మహాకుంభ మేళా.. హిందువులకు ఎంతో ప్రవిత్రమైనది. పుష్కర కాలానికి అంటే 12 సంవత్సరాలకు ఒక సారి మహా కుంభమేళా నిర్వహిస్తుంటారు. పరమ పవిత్ర గంగ, యమున, సరస్వతి నదుల సంగమ ప్రాంతం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ వద్ద జనవరి 13వ తేదీ నుంచి ప్రారంభమయ్యే మహాకుంభ మేళాకు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు, సాధువులు హాజరవుతారు. మన దేశంలో ప్రయాగ్‌రాజ్‌తో పాటు హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్‌లోనూ కుంభమేళా నిర్వహిస్తారు. అయితే వీటన్నింట్లో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించే కుంభమేళాకు ఎంతో ప్రాధాన్యత ఉంది.
ప్రయాగ్‌రాజ్‌లోనే గంగా, యమునా, సరస్వతి నదుల సంగమం జరుగుతుంది. దీన్నే త్రివేణి సంగమంగా పిలుస్తారు. మహా కుంభం వేళ గంగా నదిలో స్నానం చేయడం వల్ల కచ్చితంగా మోక్షం లభిస్తుందని హిందువుల నమ్మకం. అంతేకాదు పాపాలన్నీ తొలగిపోతాయని విశ్వాసం. అయితే కుంభమేళా నాలుగు ప్రదేశాల్లోనే ఎందుకు చేస్తారు. గంగా స్నానం ప్రాధాన్యత ఏంటి.. గంగా నదిలో స్నానం చేసే ముందు ఎలాంటి నియమాలు పాటించాలో ఈ కథనంలో తెలుసుకుందాం.
కుంభమేళా భోగి రోజు ప్రారంభమై.. శివరాత్రితో పూర్తవుతుంది. ఈ ఉత్సవం ప్రధానంగా నాలుగు ప్రదేశాల్లో జరుగుతుంది. దీని వెనుక పురాణాల్లో ఓ కథనం ఉంది. దేవతలు-రాక్షసులు క్షీరసాగర మథనం చేసినప్పుడు.. అమృత కలశాన్ని జయంతుడు అనే కాకి నోట కరుచుకుని భూమి చుట్టూ తిరిగిందని చెపుతారు. ఈ జయంతుడు ఇంద్రుడి కుమారుడు. గౌతమ మహర్షి శాప ప్రభావంతో కాకిగా మారుతాడంట. చివరికి రాముడి చేతిలో శాపవిమోచనం పొందుతాడని పురాణాలు చెపుతున్నాయి. జయంతుడు రాక్షసులకు అమృతం అందకుండా.. భూమి చుట్టూ 12 రోజులు తిరిగాడని చెపుతారు. మనుషులకు ఏడాది కాలం దేవతలకు ఒక రోజుతో సమానం. అంటే దక్షిణాయనం రాత్రి, ఉత్తరాయణం పగటి సమయంగా చెపుతారు. ఈ లెక్కన దేవతలకు 12 రోజులు అంటే మానవులకు 12 సంవత్సరాలు అని అర్థం. అందుకే 12 ఏళ్లకోసారి కుంభమేళా నిర్వహిస్తారు.
జయంతుడు అమృత కలశం తీసుకుని భూమిమొత్తం తిరిగినప్పుడు.. ఆ అమృత కలశం నుంచి నాలుగు చుక్కలు ఈ నాలుగు ప్రదేశాల్లో పడ్డాయి. అందుకే ఇవి అత్యంత పవిత్రమైన ప్రదేశాలుగా చెబుతారు పండితులు. అమృతం పడిన ఆ నాలుగు ప్రదేశాలో ప్రయాగ్ రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్… .అందుకే వీటిని వైకుంఠంతో సమానమైన ప్రదేశాలు అంటారు. గంగ, యమున నదుల సంగమ ప్రదేశంలో సరస్వతి అంతర్వాహినిగా ఉంటుంది. ఈత్రివేణి సంగమంలో కుంభమేళా సమయంలో రాజస్నానం ఆచరిస్తారు.
ఇక మహాకుంభ మేళా ప్రాముఖ్యత కేవలం మతపరమైన ఆచారాలకే కాదు. ఇది ఆధ్యాత్మిక జ్ఞానం, సామాజిక సామరస్యానకి ముఖ్యమైన వేదిక. కుంభమేళా భక్తులకు ఆధ్యాత్మిక శాంతిని అందిస్తుంది. అంతేకాదు జీవితంలో లోతైన రహస్యాలను అర్థం చేసుకునే అవకాశాన్ని ఇస్తుంది. అందుకే మహా కుంభమేళాలో గంగా స్నానం చేసే భక్తులందరూ తప్పనిసరిగా మత సంప్రదాయాలను, నియమాలను పాటించాలి.
ఇక ఈ సారి కుంభమేళాకు 40 కోట్ల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సారి కుంభమేళాకు దాదాపు 6500 కోట్లు ఖర్చు అవుతుందని ఉత్తప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేసింది. కుంభమేళాకు తరలివచ్చే కోట్లాది భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు చేస్తున్నారు. ఘాట్ల వద్ద స్నానానంతరం దుస్తులు మార్చుకునే గదులు సిద్ధం చేస్తున్నారు. కుంభమేళా ప్రాంతంలో ఫ్లోటింగ్ బ్రిడ్జిలు నిర్మించారు. ఈ బ్రిడ్జిలు కేవలం నడిచేందుకే కాదు..5 టన్నుల బరువున్న వాహనాలు కూడా ప్రయాణించే అవకాశం ఉంది. అఖాడాలు, శంకరాచార్య, మహామండలేశ్వర్లతో పాటు వివిధ సంస్థలకు టెంట్లు వేసుకునేందుకు ఉచితంగా స్థలం కేటాయిస్తున్నారు. భక్తుల కోసం టెంట్ సిటీ పేరుతో తాత్కాలిక టెంట్లు నిర్మిస్తున్నారు.