మహాకుంభమేళాకు వెళ్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దేశవిదేశాల నుంచి త్రివేణీ సంగమ స్నానానికి పోటెత్తుతున్న భక్తులతో ఈ ప్రాంతమంతా కిటకిటలాడుతోంది. కాగా ఫిబ్రవరి 26న కుంభమేళ ముగుస్తుండగా 45 కోట్ల మంది పవిత్ర స్నానాలు ఆచరించే అవకాశం ఉన్నట్టు ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యానాథ్ వెల్లడించారు. ఇప్పటికే ప్రయాగ్ రాజ్, వారణాసి, అయోధ్య సర్క్యూట్ మొత్తం కోట్లాది మంది భక్తులతో నిండిపోగా మరోవైపు భక్తులు ఇంకా వస్తూనే ఉన్నారు. మాఘమాసం పవిత్ర స్నానం ఆచరించేందుకు, వసంత పంచమి స్నానాలు చేసేందుకు ఇంకా ఎక్కువ మంది వస్తారని ప్రభుత్వ యంత్రాంగం అంచనా వేస్తోంది.
పవిత్ర స్నానాలు చేసిన 35 కోట్ల మంది
మహా కుంభమేళాకు అందరికీ స్వాగతమన్న యోగీ ఇప్పటివరకూ అధికారిక లెక్కల ప్రకారం 35 కోట్ల మంది పవిత్ర స్నానాలు ఆచరించినట్టు వెల్లడించారు. 77 దేశాల నుంచి డిప్లమాట్స్ బృందం మేళాకు వచ్చి వెళ్లినట్టు ఆయన తెలిపారు. జనవరి 13న ప్రారంభమైన కుంభమేళాలో తెలుగు వారు అత్యధికంగా పాల్గొంటుండటం విశేషం.