Sunday, July 7, 2024
HomeదైవంMahanandi: ధార్మిక కేంద్రంగా మహానంది

Mahanandi: ధార్మిక కేంద్రంగా మహానంది

శిఖర ప్రతిష్ట కుంబాభిషేకానికి త్వరలో ముహూర్తం

మహానంది పుణ్యక్షేత్రం ధార్మిక కేంద్రంగా, అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందని జగద్గురు కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి పేర్కొన్నారు. మహానంది క్షేత్రంలో మహానందీశ్వర స్వామివారికి విశేష అభిషేకము, శ్రీ కామేశ్వరి అమ్మవారికి కుంకుమార్చన పూజ, కోదండ రాముల స్వాముల వారికి అష్టోత్తర శతనామావళి పూజలు నిర్వహించారు. అనంతరం క్షేత్రంలో మహాశివరాత్రిలో స్వామివారి కళ్యాణ నిశ్చితార్థ మండపంకు సుమారు 30 లక్షల వ్యయంతో దాతలు గుండుపాపల, గుండంపాడు గ్రామానికి చెందిన వారి సహకారంతో నిర్మించే మండపానికి పీఠాధిపతుల చేతుల మీదుగా భూమిపూజ నిర్వహించారు. సాయంత్రం కంచి పీఠాధిపతులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి మీడియాతో మాట్లాడుతూ ధార్మిక అవసరాన్ని తీర్చే కేంద్రంగా మహానంది పుణ్యక్షేత్రం విరాజిల్లుతుందని అన్నారు. ప్రధానంగా కంచి కామకోటి పీఠం విద్య, వేదము, వైద్యము కొరకు సేవలు నిర్వహిస్తుందని అన్నారు.

- Advertisement -

1983 నుంచి ఇక్కడ కంచి పీఠం..

1983 వ సంవత్సరంలో మహానంది క్షేత్రానికి కంచి పీఠం వచ్చిందని, లోక కళ్యాణము కోసం విజయ యాత్రలో భాగంగా శ్రీశైలం పుణ్యక్షేత్రంలో కుంభాభిషేకంలో పాల్గొని మహానంది క్షేత్రానికి వచ్చినట్టు తెలిపారు. మహానంది పుణ్యక్షేత్రం ఎంతో విశిష్టత కలిగిన ఆలయమని అన్నారు. మహానంది పుణ్యక్షేత్రంలో నిర్వహించబోయే శిఖర ప్రతిష్ట కుంబాభిషేకము తేదీని త్వరలో నిర్ణయిస్తామని అన్నారు. 23 వ తేదీ ఫిబ్రవరి నెల 1967వ సంవత్సరంలో అప్పటి కంచి పీఠాధిపతి మహానంది క్షేత్రాన్ని సందర్శించామరు. రాయలసీమ ధార్మిక కేంద్రంగా ప్రాముఖ్యమైన పుణ్యక్షేత్రాలలో శ్రీశైలం, మహానంది, అహోబిలం క్షేత్రాలలో విరాజిల్లితోందన్నారు. దేవాలయాల ద్వారా భక్తులకు అవసరమైన సంతృప్తి దొరుకుతుందని అన్నారు. క్షేత్రాలలో ధర్మ ప్రచారం, సత్సంగం, భజన, సాంస్కృతిక కార్యక్రమాలు, పర్యావరణ రక్షణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. క్షేత్రానికి దగ్గరలో ఉన్న గ్రామాలలో నివసించే ఆదివాసులకు భక్తి భావం పెంచే విధంగా గ్రామాలలో వ్రతాలు, పూజలు, కళ్యాణాలు చేయించాలన్నారు.

ప్రతి గ్రామంలో హిందూ ప్రచారం చేసేవారుండాలి..

ప్రతి గ్రామంలో హిందూ ధర్మ ప్రచారం చేసే వ్యక్తి ఉండాలి అన్నారు. గ్రామాలలో యువత పాశ్చాత్య సంస్కృతి వైపు వెళ్లకుండా హిందూ సాంప్రదాయాలు తెలిసే విధంగా ధర్మ ప్రచారాలు నిర్వహించి, కుటుంబము, సాంప్రదాయము, సంస్కృతి గురించి తెలియజేయాలన్నారు. క్షేత్రాలలో అన్నదానం, సేవా కార్యక్రమాలు, ధర్మప్రచారం, ధర్మ విద్య, యువతకు ఉపాధి లాంటి కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. రాయలసీమలోని ముఖ్యమైన క్షేత్రాల్లో చాలా అభివృద్ధి చెందుతున్న క్షేత్రం శ్రీశైలం కావున శ్రీశైల క్షేత్రానికి పక్కనే ఉన్నటువంటి మహానంది పుణ్యక్షేత్రం కూడా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని అన్నారు. భక్తుల సహకారంతో మహానంది ఆలయం అభివృద్ధి పథం వైపు సాగుతుంది అన్నారు. హైదరాబాదులో నూతన విజ్ఞానం, సంస్కృతి అందేలా పాఠశాలలు ఏర్పాటు చేయబోతున్నమన్నారు. కాశీ క్షేత్రంలో 110 కోట్లతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఒంగోలు ప్రక్కన 31 ఎకరాలలో సీబీఎస్ఈ స్కూల్ సంస్కృతి విద్య విజ్ఞాన కేంద్రంను ఏర్పాటు చేయబోతున్నామన్నారు. అనంతరం మహాశివరాత్రి పోస్టర్ ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి, ఏఈఓలు మధు, ఓ.వెంకటేశ్వర్లు,వేద పండితులు రవిశంకర్ అవధాని, దేవస్థానం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News