Jwala Thoranam Karthika Pournami : కార్తిక మాసం పవిత్రతకు పేరుగాంచినది.కార్తిక పౌర్ణమి (నవంబర్ 5, 2025, బుధవారం) శ్రీ మహా విష్ణుమూర్తి యోగ నిద్ర నుంచి మేల్కొనే రోజు. శివకేశవులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో పూర్ణిమ తిథి కృత్తికా నక్షత్రంతో కలిసి మహిమ పెరుగుతుంది. చంద్రుడు భూమికి దగ్గరగా ఉండి మనసును ప్రశాంతం చేస్తాడని విశ్వాసం. ఈ రోజు స్నానం, దానం, దీపం చేస్తే సప్తజన్మల పుణ్యం కలుగుతుందని విశ్వాసం. గంగా, గోదావరి, కృష్ణా, తుంగభద్ర వంటి నదుల్లో స్నానం మహాపుణ్యం. సాధ్యం కాని వారు గంగాజలం కలిపిన నీటితో స్నానం చేయవచ్చు.
ALSO READ: Train Accident: గూడ్స్ రైలును ఢీకొన్న ప్యాసింజర్.. ఆరుగురు మృతి
కార్తిక పౌర్ణమి రోజు దైవదర్శనం, దీపదానం, జపం చేస్తే మహత్తర పుణ్యాలు పొందుతామని శాస్త్రాలు చెబుతుంది. ‘కార్తికేతు కృతా దీక్షా నృణాం జన్మవిమోచనీ’ అని పురాణం చెప్తుంది. దీపారాధన చేస్తే కీటకాలు, పక్షులు, దోమలు, చెట్లు, జలచరాలు మోక్షం పొందుతాయని విశ్వాసం. కార్తిక పౌర్ణమి రాత్రి వెన్నెల కాంతిలో పరమాన్నం వండి భోజించడం, తులసి కోట వద్ద 365 వత్తుల దీపం వెలిగించడం శ్రేష్టమని పురాణాలు తెలుపుతున్నాయి. కార్తికేయుడిని స్మరించి, శత్రువులపై విజయం కోరుకోవాలని, కృత్తికలను అగ్నిరూపంలో ఆరాధించాలని వివరిస్తున్నాయి.
జ్వాలాతోరణం వెనుక పురాణ గాథ
కార్తిక పౌర్ణమి సాయంత్రం శివాలయాల్లో ‘జ్వాలాతోరణం’ ఉత్సవం జరుగుతుంది. రెండు కర్రల మధ్య అడ్డుగా గడ్డి చుట్టి నిప్పుతో వెలిగిస్తారు. ఇది జ్వాలలతో మండుతున్న తోరణ శివలింగంగా కనిపిస్తుంది. శివపార్వతుల భక్తులు దీని కింద దాటుతూ పాపాలు తొలగించుకుంటారు. ఈ ఉత్సవం వెనుక 3 పురాణ కథలు ఉన్నాయి.
1. త్రిపుర పౌర్ణమి: త్రిపురాసురులను శివుడు సంహరించిన రోజు ఇదే. దీనికి ‘త్రిపుర పౌర్ణమి’ అని పేరు. దృష్టి దోషం నివారణకు పార్వతి ఈ తోరణం ఏర్పాటు చేసిందని పురాణం చెప్తుంది. తులసి చెట్టు వద్ద 365 వత్తుల దీపం వెలిగించడం విజయ చిహ్నానికి గుర్తుగా వర్ణిస్తుంది.
2. హాలాహల విషం: క్షీరసముద్ర మథనంలో హాలాహల విషం ఉద్భవించింది. లోక కల్యాణం కోసం శివుడు విషాన్ని కంఠంలో ఉంచుకున్నాడు. ఈ మహత్కార్యం తర్వాత పార్వతి పరమేశ్వరులు సైతం జ్వాలా తోరణాన్ని మూడు సార్లు దాటారని పురాణాలు చెబుతున్నాయి.
3. నరక ద్వార విముక్తి: జ్వాలాతోరణం కింద దాటడం వల్ల సర్వపాపాలు హరించి, అపమృత్యువు నివారింపబడుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. నరక ద్వారం నుంచి విముక్తి కలుగుతుంది అని నమ్మకం.
కార్తిక పౌర్ణమి ‘ప్రకాశమే జీవితం, అజ్ఞానమే చీకటి’ అనే సందేశం ఇస్తుంది. దీపారాధన చేస్తూ అంధకారాన్ని తొలగించి, ప్రేమ, జ్ఞానం వ్యాప్తి చేయాలని తెలుపుతుంది.


