ఉగ్రం వీరం మహావిష్ణుం;
జ్వలంతం సర్వతోముఖమ్।
నృసింహం భీషణం భద్రం;
మృత్యోర్మృత్యుం నమామ్యహం॥
” శ్రీమహావిష్ణువు శిష్ట రక్షణకై తన నివాసమైన వైకుంఠాన్ని విడిచిపెట్టి భూలోకంలో వివిధ రూపాలు ధరించినట్లు మనకు పురాణాలు తెలుపుతున్నాయి. లోక హితార్ధం అర్చా మూర్తిగా వెలసి, ఆరాధనా కైంకర్యాలను గ్రహించి, సకల జీవులకు ముక్తిని ప్రసాదించాడు. భగవంతుడు గీతను బోధించి లోకుల బాధలు తీర్చాడు. శ్రీరాముడుగా అవతరించి ఆచరణాత్మక కర్మసిద్ధాంతాన్ని చూపించి అందరికీ ఆదర్శనీయుడై, ఆరాధనీయుడై, మర్యాద పురుషోత్తముడుగా కీర్తినొందాడు.
శ్రీకృష్ణుడిగా జ్ఞానమార్గాన్ని ఉపదేశించి, ‘యోగ క్షేమం వహామ్యహమ్’ అంటూ యోగ లక్షణాలను బోధించి, ప్రజలను కర్తవ్యోన్ముఖులు గావించి పురుషోత్తముడై లోకఖ్యాతి గడించాడు. ఇలా ఆ పరమాత్ముని అవతారాలన్నీ ఈ సృష్టిలోని జీవ పరిణామ దశకు, వాటి ప్రగతికి సంకేతాలని పురాణజ్ఞులు తమ పరిశోధనల్లో తేల్చారు. దేవతలు సైతం విస్మయం చెందేలా ఉన్నట్టు ఆ ఉగ్రరూపాన్ని శాంతింపజేయమన్న భక్త ప్రహ్లాదుని విన్నపాలతో స్వామి ఉగ్రనారసింహుడిగా కాక లక్ష్మీదేవి సమేతంగా, అందరినీ అనుగ్రహించే శాంతమూర్తిగా శ్రీ లక్ష్మీ నృసింహమూర్తిగా భక్తులను గ్రహిస్తున్నాడు. ”
దశావతారాలు జీవ పరిణామ దశకు సంకేతాలు
శ్రీమహావిష్ణువు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కొరకు తన నివాసమైన వైకుంఠాన్ని విడిచిపెట్టి, భూలోకంలో వివిధ రూపాల్లో అవతరించి, భక్తులకు మోక్షాన్ని ప్రసాదించాడు. ఆ పరమాత్ముడు ప్రదర్శించిన అవతారాలు స్వభావరీత్యా రెండు విధాలు. అంశావతారాలు, లీలావతారాలు అంశావతారాల్లో ఆయా పరిస్థితులకు తగ్గట్టుగా అవతరించి దుష్టుల భారీ నుంచి శిష్టులను రక్షించి అంతర్ధానమైపోతాడు. అవి: మత్స్య (చేప), కూర్మ (తాబేలు), వరాహ (పంది), నారసింహ (నరుడు, సంహం కలిసిన విచిత్ర రూపం). లీలావతారాల్లో తల్లిదండ్రులు, బంధుమిత్రులు, ప్రేమలు, అనురాగాలు, అనుబంధాలు ఇత్యాదులన్నీ ఉంటాయి.
కానీ అవన్నీ వైరాగ్య భావాలతో మిళితమై ఉంటాయి. అవి: వామన, పరశురామ, రామ, కృష్ణ, బుద్ధ, కల్కి అవతారాలు. జల జలచర (నీటిలో తిరిగేవి), భూచర (నేల మీద తిరిగేవి), ఖేచర (ఆకాశంలో తిరిగేవి) రూపాలన్నీ తానే, క్రిమి కీటకాదుల్లో తానే, పశుపక్ష్యాదుల్లో తానే, నింగి, నేల, నీరు, నిప్పు, గాలి పంచ భూతాల్లో తానే కణంలో కణంగా, అణువులో పరమాణువుగా, ఈ అండపిండ బ్రహ్మాండమంతా తానేనని చాటి చెప్పడానికే ఎన్నెన్నో అవతారాలు ఎత్తవలసి వచ్చింది. ఒక విధంగా ఆలోచిస్తే ఆ పరమాత్ముడు ధరించిన అవతారాలన్నీ ఈ సృష్టిలోని జీవ పరిణామ దశలకు, వాటి ప్రగతికి సంకేతాలుగా పురాణజ్ఞులు సైతం తమ పరిశోధనలో తేల్చి చెప్పారు.
