Karwa Chauth Fasting Rules:ఉత్తర భారతదేశంలో జరుపుకునే కర్వా చౌత్ పండుగకు ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది. ఈ రోజు వివాహిత స్త్రీలు తమ భర్తల దీర్ఘాయుష్షు కోసం ఉపవాసం చేస్తారు. ఉదయం నుండి చంద్రుడు దర్శనమిచ్చే వరకు ఆహారం, నీరు ముట్టుకోకుండా వ్రతాన్ని పాటిస్తారు. చంద్రుడు కనిపించిన తర్వాత జల్లెడ లో నుంచి చంద్రుడిని, ఆ తరువాత భర్త ముఖాన్ని చూసి , భర్త చేతితో నీరు తాగించుకుని ఉపవాసం ముగిస్తారు. ఈ పద్ధతి వారి భర్త ఆరోగ్యంగా, దీర్ఘాయుష్షుతో ఉండాలనే ఆకాంక్షతో పాటిస్తారు.
పెళ్లి కాని అమ్మాయిలు కూడా..
అయితే ఒక ప్రశ్న చాలామందిలో ఉంది. అది ఏంటంటే..ఈ ఆచారం కేవలం పెళ్లయిన వారికేనా? లేక పెళ్లి కాని అమ్మాయిలు కూడా ఈ వ్రతాన్ని పాటించవచ్చా? నేటి కాలంలో చాలా యువతులు తమ భవిష్యత్తు జీవిత భాగస్వామి కోసం లేదా తమ మనసులోని కోరికలు నెరవేరాలని కోరుతూ కర్వా చౌత్ ఉపవాసాన్ని చేస్తారు. అయితే వివాహిత మహిళలతో పోలిస్తే, పెళ్లికాని అమ్మాయిలు పాటించే పద్ధతులు కొంచెం వేరు గా ఉంటాయి.
నిర్జల ఉపవాసం..
పెళ్లికాని అమ్మాయిలకు నిర్జల ఉపవాసం తప్పనిసరి కాదు. వారు పండ్లు లేదా తేలికపాటి ఆహారం తీసుకుంటూ వ్రతాన్ని కొనసాగించవచ్చు. ఉదయాన్నే సూర్యోదయానికి ముందే తినేయోచ్చు అనే రూల్ అయితే వీరికి ఉంది. ఇది రోజంతా శక్తిని ఇస్తుంది. కొంతమంది ఫలహారం మాత్రమే తీసుకుంటారు, మరికొందరు పాలు లేదా జ్యూస్ వంటి పదార్థాలను తాగి ఉపవాసం కొనసాగిస్తారు.
శివుడు, పార్వతి, గణేశుడు, కార్తికేయుడు, చంద్రుడిని ..
కర్వా చౌత్ సందర్భంగా శివుడు, పార్వతి, గణేశుడు, కార్తికేయుడు, చంద్రుడిని పూజించే ఆచారం ఉంది. అయితే పెళ్లికాని అమ్మాయిలు కేవలం కర్వా మాత కథ వినడం, శివుడు, పార్వతీ దేవిని పూజించడం మాత్రమే చేయాలి. ఇది వారి జీవితంలో శుభకార్యాలకు దారితీస్తుందని విశ్వసిస్తారు.
చంద్రుడికి అర్ఘ్యం సమర్పించి..
వివాహిత స్త్రీలు చంద్రుడికి అర్ఘ్యం సమర్పించి ఉపవాసం విరమిస్తారు. కానీ పెళ్లి కాని అమ్మాయిలకు ఈ నియమం వర్తించదు. వారు చుక్కలను చూసిన తరువాత అర్ఘ్యం సమర్పించడం ద్వారా ఉపవాసం ముగించవచ్చు. కొంతమంది ఉత్తర నక్షత్రం లేదా ధ్రువ నక్షత్రం ముందు ప్రార్థన చేసి వ్రతం ముగిస్తారు. చంద్రుడి కోసం ఎక్కువ సేపు వేచి ఉండడం అవసరం లేదు, నక్షత్రాలను చూసి ఉపవాసాన్ని ముగించడం సాంప్రదాయకంగా అనుసరించవచ్చు.
మంచి జీవిత భాగస్వామి…
పెళ్లికాని అమ్మాయిలు జల్లెడ (స్ట్రైనర్) ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఇది ప్రధానంగా వివాహిత మహిళల ఆచారంలో మాత్రమే ఉంటుంది. వారు చుక్కలను చూసి, నీరు తాగి ఉపవాసం విరమించవచ్చు. దీని ద్వారా వారి కోరికలు నెరవేరతాయని, భవిష్యత్తులో మంచి జీవిత భాగస్వామి లభిస్తారని నమ్మకం ఉంది.
ఆత్మనిగ్రహం, భక్తి, ప్రేమ…
కర్వా చౌత్ రోజు ఆచరించే ఈ ఉపవాసం కేవలం ధార్మిక విధానమే కాకుండా, ఆత్మనిగ్రహం, భక్తి, ప్రేమకు చిహ్నంగా భావిస్తారు. పెళ్లికాని అమ్మాయిలు ఈ పండుగలో పాల్గొనడం ద్వారా కుటుంబ సంతోషం, మనశ్శాంతి, భవిష్యత్తు అన్ని బాగుంటాయని పండితులు వివరిస్తున్నారు.
Also Read: https://teluguprabha.net/devotional-news/atla-taddi-festival-story-and-pooja-process-explained/
ఉపవాసం సమయంలో పూజా సమయానికి శుభ్రమైన వస్త్రాలు ధరించడం, ఎరుపు లేదా పసుపు రంగు చీరలు కట్టుకోవడం శుభంగా చెబుతారు. పూజ సమయంలో దీపం వెలిగించి కర్వా మాత కథను వినడం సంప్రదాయం. ఇంట్లో పెద్దవారి ఆశీర్వాదం తీసుకోవడం కూడా ముఖ్యమైన భాగం.
ఇంతేకాకుండా, ఈ రోజు స్త్రీలు తమ మనసులోని శ్రద్ధతో వ్రతాన్ని పూర్తిచేస్తారు. కర్వా చౌత్ పండుగ స్త్రీల ప్రేమ, ఆప్యాయత, నమ్మకానికి ప్రతీకగా నిలుస్తుంది.
వివాహిత స్త్రీలు భర్త చేత నీరు తాగి ఉపవాసం విరమిస్తారు. కానీ పెళ్లికాని అమ్మాయిలు తమ పూజ అనంతరం చుక్కలను చూసి నీరు తాగడం ద్వారా వ్రతం పూర్తిచేయవచ్చు. ఇది వారికి శుభఫలితాలను ఇస్తుందని పెద్దలు చెబుతారు.


