HomeదైవంVaishakha Shuddha Navami: భారతీయ మహిళకు ప్రతిరూపం సీతమ్మ తల్లి

Vaishakha Shuddha Navami: భారతీయ మహిళకు ప్రతిరూపం సీతమ్మ తల్లి

Vaishakha Shuddha Navami: “నేడు వైశాఖ శుద్ధ నవమి. సీతమ్మ తల్లి జన్మ దినోత్సవం సీతా నవమి. భారతీయులందరూ “అమ్మా” అని పిలుచుకునే సీతమ్మ తల్లి ఈ భూమిపై అవతరించిన పవిత్రమైన రోజు. అందుకే ఈ రోజును సీతా నవమిగా పిలుస్తూ సీతమ్మ తల్లి జన్మ దినోత్సవాన్ని నిర్వహిస్తాము. సీతమ్మ ముఖ్యంగా భారతీయ మహిళా లోకానికి ప్రతిరూపం. ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు ఎదురైనా ఏమాత్రము వెరువని ధీరతకు ఆమె నిలువెత్తు నిదర్శనం! సీతామాత మహా శక్తి స్వరూపిణి. శ్రీరామచంద్రుని వివాహమాడకముందు జనకుడికి నాగలి చాలులో దొరకక ముందు కూడా ఆమెలో ఆ శక్తి దాగి ఉంది.

- Advertisement -

సీతమ్మ పేరుతో ‘సీతోపనిషత్తు’ అని అధర్వణ వేదంలో ఒక ఉపనిషత్తే ఉంది. అందులో ఆమె సిసలైన స్వరూప స్వభావాలు మనకు కనిపిస్తాయి. ఆమె ఎవరో స్పష్టమవుతుంది. బ్రహ్మదేవుడు దేవతలకు వివరించిన విషయాలు ఉన్నాయి. అహల్య, స్వాహా దేవి, హైమావతి, ఉమా, గౌతమి, హేమలేఖ, సీత వంటి వారు వేదాలను దర్శించి మనకు అందించిన 22 మంది ఋషికలు ఉన్నారని శాస్త్రాలు చెబుతున్నాయి. ప్రాచీన గ్రంథాలలోని శ్లోకాలు, వేదమంత్రాలు స్త్రీ తత్వానికి గౌరవాన్ని ఇచ్చినట్లుగా అనేక ఉదాహరణలు ఉన్నాయి. ప్రాచీన ఋగ్వేదంలోని పదవ అధ్యాయం “సమస్త విశ్వం వెనుక ఉన్న సర్వోన్నత సూత్రం స్త్రీతత్వమే!” అని నొక్కి చెబుతున్నది.

తనను రావణుడు వివాహం చేసుకోమని ఎంత ఒత్తిడి పెట్టినా, ఏమాత్రము చెలించని ధీరవనిత సీతమ్మ. పైగా రావణుడిని గడ్డిపోచతో పోల్చింది. ఎంతటి గుండె ధైర్యం అనేది! ఆమెను భయపెట్టవలసిందిగా తన మనుషులను వినియోగిస్తే వాళ్లందరూ సీతమ్మ తల్లి అనన్యమైన వాత్సల్యము, మంచితనము, వ్యవహారం చూసి ఆమెకు దాసోహం అవటం సీతామాత వాత్సల్యపూరిత వ్యవహారానికి నిదర్శనం! విభీషణ పుత్రిక అయిన త్రిజట సీతమ్మకు సేవకురాలై తరించింది. వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్రామాయణం ఇతి సీతాయాశ్చరితం అని పైకి రామాయణం అని చెప్పినా అంతర్ముఖంగా సీతామాత చరిత్రగా మనకు కనబడుతుంది. నిండైన కట్టు బొట్టు, సహనము, సౌశీల్యము మొదలైన సుగుణాలకు ఏకైక నిదర్శనంగా సీతమ్మ మనకు సాక్షాత్కరిస్తుంది. ”

ప్రకృతి పురుషుల మేలు కలయికయే సీతారాములు
ఆదికవి వాల్మీకి విరచిత శ్రీ మద్రామాయణం ఈ దేశపు ప్రజలనే గాక విశ్వ మానవాళిని ఎంతగానో ప్రభావితం చేసింది. అందువల్ల ఇక్కడి జనులు తమకు రాముడి వంటి పితృ ఆజ్ఞా పరిపాలకుడైన పుత్రుడు కలగాలని, అతడు రాముని వంటి సుమనస్వి, చిర యశస్వి కావాలని కోరుకుంటారు. రామాయణంలోని ప్రముఖ పాత్రలలో సీతాదేవి ఒకరు. ఆమె దశరథ సుతుడైన రాముని భార్య. మిథిలా నగరపు శాసకుడైన జనకుని కూతురు. మహా పతివ్రత. ఆదిశక్తి. జగజ్జనని. రావణాసురుణ్ణి అంతం చేయడానికి ఈ భూమిపై శ్రీమహావిష్ణువు అవతరించే ముందు ఆయన “దేవతలతో శక్తి స్వరూపురాలైన సీతాదేవితో సహా నేను భూలోకానికి విచ్చేస్తా”నని అన్నాడు. సీతాదేవి శ్రీరాముని లీలా సహచరి. అతడిని నడిపించే శక్తి స్వరూపిణి. ఆమె లేనిదే శ్రీరాముడు ఈ జగత్తులో తన లీలలను నిర్వహించలేడు. నిజానికి రాముడు సీత వేరువేరుగా కనిపించినా వారిరువురూ ఒక్కరే! ప్రకృతి పురుషుల మేలు కలయికయే సీతారాములు.

బాల్యంలోనే సాహసాన్ని చూపిన సీతమ్మ
మిథిలా నగరం సీతాదేవి జన్మభూమి. విదేహ రాజైన జనకుడు మహారాణి సునయన ఆమె తల్లిదండ్రులు. ఆడుతూ పాడుతూ బాల్యంలో ఒకనాడు బంతి శివధనుస్సు గల పేటిక క్రిందకు వెళ్లగా, ఆ పేటికను ఎడమ చేతితో అవలీలగా కదిలించి, కుడి చేతితో ఆ బంతిని తీయటం అంతఃపుర కాంతలు, ఆమె తల్లిదండ్రులు చూసి మిక్కిలి ఆశ్చర్యపోయారు. బాల్యంలోనే సీతాదేవి చూపిన సాహసాన్ని గాంచిన తండ్రి జనకుడు ఎంతో ఆనందించాడు. యుక్త వయస్కురాలైన సీతాదేవికి ఆనాటి సంప్రదాయాన్ని అనుసరించి, జనకుడు ఆమెకు స్వయంవరాన్ని ప్రకటించాడు “శివ ధనుస్సు ఎత్తి, నారిని సంధించిన వారే సీతకు భర్తగా ఉండటానికి అర్హులని” షరతును విధించాడు. వివిధ రాజ్యాల యువ రాజులు ఎందరో సీతా స్వయంవరం లో పాల్గొన్నారు. కాని శివ ధనస్సును ఎత్తలేక విపనులయ్యారు. చివరకు విశ్వామిత్ర మహర్షి కోరికపై అవలీలగా శివధనస్సును ఎత్తి, నారిని సంధించి, శివ ధనుస్సును విరిచి శ్రీరాముడు సీతను వరించాడు. సీతారాముల కళ్యాణం కమనీయంగా, రమణీయంగా జరిగింది.

రామయ్య వెంటే సీతమ్మ
దశరథుడు శ్రీరామునికి యువరాజుగా పట్టాభిషేకం చేయడానికి నిర్ణయించారు. దాసి మందర సలహా పై దశరధుని రెండవ (భార్య) రాణి అయిన కైకేయి ఇంతకు ముందు వాగ్దానం చేసిన రెండు వరాలను ఇమ్మని దశరథుని కోరింది. ఆ కోరిక ప్రకారం శ్రీరాముడికి 14 సంవత్సరాల వనవాసం, తన పుత్రుడైన భరతుడికి యువరాజుగా పట్టాభిషేకం. తండ్రిగారైన దశరధుని మాటను నిలబెట్టడానికి శ్రీరాముడు 14 సంవత్సరాలు అడవులకు వెళ్లడానికి సిద్ధమయ్యాడు. భర్త సుఖదుఃఖాలను సమానంగా పంచుకోవాలనే భావనతో శ్రీరాముడి వెంట సీతమ్మ కూడా అడవులకు వెళ్లాలని నిశ్చయించింది. అత్తమామలకు, పరిజనులకు ప్రియమైన సీతాదేవి అత్యంత కోమలమైనది. ఆమెను అడవులకు పంపాలని వారు అనుకోలేదు.

అయినా భార్యగా తన కర్తవ్య నిర్వహణకై అడవికి వెళ్లాలని సీతమ్మ సన్నద్ధమయ్యింది. నార చీరలను ధరించింది. అడవిలోని కష్టాలను ఎదుర్కోవడానికి, భూమిపై శయనించడానికి, కందమూలాలను భుజించడానికి సంతోషంగా ఉద్యుక్తురాలయ్యింది. రామ లక్ష్మణులతో పాటు కాలినడకన అడవిలో పయనించినప్పుడు, రాళ్లు రప్పలను, ముళ్ళకంపలను దాటినప్పుడు, అతి కోమలి అయిన సీతమ్మ ఏమాత్రం బాధపడలేదు. దాన్నంతటినీ తన కర్తవ్యం గా భావించింది. పశుపక్షుల సాంగత్యానికి సంతోషించింది. వాటికి మాతృ ప్రేమను పంచింది. తన ప్రాంతంలో ఉండే వన్యజనులను, గిరిజనులను, ఋషి, మునులను గౌరవించింది. ఆదరించింది. పరమ పవిత్రమైన జీవితాన్ని గడిపింది. ఆదర్శ పతివ్రతా శిరోమణిగా తన కర్తవ్యాన్ని నిష్టతో నిర్వర్తించింది.

కష్ట కాలాన్ని ‘రామ’ నామ స్మరణతో పునీతురాలైన ధన్యురాలు
సీతాదేవి తన భర్త తలలోని నాలుక వంటిది. అందుకే రాముడే సీత. సీతయే రాముడు. సీత ప్రేమ మూర్తి. సద్గుణాల రాశి. చక్కని మాటకారి. అమిత ధైర్యవంతురాలు. యువరాణిగా అంతఃపురంలో అనుభవించే భోగభాగ్యాల కోసం ఆమె ఆశపడలేదు. రాముడికి యువరాజు పదవి పోయినందుకు ఆమె బాధపడలేదు. దండకారణ్యంలో గోదావరి నదీ తీరాన నేటి భద్రాచలం దగ్గర పంచవటి (మర్రి చెట్టు, మేడి చెట్టు, రావి చెట్టు, అశోక చెట్టు, మారేడు చెట్టు. ఈ ఐదు వృక్షాలు ఒకే దగ్గర ఉన్న ప్రదేశం ఒక శక్తి క్షేత్రం. ఇదే పంచవటి.) ఆశ్రమాన్ని శ్రీరాముడు తన నివాస స్థానంగా మార్చుకున్నాడు.

అటువంటి సమయంలో రావణాసురుడు సీతను అపహరించడానికి బంగారు జింక రూపంలో ఒక రాక్షసుడిని పంపాడు. ఆ జింకను చూసి మోజు పడి, “దాన్ని తెచ్చి ఇవ్వమ”ని సీతమ్మ రామయ్యను కోరింది. కొద్ది సేపటి తర్వాత రాముడి బాణంతో గాయపడ్డ రాక్షసుడు “ఓ సీతా..! ఓ లక్ష్మణా..!” అని, బిగ్గరగా అరుస్తూ అసువులు బాసాడు. దానితో రామునికేదో ఆపద వాటిల్లిందని భావించి సీతమ్మ లక్ష్మణుడ్ని రాముడి బాగోగులు తెలుసుకోవడానికి పంపించింది. ఆ పిదప ఋషి రూపంలో వచ్చిన రావణుడు సీతమ్మ ను అపహరించాడు. లంకా నగరంలోని అశోక వనంలో ఆమెను ఉంచాడు.