సర్వాంతర్యామి నృసింహస్వామి
లోకహితార్ధం అర్చా మూర్తిగా వెలసి ఆరాధన కైంకర్యాలన్నీ గ్రహించి జీవులకు మోక్ష థామాన్ని ప్రసాదించాడు పరమాత్ముడు. భగవంతుడు గీతను బోధించి లోకుల బాధలు తీర్చాడు. శ్రీరాముడుగా అవతరించి ఆచరణాత్మక కర్మసిద్ధాంతాన్ని చూపించి, అందరికీ ఆదర్శనీయుడై, ఆరాధనీయుడై మర్యాద పురుషోత్తముడైనాడు. శ్రీకృష్ణుడిగా జ్ఞానమార్గాన్ని ఉపదేశించాడు. ‘యోగ క్షేమం వహామ్యహమ్’ అంటూ యోగ లక్షణాలను బోధించి పురుషోత్తముడైనాడు. ఆ వాసుదేవుడు ఏ అవతారమెత్తినా లోక కళ్యాణార్ధమే అంటూ బృహన్నారాయణోపనిషత్తులో ఆ వాసు దేవుని సర్వవ్యాపకత్వం గురించి తెలియజేయబడింది. వాసుదేవః అనగా నివసించువాడు, లోపల ఉండు, ఉండుటకు కారణమైనవాడు అని అర్థము. ‘సమస్త ప్రాణుల యందును వసించు దేవుడు ఒక్కడే!’ అని భాగవతం తెలుపుతుంది.
పురాణ సాహిత్యంలో నృసింహ ఆవిర్భావ ప్రస్తావన
గీర్వాణ పురాణ సాహిత్యాన్ని పరిశీలిస్తే వివిధ కథలలో శ్రీ నృసింహస్వామి గురించి అనేక విధాలుగా వర్ణించబడింది. ‘దేవాణాం కార్యసిద్ధ్యర్థం సభాస్తంభ సముద్భవమ్’ (దేవతలందరినీ సంతోష పెట్టడానికే సభా మందిరమందుగల స్తంభమందు శ్రీ నృసింహ ఆవిర్భావం సంభవించినట్లు) పురాణాల్లో వివరించబడింది. భక్తుడైన ప్రహ్లాదుని కాపాడటానికే అవతరించినట్లు కొన్ని పురాణాలలో వర్ణించబడింది. శ్రీ మహా భాగవతంలో ప్రథమాధ్యాయం నుండి దశమా అధ్యాయాలలో హిరణ్యకశిపుని వృత్తాంతం, ప్రహ్లాద చరిత్ర, శ్రీ నృసింహ ఆవిర్భావము వివరించబడినది.
భక్త ప్రహ్లాద జననం, విద్యాభ్యాసం, విద్యాపరీక్ష
దితి కశ్యపుల కుమారులైన హిరణ్యాక్ష్య, హిరణ్యకశ్యపుల మూడు జన్మల దాకా శ్రీహరి విరోధులుగా (వైరభక్తులుగా) ఉంటూ కూడా మోక్షాన్ని పొందగలరని వరం పొందారు. హిరణ్యకశ్యపుడు శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతి ధాయకమైన యజ్ఞ యాగాదులకు, జపతపాలకు అడుగడుగునా ఆటంకములు కలిగిస్తూ వాటిని భగ్నం చేస్తూ ఋషి లోకాన్ని తీవ్రంగా బాధలకు గురి చేస్తూ, తన దేశంలో శ్రీహరి నామాన్ని నిషేధించి, ప్రజలంతా తన నామాన్నే స్మరించాలని, దేవాలయాల్లో శ్రీహరి విగ్రహాలకు బదులు తన నిలువెత్తు విగ్రహాలకే పూజలు చేయాలని, దేశమంతటా ఆంక్షలు విధించి కట్టుదిట్టం చేశాడు. ఎన్ని రాజ శాసనాలు చేసినా తన కుమారుడైన ప్రహ్లాదుని మనస్సును మాత్రం ఎంత మాత్రం మార్చలేకపోయాడు.
