ఆసియా ఖండంలో అతిపెద్ద ఆదివాసి జాతర మేడారం (Medaram Jathara) సమ్మక్క-సారలమ్మ జాతర. రెండేళ్లకు ఒకసారి మహా శుద్ధ పౌర్ణమి రోజున తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో ఈ జాతర పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈ మహ జాతరకు భక్తులు కోటికి పైగా తరలివస్తారు. 2025 ఫిబ్రవరి 12 నుంచి 15 వ తేదీ వరకు మేడారం మినీ జాతర జరగనుంది.
ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు
ఇక్కడ కొలువైన వన దేవతలను సందర్శించి మెుక్కులు చెల్లించుకునేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు చత్తీస్గడ్, మహారాష్ట్ర, ఒడిస్సా ఇతర మారు మూల ప్రాంతాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు.
ఫిబ్రవరి 12 నుంచి 15 వరకు
మహా జాతర జరిగిన మరుసటి సంవత్సరం మినీ జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.ఈ సంవత్సరం ఫిబ్రవరి 12,13,14,15వ తేదీల్లో మినీ జాతర నిర్వహించనున్నట్లు ఇప్పటికే ఆలయ పూజారులు దేవాదాయ శాఖకు లెటర్ కూడా రాశారు.
20 లక్షలకు పైగా భక్తులు
ఈ యేడాది జరిగే మినీ జాతరకు 20 లక్షలకు పైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చకచక చేస్తోంది. ఇక్కడ అన్ని ఏర్పాట్లకు ఇప్పటికే తెలంగాణ సర్కార్ కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుంది.
పలు అభివృధ్ధి పనులు
మేడారం, కన్నెపల్లి, కాల్వపల్లి, ఊరట్టం గ్రామాల్లో రోడ్ల అభివృద్ధి పనులు చేపట్టారు. మేడారం గద్దెల వద్దకు వచ్చే భక్తుల కోసం చలవ పందిళ్ల నిర్మాణం చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది.