కొండపాక మండల కేంద్రానికి అతి సమీపంలో 100 ఎకరాల విస్తీర్ణంలో వెలసిన ఆనంద నిలయం ప్రాంతంలో అష్టాదశ శక్తిపీఠ సహిత ఉమా రామలింగేశ్వర స్వామి దేవాలయ ప్రతిష్ట పత్రికను రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రమణాచారి ఆవిష్కరించారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచంలోనే అష్టాదశ శక్తి పీఠాలు ఒకే ప్రదేశంలో ఇంతవరకు ఎక్కడ కూడా ప్రతిష్ట జరగలేదు బహుశా ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి అష్టాదశ శక్తిపీఠముగా పేరొందుతుందన్నారు. ఈనెల 25, 26,27, విగ్రహాల ప్రతిష్ట పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని, సిద్దిపేట జిల్లాకే ఇది తలమానికంగా నిలుస్తుందని, ఈ ప్రాంత ప్రజలు ఎంతో పుణ్యం చేసుకుంటే కలిగే దర్శనిక ప్రదేశం అవుతుందని ఆయన వివరించారు.
ఈ మహోత్సవ కార్యక్రమానికి శ్రీ పుష్పగిరి పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ అభినవొద్దండ విద్యా శంకర భారతి మహాస్వామి, శ్రీ గురు మదనానంద సరస్వతి పీఠాధిశ్వరులు శ్రీ శ్రీ మాధవానంద సరస్వతీ స్వామి ఆధ్వర్యంలో ఈ విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ మహోన్నతమైన కార్యక్రమానికి గట్టు రామరాజేశం జ్ఞాపకార్థం వారి తనయులు గట్టు రవీందర్ కుటుంబం ఒక కోటి 50 లక్షల రూపాయలు విరాళముగా ప్రకటించారు కొండలరావు గారి సలహా మేరకు రామలింగేశ్వర సహిత అష్టాదశ శక్తి పీఠాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ ఆలయ నిర్మాణానికి ఐదు కోట్ల 50 లక్షల రూపాయలు అవుతుందని దాతల సహకారంతో ఈ ఆలయ నిర్మాణం పూర్తి చేశామని రమణాచారి తెలిపారు.
ఈ శక్తి పీఠాల విగ్రహాలను చెన్నై నగరం నుండి కొన్ని విగ్రహాలను తిరుపతి పుణ్యక్షేత్రం నుండి తెప్పించామన్నారు. ఉమా రామలింగేశ్వర స్వామి విగ్రహం మరకత లింగమని ఆయన వివరించారు. త్వరలోనే ఈ దేవాలయం వద్ద కార్యనిర్వాహక భవనం, దాతల సహకారంతో అన్నదాన సత్రం నిర్మించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. ఈ శక్తిపీఠాల ప్రతిష్ట కార్యక్రమంలో ఈ ప్రాంత ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి తమ వంతు సహకారం అందించాలని రమణాచారి విజ్ఞప్తి చేశారు.