ఆ బాలుని హృదయాలయంలో నెలకొన్న శ్రీహరిని, అతని భక్తిని మాత్రం తొలగించలేకపోయాడు. ప్రహ్లాదుడు ఎవరి చేతనైనా సరే, తనకు ఏ విధంగానైనా సరే మరణం లేని వరాన్ని పొందాడు ఆ హిరణ్యకశ్యపుడు. ఆ వర గర్వంతో ఆ ధైత్యేంద్రుడు హరి భక్తులపై వ్యవహరించిన శైలి శ్రీహరికి తీవ్ర ఆగ్రహం కలిగించింది. ప్రహ్లాదుని విద్యను పరీక్షిస్తూ, “నాయనా! ప్రహ్లాద! గురువుల వద్ద ఇన్నాళ్లూ ఏం చదువుకున్నావు?” అన్న తండ్రి ప్రశ్నకు, “చదువులలో మర్మమెల్ల నే చదివితి తండ్రీ!” అని సమాధానం ఇచ్చాడు. “హరి అనుగ్రహాన్ని పొందడానికి నవవిధ మార్గాలు ఉన్నాయి అని చెప్పాడు. ఈ నవ విధ భక్తి మార్గ జ్ఞానమే అసలైన చదవని , ఆ చదువుల మర్మమే శ్రీహరి అని, ఇదే నేను చదివా”నని ప్రహ్లాదుడు తండ్రితో గట్టిగా వాదించాడు.
హిరణ్య కశ్యపుని క్రోధం, ఉగ్ర నారసింహ ఆవిర్భావం
సహజంగా పరమ నాస్తికుడైన ఆ హిరణ్యకస్యపునికి కనువిప్పు కలిగించడానికి, ఆస్తికత్వాన్ని రక్షించి, ఆస్తికత్వంపై జీవులకు నమ్మకం పెంచడానికి ఆ శ్రీ మహా విష్ణువు నృసింహావతారం ధరించవలసి వచ్చింది. ఇది అవ్యక్తవ్యక్త స్వరూపం. వ్యక్తం నరం రూపం. అవ్యక్తం సింహ రూపం. హిరణ్యకస్యపుని సంహరించడానికి ఇంట గాని, బయట గాని, క్రిమి కీటకాదులుగాక, క్రిందగాక, పైన గాక, ఒక అభేద్య వ్యూహం సిద్ధం చేశాడు శ్రీహరి. గడప మీద అసుర సంధ్యా సమయాన తన తొడల మీద, ఆ హిరణ్యకస్యపుని గుండెను వాడి అయిన తన చేతి గోళ్ళతో చీల్చి చెండాడి ఉగ్రరూపంతో వాడి ప్రేగులను తన మెడలో వేసుకున్న ఆంత్రమాలి శ్రీ ఉగ్ర నరసింహమూర్తి. లోకాలన్నింటికీ జన్మనిచ్చిన తాను మాత్రం ఒక స్తంభం లో జన్మించాడు అంటే ఈ సృష్టిలోని ప్రతి వస్తువులోనూ తానుంటానని చెప్పడానికి, ఒక నాస్తికుని కళ్ళు తెరిపించడానికి స్తంభం లో సంభవించిన అద్భుత రూపం శ్రీ ఉగ్ర నరసింహ రూపం. దేవతలు సైతం విస్మయిం చెందేలా ఉన్నట్టి ఆ ఉగ్రరూపాన్ని శాంతింపజేయమన్న భక్త ప్రహ్లాదుని విన్నపాలతో స్వామి లక్ష్మీదేవి సమేతంగా అందరినీ అనుగ్రహించే శాంతమూర్తిగా, శ్రీ లక్ష్మీ నృసింహ మూర్తిగా సాక్షాత్కరించాడు. అందుకే శ్రీ విష్ణు సహస్రనామాల్లో నారసింహవపుః శ్రీమాన్ అని కీర్తించబడ్డాడు.