ఆమెకు రాక్షసుల కాపలా పెట్టాడు. మాటి మాటికి వచ్చి తనను పరిణయమాడమని వేధించాడు. అయినా సీత చలించ లేదు. రావణునికి భయపడలేదు. అతడి కోర్కెను నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. దృఢ చిత్తంతో, ధైర్యంతో రావణాసురుణ్ణి ఎదిరించింది. రాత్రనక పగలనక ‘రామ’ నామాన్ని స్మరించి, తన శీలాన్ని రక్షించుకొని భారతీయ స్త్రీలకు ఆదర్శప్రాయు రాలయింది. సీతమ్మ మనస్సులో దుర్మార్గుడైన రావణుని పట్ల తిరస్కార భావం ఉండేది. ఆమె అతడిని గడ్డిపోచతో సమానుడైన వాడిగా భావించింది. అందుకే అతడితో మాట్లాడిన ప్రతీసారి గడ్డిపోచని చూసే మాట్లాడేది. ఇదీ సీతమ్మ వ్యక్తిత్వం.

అగ్ని ప్రవేశం తో పాతివ్రత్యాన్ని నిరూపించుకున్న మహా పతివ్రత
శ్రీరాముడి దూతగా పవన పుత్రుడైన ఆంజనేయుడు వచ్చి “శ్రీరాముడు త్వరలోనే వస్తాడు. రావణాసురుని వధించి మిమ్మల్ని తన వెంట తీసుకొని వెళ్తాడమ్మ!”అని పలికిన మాటలతో కొంత మేరకు సీతాదేవి కుదుటపడ్డా, శ్రీరాముడి రాకకై ఎదురు చూస్తూనే ‘చంద్రుని రాకకై చకోరం’లా నిరీక్షిస్తూ.. ఆమె తన కష్ట కాలాన్ని గడిపింది. లంక యుద్ధంలో శ్రీరాముడు రావణాసురుని సంహరించిన తర్వాత అగ్ని ప్రవేశం చేసి సీత తన పాతివ్రత్యాన్ని నిరూపించుకుంది. అయోధ్యా నగరానికి శ్రీరామునితో తిరిగి వచ్చిన తర్వాత తాను మహారాణి అయి ఉండి కూడా తన అత్తగార్లనందరినీ సమానమైన దృష్టితో సీతమ్మ సేవించింది. వారికి కావలసిన పరిచర్యలన్నీ చేసి ఆదర్శ కోడలిగా జీవించింది.

మాతృత్వానికే ధన్యతను చేకూర్చిన సీతామాత
తన రాజ్యంలోని ఒక వ్యక్తి సీతమ్మ ను గురించి చెడుగా మాట్లాడినప్పుడు (ఉత్తర రామాయణంలో) శ్రీరాముడు గర్భిణీ అయినా ఆమెను అడవులకు పంపిస్తాడు. అప్పుడు కూడా సీతాదేవి అధైర్య పడలేదు. ధైర్యంగా అడవిలో తనకు జన్మించిన లవకుశులను పెంచి ప్రయోజకులను చేసింది. తన మాతృత్వానికి ధన్యతను చేకూర్చింది. సీతాదేవి ఆదర్శమాతగా నిలిచింది.

ఆదర్శ నారీ శిరోమణి
సీతాదేవి మానవ రూపం దాల్చిన భూదేవి. అందుకే ఆదికవి వాల్మీకి ఆమెను “వసుధాయా.. వసుధాం!” (భూదేవికే భూదేవి) అని కీర్తించాడు. సీతమ్మ జ్ఞానశీలి, త్యాగ మూర్తి, ప్రేమ మూర్తి, పరిపూర్ణ మాతృమూర్తి, ‘పతిసేవయే తన విద్యుక్త ధర్మము’ అని నమ్మి రాణీవాస సుఖాలను పరిత్యజించిన పవిత్ర మూర్తి. పతివ్రతా శిరోమణి. ఆదర్శ నారీ శిరోమణి. నేటి ఆధునిక మహిళలు తమ కట్టు, బొట్టు, వ్యక్తిత్వంలో సీతమ్మను ఆదర్శంగా తీసుకొని భారత నారి గౌరవాన్ని నిలబెట్టాలని ఆశిద్దాం! ఆకాంక్షిద్దాం!

“సాహిత్య కళా విభూషణ్” చౌడూరి నరసింహారావు
ప్రవచన కర్త, ఆధ్యాత్మిక విశ్లేషకులు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News