Gold-Dreams: సాధారణంగా కలలు అనేవి మన నిద్రలో కనిపించే దృశ్యాలుగా భావించినా, వాటి వెనుక లోతైన అర్థం ఉందని స్వప్న శాస్త్ర నిపుణులు చెబుతారు. మన ఆలోచనలు, మనసులో దాగి ఉన్న కోరికలు కలల రూపంలో బయటపడతాయి. ఒకే రకమైన కల రెండు వేర్వేరు వ్యక్తులకు వచ్చినా, వారి పరిస్థితుల ఆధారంగా దాని అర్థం మారుతుంది. ఆ కలల్లో బంగారం కనిపించడం ప్రత్యేకమైన సూచనగా పరిగణిస్తారు. ఎందుకంటే బంగారం అనేది సంపద, శ్రేయస్సు, అదృష్టానికి ప్రతీకగా ఎప్పటి నుంచో భావిస్తారు.
కలలో బంగారు ఆభరణాలు…
బంగారం కనబడిన కల అనేక రకాల అర్థాలను కలిగిస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఉదాహరణకి, ఎవరికైనా కలలో బంగారు ఆభరణాలు కనిపిస్తే అది వారి ఆత్మవిశ్వాసం, వ్యక్తిగత విలువ పెరుగుతున్న సంకేతంగా భావిస్తారు. బంగారు నాణేలు కనబడితే అది ఆర్థిక లాభాలు దరిచేరబోతున్నాయని చెప్పే సూచన. అలాగే బంగారు బిస్కెట్లు కనిపిస్తే పెద్ద స్థాయిలో పెట్టుబడులు, విస్తృత లాభాలు పొందే అవకాశం ఉందని చెబుతారు.
బంగారం దొరికినట్లు..
ఇక కలలో బంగారం దొరికినట్లు అనిపిస్తే అది శుభప్రదమైన విషయం అని చెబుతుంటారు. ఈ కల త్వరలోనే జీవితంలో సానుకూల పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయని సూచిస్తుంది. ఉద్యోగంలో పదోన్నతి, వ్యాపారంలో లాభాలు లేదా కొత్త ఆర్థిక అవకాశాలు దక్కే అవకాశం ఉందని నిపుణులు వివరించుతున్నారు. జీవితంలో ముందుకు వెళ్లే మార్గంలో అదృష్టం తోడుగా ఉంటుందనే సంకేతాన్ని కూడా ఈ కల చూపుతుంది.
బంగారాన్ని కోల్పోయినట్లు..
కానీ ప్రతిసారీ బంగారం కల శుభప్రదమే అని అనుకోవడం సరైంది కాదు. ఉదాహరణకి, కలలో బంగారాన్ని కోల్పోయినట్లు కనిపిస్తే అది ఆర్థిక నష్టాలు కలగవచ్చనే హెచ్చరికగా భావించాలి. అలాగే బంగారం దొంగిలించినట్లు అనిపిస్తే పనుల్లో అడ్డంకులు, ఆలస్యాలు తలెత్తే అవకాశం ఉంటుందని చెబుతారు. అంటే బంగారం కలలో ఎలా కనిపిస్తుందో దానిపైనే ఫలితం ఆధారపడి ఉంటుంది.
మంచి సూచికలుగా..
స్వప్న శాస్త్రం ప్రకారం, బంగారం కొనుగోలు చేస్తున్నట్లు కల వస్తే అది పెట్టుబడులు పెంచడం లేదా వ్యాపార విస్తరణ సూచనగా పరిగణిస్తారు. వ్యాపార వేత్తలకు ఇలాంటి కలలు మంచి సూచికలుగా భావిస్తారు. మరోవైపు బంగారం దాచడం లేదా దాచిపెట్టిన బంగారం కనబడటం మీ వ్యక్తిగత రహస్యాలు లేదా అంతర్గత భయాలకు సంకేతం కావచ్చు. అంటే కల కేవలం ఆర్థిక విషయాలను మాత్రమే కాకుండా మనసులోని భావాలను కూడా ప్రతిబింబిస్తుంది.
అలంకరించుకోవడం…
ఇక బంగారం ధరించడం లేదా ఆభరణాలు అలంకరించుకోవడం కలలో కనబడితే అది మీ జీవితంలో గౌరవం, ఖ్యాతి పెరగబోతున్న సూచన. ఇది సమాజంలో మంచి పేరు తెచ్చుకునే పరిస్థితులు త్వరలోనే ఏర్పడతాయని సూచిస్తుంది. కలలో ఇతరులు బంగారం ధరించి కనిపిస్తే వారి ద్వారా మీ జీవితంలో శ్రేయస్సు దక్కవచ్చని కూడా కొంతమంది నమ్ముతారు.
Also Read: https://teluguprabha.net/devotional-news/aprajita-plant-direction-in-home-for-wealth-and-prosperity/
అదేవిధంగా బంగారం తవ్వడం, త్రవ్వి దొరకడం వంటి కలలు వస్తే అది కొత్త అవకాశాలు, అనుకోని లాభాలను సూచిస్తుంది. ఇప్పటివరకు దొరకని వనరులు లేదా దాచిన ప్రతిభ బయటపడే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఈ తరహా కలలు ముఖ్యంగా కొత్త ప్రాజెక్టులు ప్రారంభించబోయే వారికి సానుకూల సంకేతంగా భావిస్తారు.