సంస్కృతాంధ్ర సాహిత్యాల్లో నృసింహ స్తుతి
సనాతన హైందవ ధర్మంలోని అష్టాదశ(18) పురాణాల్లోనూ, అష్టాదశ(18) ఉప పురాణాల్లోనూ, మహర్షులు వ్రాసిన పురాణేతర సాహిత్యంలోనూ శ్రీ నృసింహస్వామి కథలు కనిపిస్తాయి. ముఖ్యంగా స్కాంద, పద్మ, బ్రహ్మ, శ్రీ విష్ణు, ధర్మోత్తర ఖండంలో, శ్రీకూర్మ, శ్రీ మత్స్య, శ్రీ నృసింహ, లింగ పురాణాల్లో ప్రస్తావించబడింది. అత్యంత ప్రముఖంగా శ్రీ వ్యాస భగవానుడు విరచిత శ్రీ మహా భాగవత పురాణంలోని దశమస్కంధంలో విపులంగా వర్ణించబడింది. ఓంకార అంతర్యామి శ్రీ నృసింహుడేయని పురాణాలు తెలుపుతున్నాయి. పోతన గారి భాగవతంలోని దశమ స్కంధంలోని నృసింహావతార ఘట్టం, ప్రహ్లాద చరిత్రలోని పద్యాలు కంఠతారాని తెలుగు వారు ఉండరు. ఎర్రన హరివంశం తో పాటు నృసింహ పురాణం రాశాడు. అందులో నృసింహుని ఆవిర్భావం, నృసింహ గద్య, నృసింహ దండకం కడు ప్రసిద్ధమైనవి. శ్రీ సింహాచలం కృష్ణమాచార్యుల సింహగిరి నరహరి వచనములు, సింహాద్రి నారసింహ శతకము ప్రశస్తమైనవి.
శేషప్ప కవి రచించిన ధర్మపురి నివాస! దుష్ట సంహార! నరసింహ! దురిత దూర! వంటి పద్యాలు తెలుగు ప్రజలందరికీ కంఠస్థాలే అని చెప్పవచ్చు. శ్రీనాథ కవి “వేదాద్రి నరసింహ విపుల వక్షస్థలీ కల్హార మాలికా గంధ లహరి…” అని వేదాద్రి నరసింహుని స్తుతించాడు. ఎందరో తెలుగు ప్రబంధ కవులు అహోబిలం, కదిరి, యాదగిరి నృసింహులను తమ తమ కావ్యాల్లో ప్రస్తుతించారు. అనంతామాత్యుడు తన భోజరాజీయాన్ని అహోబిల స్వామికి అంకితం ఇచ్చి తమ భక్తి ప్రభక్తులను చాటుకున్నాడు. సాహితీ సమరాంగణ సర్వభౌముడుగా కీర్తి పొందిన శ్రీకృష్ణదేవరాయలు తమ ‘ఆముక్తమాల్యద’లో రెండు పద్యాలలో నరసింహుని స్తుతించాడు. క్రీ॥ శ॥ 1248 లో త్రివిక్రమ పండితారాధ్య విరచితమైన కావ్యంలో లభ్యమైన 21 శ్లోకాలలో స్వామి వైభవాన్ని వర్ణించారు.
ఇలా ఎందరో సంస్కృత, తెలుగు, తమిళ, కన్నడ కవులు నృసింహుని స్తుతించారు. నృసింహ ఉపాసకులై తరించారు. ఎందరెందరో కవులు శతకములు, కీర్తనలు, తిరునామములు, మంగళహారతులు వ్రాసి, స్వామికి సమర్పించి తరించారు. జగద్గురువులు ఆది శంకరులు తమ “లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబమ్” అను మకుటంతో 13 శ్లోకాలతో కూడిన స్తోత్ర రాజాన్ని రచించి, శ్రీ నృసింహుని కీర్తించారు. వీరి ‘కరావలంబ స్తోత్రం’ జగత్ ప్రసిద్ధమైనది. శ్రీ లక్ష్మీనృసింహస్వామి శ్లోకాలను ప్రార్థనా శ్లోకాలుగా స్తోత్రం చేసినా, వ్రాసినా, విన్నా జీవన్ముక్తి లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే;
భోగీంద్రభోగ మణి రాజిత పుణ్యమూర్తే।
యోగీశ శాశ్వత శరణ్య భవాబ్దిపోత;
లక్ష్మీనృసింహ మమదేహి కరావలంబమ్॥
“సాహిత్య కళా విభూషణ్” చౌడూరి నరసింహరావు
ప్రవచన కర్త, ఆధ్యాత్మిక విశ్లేషకులు

