Magha Purnima 2026:హిందూ సంప్రదాయంలో ప్రతి మాసానికి, ప్రతి తిథికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. తెలుగు మాసాల్లో కార్తీక మాసం దీపారాధనకు ప్రసిద్ధి కాగా, మాఘ మాసం పవిత్ర స్నానాలు, ఆధ్యాత్మిక ఆచరణలకు ముఖ్యమైన కాలంగా భావిస్తారు. అలాగే పౌర్ణమి, అమావాస్య తిథులకు కూడా విశిష్టమైన స్థానముంది. ఈ నేపథ్యంలో మాఘ మాసంలో వచ్చే పౌర్ణమిని మాఘ పూర్ణిమగా పిలుస్తారు. ఈ రోజు విష్ణుమూర్తి ఆరాధనతో పాటు దేవీ ఉపాసన, పితృదేవతల స్మరణకు అనుకూలమైన రోజుగా హిందువులు విశ్వసిస్తారు.
మాఘ పూర్ణిమగా…
మాఘ నక్షత్రంలో చంద్రుడు సంచరించే సమయంలో వచ్చే పౌర్ణమి తిథినే మాఘ పూర్ణిమగా పరిగణిస్తారు. 2026 సంవత్సరంలో మాఘ పూర్ణిమ ఫిబ్రవరి 1వ తేదీన వస్తోంది. ఈ సంవత్సరం మాఘ పూర్ణిమకు కొన్ని ప్రత్యేకమైన గ్రహయోగాలు కలిసి వస్తున్నాయని పండితులు చెబుతున్నారు. సాధారణంగా మఘ నక్షత్రం ఉన్నప్పుడు పౌర్ణమి తిథినాడు చేసే పూజలు ఆయుష్షు పెరుగుదలకు, అనారోగ్యాలు తగ్గేందుకు సహాయపడతాయని విశ్వాసం ఉంది.
మకర రాశి నుంచి కుంభ రాశిలోకి..
ఈ కాలంలో గ్రహాల గమనాన్ని పరిశీలిస్తే, అనేక గ్రహాలు మకర రాశి నుంచి కుంభ రాశిలోకి మారే దశలో ఉంటాయి. ఫిబ్రవరి నెలలో దాదాపు 12 నుంచి 15 రోజుల పాటు పంచగ్రహ సమ్మేళనం కొనసాగుతుందని జ్యోతిష్యులు వివరిస్తున్నారు. ఇలాంటి సమయంలో వచ్చే మాఘ పూర్ణిమ ఆధ్యాత్మికంగా మరింత ప్రాధాన్యం సంతరించుకుంటుంది. ఈ రోజు సూర్యుడిని ప్రార్థించడం, అమ్మవారిని భక్తితో పూజించడం వల్ల మానసిక ప్రశాంతత, ఆరోగ్య స్థిరత్వం కలుగుతుందని సంప్రదాయ నమ్మకం.
పితృదేవతలకు తర్పణాలు…
మఘ నక్షత్రం రోజున దేవీ ఆరాధనతో పాటు పితృదేవతలకు తర్పణాలు చేయడం కూడా శుభప్రదంగా భావిస్తారు. పితృదేవతలను స్మరిస్తూ చేసే ఆరాధన వల్ల కుటుంబంలో ఉన్న అవరోధాలు తొలగి, సానుకూల శక్తి పెరుగుతుందని విశ్వసిస్తారు. పితృదోషాలకు సంబంధించిన భయాలు తగ్గి, ఇంట్లో శాంతి నెలకొంటుందని ఆధ్యాత్మిక గురువులు చెబుతున్నారు. ముఖ్యంగా మఖ నక్షత్రానికి పితృదేవతలే అధిదేవతలుగా పరిగణింపబడతారు కాబట్టి, ఈ నక్షత్రం రోజున చేసే పితృకర్మలు విశేష ఫలితాలను ఇస్తాయని భావిస్తారు.
మాఘ పూర్ణిమ రోజు..
మాఘ పూర్ణిమ రోజు చేయదగిన ఆచరణల్లో దానం ముఖ్యమైనది. ఈ రోజున స్వయంగా వంట చేసి అవసరమైన వారికి భోజనం అందించడం పుణ్యకార్యంగా చెబుతారు. అలాగే గోశాలకు వెళ్లి గోవులకు మేత వేయడం, పేదలకు తెల్లని వస్త్రాలు ఇవ్వడం వంటి దానాలు చేయడం శుభఫలితాలను ఇస్తాయని నమ్మకం. వీలైనంత వరకు ధ్యానం చేయడం, మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం కూడా ఈ రోజు ప్రత్యేకత.
Also Read:https://teluguprabha.net/devotional-news/gajakesari-raja-yoga-effects-on-three-zodiac-signs/
ఆధ్యాత్మికంగా ఆసక్తి ఉన్నవారు మాఘ పూర్ణిమ రోజు దేవాలయ దర్శనం చేయడం ద్వారా మంచి అనుభూతిని పొందుతారని భావిస్తారు. ముఖ్యంగా అమ్మవారి ఆలయాలకు వెళ్లి పూజలు చేయడం, దేవీ మంత్ర జపం చేయడం ఈ రోజున అనుకూలంగా ఉంటుంది. మంత్ర సాధన చేసే వారికి ఈ రోజు త్వరగా ఫలితాలు కనిపిస్తాయని సంప్రదాయ విశ్వాసం. దేవీ మంత్రాలతో పాటు గణపతి మంత్రాలను పఠించడం కూడా శుభప్రదంగా భావిస్తారు.
స్నానాలు, పూజలు, దానాలు…
మాఘ మాసం మొత్తం పవిత్రతకు ప్రతీకగా భావిస్తారు. ఈ నెలలో చేసే స్నానాలు, పూజలు, దానాలు శరీర శుద్ధితో పాటు మనస్సు శుద్ధికి దోహదపడతాయని పెద్దలు చెబుతారు. మాఘ పూర్ణిమ ఆ మాసానికి ముగింపు దశలో వచ్చే ముఖ్యమైన రోజు కావడంతో, ఆధ్యాత్మికంగా మరింత విలువను సంతరించుకుంటుంది.
2026 మాఘ పూర్ణిమ రోజున భక్తి, నియమాలు, దానధర్మాలను పాటిస్తూ గడపడం ద్వారా వ్యక్తిగత జీవితంలో సానుకూల మార్పులు వస్తాయని హిందూ సంప్రదాయం సూచిస్తుంది. ఈ రోజు చేసే ఆచరణలు విశ్వాసం, శ్రద్ధతో ఉంటే ఆధ్యాత్మిక సంతృప్తి లభిస్తుందని అనేక మంది నమ్మకం.

