆ కుక్కకు సమర్పిస్తాడు. వెంటనే ఆ కుక్క దేహం విడిచి ఒక దివ్య స్త్రీ రూపంలో కైలాసానికి చేరుతుంది. ఈ కథ ద్వారా వశిష్టుడు ఈ వ్రతం యొక్క మహాత్మ్యాన్ని వివరించాడు.
Also Read: https://teluguprabha.net/devotional-news/vastu-secrets-to-increase-money-flow-at-home/
ఇలా కార్తీక సోమవారం వ్రతం ఆచరిస్తే పాపాలు తొలగి మోక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. నమక చమక సహితంగా శివాభిషేకం చేస్తే శ్రేయస్సు మరింత పెరుగుతుందని భావిస్తారు. ఈ నెలలో ప్రతి రోజూ దీపం వెలిగించి దేవాలయంలో పూజలు చేయడం, తులసి దళం సమర్పించడం అత్యంత పుణ్యదాయకం.
దీపదానం…
కార్తీక మాసంలో భక్తులు సాయంత్రం వేళ దీపాలంకరణ చేస్తారు. ఇళ్ల ముందు, దేవాలయాల్లో దీపమాలిక వెలిగిస్తారు. దీన్ని ‘దీపదానం’ అని అంటారు. దీని వల్ల ఇంటి ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని, కుటుంబంలో శాంతి నెలకొంటుందని నమ్మకం ఉంది.
ఈ మాసంలో నదీస్నానం కూడా చాలా ముఖ్యమైంది. పవిత్ర నదులలో స్నానం చేసి జపాలు చేయడం, భక్తితో పూజలు చేయడం ఆధ్యాత్మికంగా ఎదగడానికి దోహదం చేస్తాయి. వన సమారాధన, సాలగ్రామ పూజ, దైవారాధన వంటి ఆచారాలు ఈ మాసంలో అత్యంత పుణ్యదాయకమైనవి.


