Maha Shivratri Special: మహాశివరాత్రి నాడు, కొన్ని ప్రత్యేక వస్తువులను ఇంటికి తీసుకువస్తే శుభాలు కలుగుతాయని వేద పండితులు సూచిస్తున్నారు. ఇవి ఇంట్లో ఉంటే శివుని ఆశీస్సులతో జీవితంలో ఆనందం, శ్రేయస్సు లభిస్తాయని భక్తులు విశ్వసిస్తున్నారు. మరి మహాశివరాత్రి నాడు మనం ఇంటికి ఏ వస్తువులను తీసుకురావాలో ఇక్కడ చూద్దాం..
ప్రతి ఏడాది ఫాల్గుణ మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి మహాశివరాత్రి జరుపుకొంటారు. శివపార్వతుల వివాహం జరిగిన ఈ అపూర్వమైన రోజు చాలా ప్రత్యేకమైనది. ఖరీదైన కానుకలకు లొంగని శివయ్య.. చెంబుడు నీళ్లతో తనకు అభిషేకం చేస్తే మురిసిపోతాడట. అందుకే రుద్రాభిషేకం, పాలాభిషేకం, నీళ్లు, నెయ్యి, అన్నం, పూలు, బిల్వ పత్రాలు ఇలా.. ఒకటేమిటి భక్తులు తమ శక్తి మేరకు శివలింగానికి అభిషేకం చేసి తమ భక్తిని చాటుకుంటారు. ఇక ప్రత్యేక పూజలు, ఉపవాసాలు, జాగారాలతో శివయ్య నామస్మరణలో భక్తి పారవశ్యం పొందుతారు. మహాశివరాత్రి నాడు శివుడిని పూజించడం వల్ల సంతోషకరమైన వైవాహిక జీవితం లభిస్తుంది.
రుద్రాక్ష – రుద్రాక్ష శివుడి కన్నీటి నుంచి ఉద్భవించింది. అందుకే రుద్రాక్షను మహాదేవునిలో భాగంగా భావిస్తారు. మహాశివరాత్రి నాడు, రుద్రాక్షను ఇంటికి తీసుకురావడం వల్ల శివుని ఆశీస్సులు లభిస్తాయి.
శివలింగం – ఇతర దేవుళ్లు, దేవతలను ఫొటోలు, విగ్రహాల రూపంలో పూజిస్తే పరమేశ్వరుడిని శివలింగం రూపంలో పూజిస్తారు. శివలింగాన్ని పూజించడం వల్ల అన్ని దుఃఖాలు తొలగిపోతాయి. మహాశివరాత్రి నాడు శివలింగాన్ని ఇంటికి తీసుకురావడం వల్ల మహేశ్వరుడి ప్రత్యేక ఆశీస్సులు లభిస్తాయి.
నంది విగ్రహం – నంది శివుని వాహనం. అందుకే శివాలయాల్లో గర్భగుడి ఎదురుగా నంది కొలువుదీరుతాడు. మహాశివరాత్రి నాడు వెండి లేదా ఇత్తడి నంది విగ్రహాన్ని ఇంటికి తీసుకురావడం ద్వారా మీ పనిలో అడ్డంకులను తొలగిస్తుంది.
బిల్వ పత్ర, శమి మొక్క – బిల్వ పత్ర, శమి మొక్క శివుడికి చాలా ప్రియమైనవి. పూజ సమయంలో వీటిని శివుడికి సమర్పిస్తారు. మహాశివరాత్రి నాడు బిల్వ పత్రంతో పాటు శమి మొక్కను ఇంటికి తీసుకురావడం ద్వారా ఇంట్లో సానుకూల శక్తి ప్రభావం పెరిగి అనుకున్న పని నెరవేరుతుంది.

