Kedarnath Temple: దేవభూమి ఉత్తరాఖండ్‌లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీ కేదార్‌నాథ్ ధామం తలుపులు బుధవారం ఉదయం వేద మంత్రోచ్ఛారణల నడుమ భక్తుల దర్శనార్థం తెరుచుకున్నాయి. ఆలయ ద్వారాలు తెరుచుకున్న సమయంలో వేలాది మంది భక్తులు చేసిన ‘హరహర మహాదేవ్’ నినాదంతో హిమాలయ పర్వత శ్రేణులు మార్మోగిపోయాయి. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ భక్తులకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యేక సందేశాన్ని విడుదల చేశారు.
భక్తులకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు: కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకోవడంపై ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేశారు. చార్‌ధామ్ యాత్ర కేవలం పర్యటన మాత్రమే కాదని.. అది భారతీయ విశ్వాసానికి, ఐక్యతకు నిలువెత్తు నిదర్శనమని పేర్కొన్నారు. ఈ యాత్ర ద్వారా దేశంలోని సనాతన సంస్కృతిని ప్రతి ఒక్కరూ దర్శించుకునే గొప్ప అవకాశం లభిస్తుందని కొనియాడారు. ఈ ఏడాది యాత్రకు వస్తున్న భక్తులందరిపై శివుని కృపాకటాక్షాలు ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
పూల వనంగా కేదార్‌నాథ్: సుదీర్ఘ విరామం తర్వాత ఆలయం తెరుచుకోవడంతో కేదార్‌నాథ్ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఆలయాన్ని రంగురంగుల పూలతో అత్యంత సుందరంగా ముస్తాబు చేశారు. భారీగా తరలివస్తున్న భక్తుల దృష్ట్యా దేవస్థానం బోర్డు సమన్వయంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. చార్‌ధామ్ యాత్ర ప్రారంభం కావడంతో దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.


