కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయాన్ని ఆగమశాస్త్ర పద్ధతులను అనుసరించి అభివృద్ధి చేయాలని, భక్తుల సౌకర్యార్థం పునర్నిర్మాణాలను చేపట్టాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. భారతదేశంలోనే గొప్పదైన ఆంజనేయ స్వామి దేవాలయం ఎక్కడున్నదంటే కొండగట్టు అంజన్న ఆలయం పేరు వినపడేలా అత్యంత గొప్పగా, అన్ని హంగులతో, సకల సౌకర్యాలతో తీర్చిదిద్దాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈమేరకు ఆయన అధికారులు, అర్చకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కొండగట్టు అంజన్న స్థల పురాణం గురించి సీఎం కేసీఆరే స్వయంగా అధికారులకు వివరించారు. వైష్ణవ సాంప్రదాయాన్ని అనసరించి ఆలయ పునర్నిర్మాణానికి, అభివృద్ధిని చేపట్టనున్నట్లు సీఎం స్పష్టం చేశారు. నిధులకు ఎలాంటి కొరత లేదనీ, 1000 కోట్ల రూపాయలైన కేటాయించేందుకు సిద్ధమని కేసీఆర్ తెలిపారు. హనుమాన్ జయంతికి సగం భారతదేశం కొండగట్టు అంజన్న వైపు మరలేలా నిర్మాణం ఉండాలన్నారు. ఆలయ నిర్మాణం పూర్తి కావడానికి కనీసం మూడు సంవత్సరాల కాలం పడుతుందనీ, అప్పటిదాకా ఆగమశాస్త్ర నియమాలను అనుసరించి బాలాలయాన్ని నిర్మించాలని అధికారులను ఆదేశించారు. రెండు గంటలకు పైగా సుదీర్ఘంగా సాగిన సమావేశంలో ఆలయ పున్నర్మిర్మాణం, అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు సంబంధించి చర్యలు చేపట్టాల్సిందిగా అన్ని విభాగాల అధికారులకు సీఎం ఆదేశాలు ఇచ్చారు.